రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి: వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం క్రాప్ కాలనీలు- ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఇస్తున్న ప్రాధాన్యం, బడ్జెట్ లో కేటాయింపులను సీఎం కేసీఆర్ వివరించారు. “రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నెలకొని ఉన్న వ్యవసాయానుకూల వాతావరణ, పర్యావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని, ఆయా జిల్లాల్లో ఉండే నేల స్వభావాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్రాన్ని అనేక పంటల కాలనీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణమైన వంటలు, దేశ విదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించేలా చేయడమే ఈ క్రాప్ కాలనీల లక్ష్యం. తద్వారా ప్రస్తుతం గిట్టుబాటు ధర కోసం రైతులు పడుతున్న బాధలను
అధిగమించడానికి వీలవుతుంది. ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో చిన్న, మధ్యతరహా, భారీ ఆహార శుద్ధి కేంద్రాలు (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను) రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నిర్వహణలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఐకేపి ఉద్యోగులను, ఆదర్శంగా పని చేస్తున్న మహిళా సంఘాలను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది” అని అన్నారు.

“రైతులకు మద్ధతు ధర, రాష్ట్ర ప్రజలకు కల్తీ లేని ఆహార పదార్థాలను అందించాలని బహుముఖ వ్యూహంతో ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. ఈ సమన్వయ సమితుల వేదికలుగా రైతులందరినీ సంఘటిత పరచాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. సంఘటితమైన రైతులు తమ ప్రయోజనాలను తామే రక్షించుకోగలుగుతారని ప్రభుత్వం విశ్వసిస్తున్నది. వంటకాలనీల ఏర్పాటులోనూ, అత్యధిక దిగుబడులు సాధించడంలోనూ, పంటలకు గిట్టుబాటు ధరలు రాబట్టడంలోనూ రైతులు సమన్వయ సమితులు ఉజ్వలంగా పనిచేయాలని ప్రభుత్వం ఆశిస్తున్నది” అన్నారు.

“వ్యవసాయాభివృద్ధి రైతు సంక్షేమం కోసం దేశంలో మరే రాష్ట్రం ఖర్చు చేయనంత పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని యావద్దేశం ప్రశంసిస్తున్నది. చరిత్రలోనే మొదటి సారిగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 20,107 కోట్ల రూపాయలను
ప్రతిపాదిస్తున్నది” అని కేసీఆర్ వివరించారు.

Latest Updates