సీఎంకు నోటీసియ్యాలె.. అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్పిండు

  • సింగరేణి బకాయిలు రూ. 5,872 కోట్లే అన్నడు
  • మొత్తం చెల్లించామనడం  అబద్ధం
  • విద్యుత్ సంస్థలు, ఆర్టీసీ నిండా మునిగినయ్
  • సీఎం ఇప్పుడు సింగరేణినీ ముంచేసిండు
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు:

సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలాడారని, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ‘‘సింగరేణికి బకాయి ఉన్న రూ. 5,872 కోట్లను చెల్లించామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సాక్షిగా ప్రకటించారు. కానీ అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటున్నారు. మరి తప్పుడు సమాచారం ఇచ్చి సభను తప్పుదోవ పట్టించిన సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం ఎందుకు కోరడం లేదు?” అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థలను, ఆర్టీసీని నిండా ముంచడంతో పాటు సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో పడేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు సింగరేణి సంస్థను కూడా ముంచేశారని మండిపడ్డారు.

సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టేశారు

సింగరేణి కార్మికులకు 28 శాతం బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించి తానేదో వారిని ఉద్ధరించినట్లు సీఎం భావిస్తున్నారని, కార్మికులు కనీసం30 శాతం బోనస్ ఆశిస్తే, అంతకన్నా తక్కువే ప్రకటించారన్నారు. వచ్చే నెలలో దసరా, దీపావళి పండుగలు ఉన్నందున బోనస్ ను ఈ నెల జీతంతో  కలిపి ఇవ్వాలన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 1 శాతమే ఎక్కువ బోనస్ ఇచ్చారన్నారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. పిల్ల పుట్టక ముందే కుల్ల కుట్టినట్లుగా సీఎం లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి, సరైన అంచనా లేకుండా ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. సింగరేణి కార్మికులనూ అలాగే మోసం చేశారన్నారు.

10 వేల కోట్లు ఎగ్గొడితే సంస్థ ఏం కావాలె?

దశాబ్దాల నుంచి లాభాల్లో ఉన్న సింగరేణి ఇప్పుడు అప్పులు తీసుకొని, వాటికి వడ్డీలు చెల్లించే స్థితికి చేరుకుందన్నారు. సింగరేణి బొగ్గును, విద్యుత్ ను వాడుకొని ఆ సంస్థను నిండా అప్పుల ఊబిలోకి నెట్టివేశారని విమర్శించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లుగా సింగరేణి సంస్థ కు రూ.13,105 కోట్లను ప్రభుత్వం వివిధ రకాలుగా బకాయి పడిందన్నారు. ఇందులో దాదాపు రూ.10 వేల కోట్ల మేరకు ముంచిందన్నారు. సింగరేణి వార్షిక టర్నోవరే25 వేల కోట్ల రూపాయలని, ఇందులో10 వేల కోట్లను ఎగ్గొడితే ఆ సంస్థ పరిస్థితి ఏమిటని లక్ష్మణ్ ప్రశ్నించారు.

జైపూర్ ప్లాంటుకు1200 కోట్ల బకాయిలు 

మంచిర్యాల జిల్లా జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వమే వాడుకొని రూ.1200 కోట్లను బకాయి పడిందని ఆయన ఆరోపించారు. ఆరు జిల్లాల పరిధిలోని20 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కనీస సౌకర్యాల కల్పన కోసం మినరల్ ఫండ్ కింద సింగరేణి రూ.1600 కోట్ల కేటాయిస్తే, వాటిని కూడా సర్కారు ఇతర అవసరాల కోసం వాడుకుందన్నారు. ప్రభుత్వం బయటి నుంచి ఒక్కో యూనిట్ విద్యుత్ ను రూ.7 చొప్పున,  కొంటూ, సింగరేణి జైపూర్ ప్లాంట్ నుంచి మాత్రం రూ. 3.42కే కొంటోందని, ఆ డబ్బులు కూడా ఇవ్వకపోతే సంస్థ ఎలా నడుస్తుందో చెప్పాలన్నారు.

అప్పుడు ఓపెన్ కాస్ట్ లొద్దని.. ఇప్పుడెందుకు?

ఓపెన్ కాస్ట్ ల పేరుతో తెలంగాణను బొందల గడ్డగా మార్చుతున్నారని ఉద్యమ సమయంలో ఆరోపించిన కేసీఆర్, ఇప్పుడు 7 ఓపెన్ కాస్ట్ లకు అనుమతిచ్చారని లక్ష్మణ్​ అన్నారు. కారుణ్య ఉద్యోగ నియామకాలు30 శాతం కూడా  పూర్తి కాలేదన్నారు. 20 ఏళ్లుగా సింగరేణి కార్మికులకు రూ. 1000 పెన్షనే అందుతోందని, మూడేళ్లకోసారి సమీక్షించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ పనే చేయడం లేదన్నారు. వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్, వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను వెంటనే జరిపించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం నిలువునా చీలిపోయిందని, ఇప్పుడు ఎన్నికలు పెడితే ఓడిపోతామనే భయంతోనే సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తున్నారన్నారు. సింగరేణిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని చెప్పిన హామీ నెరవేర లేదన్నారు. సీఎం కూతురు కవిత టీఆర్ఎస్ అనుబంధ సంఘం నాయకురాలిగా రూ. 400 కోట్లతో 10 వేల క్వార్టర్లను నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు.

రేవంత్‌కు కాంగ్రెస్‌పై నమ్మకం లేదు 

కాంగ్రెస్ పై ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డికి నమ్మకం లేదని, టీఆర్ఎస్ పై పోరాడే శక్తి, సామర్థ్యాలు కాంగ్రెస్ కు లేవని లక్ష్మణ్​ అన్నారు. ‘రెండు పార్టీలు లోపాయికారిగా కుమ్మక్కు అయ్యాయి. అందుకే విద్యుత్ అవినీతికి సంబంధించిన ఆధారాలను రేవంత్ ​నాకు ఇస్తానని అంటున్నారు. అని వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రి గా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై విచారణ జరిపించి జైలుకు పంపిస్తామని కేసీఆర్ చెప్పారని, ఆ కేసు ఏమైందని లక్ష్మణ్ ప్రశ్నించారు.

State BJP president k.lakshman demand that have to notices to CM KCR

Latest Updates