30 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీళ్లు

హైదరాబాద్, వెలుaగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద వానాకాలం, యాసంగి సీజన్లలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంతో వరద కాలువ యేడాది పొడవునా సజీవంగా ఉంటుందని చెప్పారు. ఈ యేడు కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు వస్తాయని, ఇప్పటికే నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేశారని, జూరాలపై ఏర్పాటు చేసిన లిఫ్టుల ద్వారా వెంటనే చెరువులు నింపాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల కింద సాగునీటి విడుదల, ఎస్సారెస్పీ వరద కాలువపై తూముల ఏర్పాటు, ఇప్పటిదాకా సాగునీరు అందని ప్రాంతాలకు నీటిని ఇచ్చే ప్లాన్ సిద్దం చేయడంపై ఆదివారం మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం ప్రగతి భవన్ లో రివ్యూ చేశారు.

ఎక్కువ భూములకు నీళ్లు చేరాలి..

‘‘గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయం చేసి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసింది. ఉద్యమ స్పూర్తితో చెరువులను పునరుద్ధరించింది. ఇలా చేసిన పనుల ఫలితం ప్రజలకు అందాలంటే వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు నీరు అందించడమే మార్గం. గతంలో తెలంగాణ సాగునీటికి గోస పడ్డది. రాష్ట్రం ఏర్పడినాక టీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల వల్ల ఇప్పుడు పుష్కలంగా నీటి లభ్యత ఏర్పడింది. ముందుగా చెరువులను నింపాలి. తర్వాత రిజర్వాయర్లను నింపాలి.  ఓ ప్లాన్ ప్రకారం నీటిని సరఫరా చేయాలి.  చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలి’’ అని సీఎం చెప్పారు.

అవి జీవధారలు

‘‘కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి రెండు టీఎంసీలు తరలించేందుకు వెసులుబాటు ఉంది. వరద కాలువ, కాకతీయ కాలువ, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు యేడాది పొడవునా నిండే ఉంటాయి. అవి జీవధారలుగా మారుతాయి‘‘ అని సీఎం చెప్పారు. ఎస్సారెస్పీలో ఎప్పుడూ 30 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వరద కాలువ, కాకతీయ కాలువ మధ్యలో 139 చెరువులున్నాయని, వాటిలో నీరు అందని చెరువులు నింపేందుకు వరద కాలువపై తూములు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో వరద కాలువ 365 రోజులు సజీవంగా ఉంటుందన్నారు. వరద కాలువ దక్షిణ భాగంలో నీరందని ప్రాంతాలను గుర్తించి అక్కడి చెరువులు నింపాలన్నారు. ఆరు నెలల్లోగా ఈ పనులు పూర్తి చేయాలన్నారు. ఎల్లంపల్లిలో నీటి లభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించారని, ఈ ప్రాజెక్టు నుంచి 90 వేల ఎకరాల్లోపే నీరు అందుతుందని, మిగతా ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీటిని ఇవ్వాలన్నారు. ‘‘ఇప్పటికే నారాయణ పూర్ రిజర్వాయర్ నుంచి నీరు వదిలారు. జూరాల, భీమా 2 లిఫ్టుల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలి. రామన్ పాడు రిజర్వాయర్ నింపాలి. కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరివ్వాలి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి రిజర్వాయర్ నిర్మించాలి. లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలి’’ అని అన్నారు.

కోటి ఎకరాలకు నీరందే వ్యవస్థ వచ్చింది..

రాష్ట్రంలో సాగునీటి రంగం ఉజ్వలంగా మారిందని, భారీ ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు వచ్చాయని, చెరువులు బాగుపడ్డాయని సీఎం తెలిపారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప వ్యవస్థ ఏర్పడిందని, దాన్ని సమర్థంగా నిర్వహించడం ముఖ్యమన్నారు. ఇరిగేషన్ లో పనిభారం పెరిగిందని, ఎక్కువ జోన్లు ఏర్పాటు చేసుకొని ఒక్కో జోన్ కు ఒక సీఈని ఇన్ చార్జిగా నియమించాలన్నారు. గతంలో మాదిరిగా మేజర్, మీడియం, మైనర్, ఐడీసీ వద్దని, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ అంతా ఒకే విభాగంగా పనిచేయాలన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులకు ఎమర్జెన్సీ పనులు చేసుకోవడానికి అవసరమైన నిధులు మంజూరు చేసే అధికారం కల్పించాలన్నారు.

లాక్ డౌన్ కంటైన్ మెంట్ జోన్లపై నిర్ణయం రాష్ట్రాలదే

Latest Updates