ఎస్సారెస్పీ గేట్లు ఓపెన్​.. పోటెత్తిన టూరిస్టులు

  • ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలతో పెరిగిన వరద
  • ఎస్సారెస్పీ నుంచి వేల క్యూసెక్కులు  దిగువకు విడుదల
  • ప్రాజెక్టులో నీటి నిల్వ 83.772 టీఎంసీలు
  • రాత్రికి 34 గేట్లు మూసేసిన అధికారులు

నిజామాబాద్, వెలుగు:

ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలకు గోదావరి ఉరకలెత్తడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఎస్సారెస్పీకి ఏర్పాటు చేసిన 42 వరద గేట్లను శనివారం అధికారులు తెరిచారు. దీంతో 2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు పరుగులు పెడుతోంది. గంటకు ముప్పావు టీఎంసీ చొప్పున శనివారం సాయంత్రానికి దాదాపు 16 టీఎంసీల వరకు నీటిని దిగువకు వదిలారు. ఎగువన మహారాష్ట్ర పరిధిలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండటంతో అక్కడి అధికారులు గేట్లన్నీ తెరిచారు.

దీంతో వరద ఉధృతి ఎస్సారెస్పీలోకి చేరుతోంది. తొలుత ఎస్పారెస్పీ అధికారులు 42 వరద గేట్లను ఎత్తి  2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శనివారం రాత్రి 7 గంటల తర్వాత ఎగువ నుంచి ఇన్‍ఫ్లో తగ్గడంతో వరద గేట్లన్నింటినీ అధికారులు మూసేశారు. మళ్లీ రాత్రి 9.30 గంటలకు ఎనిమిది గేట్లు ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టులో వాటర్ లెవెల్ 1,089.80 అడుగులు, 83.772 టీఎంసీలు ఉంది. రాత్రి ఏడు గంటలకు ఇన్‍ఫ్లో 80,570 క్యూసెక్కులు మాత్రమే ఉందని, ఎగువ నుంచి ఇన్‍ఫ్లో పెరిగితే మళ్లీ గేట్లు తెరిచే అవకాశముంటుందని ఎస్సారెస్పీ డీఈఈ జగదీష్ తెలిపారు.

పోటెత్తిన టూరిస్టులు

ఎస్పారెస్పీ అందాలను చూసేందుకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో ప్రాజెక్టుకు చేరుకుంటున్నారు. భద్రతా కారణాలరీత్యా అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది టూరిస్టులను డ్యాంపైకి అనుమతించడం లేదు.

Latest Updates