- స్టూడెంట్ ఫొటో స్థానంలో పబ్జీ బొమ్మ
- క్రియేట్ చేసిన స్కూల్ మేనేజ్మెంట్!
- ‘ఎస్’ ది స్కూల్‌పై చర్యలు తీసుకుంటామన్న అధికారులు
స్టూడెంట్ పేరు హిదయత్ పబ్జీ, తండ్రి పేరు తాహెర్ పబ్జీ లైట్, తల్లిపేరు రేష్మా ఫాతిమా… స్టూడెంట్ ఫోటో ప్లేస్ లో పబ్జీ బొమ్మ… ఇది బుధవారం టెన్త్ హాల్‌టికెట్‌లో దర్శనమిచ్చిన చిత్రం. ఓ ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ తప్పిదం, అధికారుల నిర్లక్ష్యంతో లేని విద్యార్థి పేరుతో ఈ హాల్‌టికెట్ బయటకొచ్చింది. హైదరాబాద్జిల్లాలోని షాలిబండలోని‘ఎస్’ ది స్కూల్ లో 43 మంది విద్యార్థులున్నారు. కానీ మేనేజ్మెంట్ 44 మంది ఉన్నట్టు అధికారులకు వివరాలు పంపించింది. 43 మంది వివరాలు సక్రమంగానే ఉన్నప్పటికీ, మరొకరికి హిదయత్ పబ్జీ పేరుతో అప్లై చేశారు. ఈ నామినల్ రోల్స్ లో ఏమైనా తప్పులున్నాయా? అని అధికారులు తిరిగి మేనేజ్మెంట్ను ప్రశ్నించినా అన్ని సక్రమంగానే ఉన్నాయని సమాధానం ఇచ్చారంటూ అధికారులు చెప్తున్నారు. ఇష్యూ చేసిన హాల్‌టికెట్(2022114399)ను స్కూల్ ప్రతినిధి సోషల్ మీడియాలో పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. బుధవారం ఓ గంట సమయంలోనే వెబ్సైట్ నుంచి హాల్ టికెట్‌ను 70 సార్లు డౌన్లోడ్ చేసినట్టు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు విచారణ చేపట్టారు. అసలు హిదయాత్ పేరుతో స్టూడెంట్ లేరని గుర్తించారు. ‘ఎస్’ ది స్కూల్ మేనేజ్మెంట్పై చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ‘వెలుగు’తో చెప్పారు. జినల్ హాల్‌టికెట్‌ను స్వాధీనం చేసుకున్నామనీ, వెబ్సైట్నుంచి హాల్‌టికెట్‌ను తొలగించామన్నారు.