స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ వాయిదా

దేశ వ్యాప్తంగా 4800పైగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన సీహెచ్ఎస్ఎల్, జేఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగాల్సిన కంబైన్డ్ హైయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) టైర్-1 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు SSC ప్రకటించింది. అలాగే మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగాల్సిన జూనియర్ ఇంజనీర్ (JE) టైర్ ఎగ్జామ్ ను కూడా పోస్ట్ పోన్ చేసినట్లు చెప్పింది. ఈ పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించబోయేది తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి వచ్చాక పరిస్థితిని బట్టి సమీక్షించుకుని ఈ పరీక్షల నిర్వహణ జరుగుతుంది.

SSC CHSL 2019 & JE 2019 exam postponed due to COVID19 outbreak

స్కూళ్లు, కాలేజీలు బంద్

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వేగంగా ప్రపంచమంతా విస్తరిస్తోంది. ఇప్పటికే 160కి పైగా దేశాలకు వైరస్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా 2.3 లక్షల మందికి వైరస్ సోకింది. అందులో 9300 మంది మరణించారు. ఇక భారత్ లో గురువారం రాత్రి వరకు 190 మందికి పైగా వైరస్ బారినపడ్డారు. ఇందులో 20 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో 14 మంది వైరస్ బారినపడగా.. ఒక పేషెంట్ డిశ్చార్ అయ్యాడు. రోజు రోజుకీ దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అన్ని రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, థియేటర్లు, మాల్స్ వంటివన్నీ మూసేశాయి. పబ్లిక్ ఈవెంట్స్ లాంటివి నిర్వహించకుండా నిషేధం విధించాయి. ప్రజలు బయట తిరగకుండా స్వీయ నియంత్రణ పాటించాలని ప్రభుత్వాలు సూచించాయి.

Latest Updates