శ్రీశైలం డ్యాం వద్ద 7 గేట్లు ఎత్తివేత

కృష్ణ.. తుంగభద్ర నదుల్లో మళ్లీ పెరుగుతున్న వరద

కర్నూలు: శ్రీశైలం డ్యాం వద్ద ఏడు గేట్లు ఎత్తారు. ఎగువ నుండి వరద ప్రవాహం పెరుగుతున్న కొద్దీ గేట్లు ఎత్తుతూ నీటి విడుదలను పెంచుతున్న అధికారులు కొద్దిసేపటి క్రితం ఏడో గేటు కూడా ఎత్తేశారు. ఎగువన ఆల్మట్టి నుండి నీటి ప్రవాహం నిలకడగా వస్తున్నా.. దిగువన నారాయణపూర్ వద్ద వరద భారీగా పెరుగుతోంది. మరో వైపు తుంగభద్ర నదిలో కూడా వరద పెరుగుతోంది. తుంగభద్ర డ్యాం వద్ద 9 గేట్లు ఎత్తి నీటి విడుదల పెంచారు. కృష్ణా నదిలో మళ్లీ పెరుగుతున్న వరద దిగువ ప్రాంతాల్లోని చివరి ఆయకట్టు భూముల రైతుల్లో ఆశలు రేపుతోంది.

శ్రీశైలం డ్యాం వద్ద గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేయడం ఈ సీజన్లో ఇది నాలుగోసారి. గత ఏడాదిలానే మంచి వరద వస్తోంది. వరద ప్రవాహం పూర్తిగా తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుతోంది. రెండు రోజుల క్రితం వరద నిలిచిపోతుందని భావించిన తరుణంలో నారాయణపూర్ నుండి ఒక్కసారిగా వరద పోటు పెరిగింది. ఫలితంగా నిన్నటి నుండి శ్రీశైలానికి వరద పోటు పెరుగుతూ వస్తోంది. ఇది క్రమంగా గేట్లు ఎత్తే వరకు వెళ్లింది. ఒకటి రెండు రోజుల్లో ఎత్తిన గేట్లు మూసేస్తామని అధికారులు వేసిన అంచనాలు కూడా తలకిందులు చేస్తూ.. రెండో రోజూ కూడా వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఉదయం ఒక గేటు ఎత్తడంతో మొదలై కొద్దిసేపటి క్రితం 7వ గేటు ఎత్తే వరకు వెళ్లింది.

ప్రస్తుతం శ్రీశైలం డ్యాంకు ఇన్ ఫ్లో 2 లక్షల 41 వేల క్యూసెక్కులు వస్తుండగా.. ఏడు గేట్ల ను 10 అడుగులమేర ఎత్తి 1 లక్షా 95 వేల 881 క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 30 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల వద్ద 13 గేట్లు ఎత్తివేత

ఎగువన ఆల్మట్టితోపాటు.. దాని దిగువన నారాయణపూర్ ల నుండి జూరాలకు వరద పోటు పెరిగింది. దీంతో జూరాల వద్ద 13 గేట్లు ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఎగువన ఆల్మట్టి నుండి గత 20 రోజులుగా 60 వేల క్యూసెక్కులు నిలకడగా విడుదల చేస్తున్నప్పటికీ నారాయణపూర్ ను దాటి వచ్చేలోపు తగ్గిపోయేది. అయితే రెండు రోజులుగా నారాయణపూర్ పరివాహక ప్రాంతాల్లో వరద పెరగడంతో.. అక్కడి నుండి ఏకంగా 1 లక్షా 49 వేల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. దీంతో నిన్నటి నుండి వరద ప్రవాహానికి అనుగుణంగా గేట్లు ఎత్తుతూ నీటి విడుదల చేస్తున్న అధికారులు కొద్దిసేపటి క్రితం మొత్తం 13వ గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. 1044.587 అడుగులతో 9.398 టీఎంసీల కెపాసిటీ ఉన్న జూరాల డ్యాంలో పూర్తి స్థాయి నీటిమట్టం మెయిన్ టెయిన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1 లక్షా 49వేల క్యూసెక్కులు వస్తుండగా.. 13 గేట్ల ద్వారా 1 లక్షా 7 వేల 408 క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 32 వేల క్యూసెక్కులు, భీమా-1, 2 లకు 650, 750 క్యూసెక్కుల చొప్పున.. పార్లెల్ కెనాల్ కు 750 క్యూసెక్కులు కలిపి మొత్తం 1 లక్షా 42 వేల క్యూసెక్కులు దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.

నాగార్జునసాగర్ కు 64 వేల క్యూసెక్కుల వరద

ఎగువ నుండి నీటి విడుదల పెరుగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాంకు వరద మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం 64 వేల క్యూసెక్కులు వస్తోంది. 590 అడుగులతో.. 312 టీఎంసీల కెపాసిటీ ఉన్న సాగర్ డ్యాంలో పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంచారు. ఇకపై నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వస్తున్న వరదను నిల్వ చేసే అవకాశం లేక వస్తున్నట్లే దిగువకు పంపిస్తున్నారు. 13వేల 524 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ.. విద్యుత్  ఉత్పత్తి చేస్తుండడంతోపాటు.. కాలువలకు మరో 10వేల 339 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Latest Updates