రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా మారింది: జగ్గారెడ్డి

రాష్ట్రం ఆత్మహత్యల తెలంగాణగా… గుండె పోటు తెలంగాణగా మారిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  ఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు ఎక్కడా కనపడటం లేదన్న జగ్గారెడ్డి… మంత్రి శ్రీనివాస్‌ గౌడ్,స్వామిగౌడ్ , మమత, రవీందర్, దేవీప్రసాద్, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యపై మాట్లాడకుండా ప్రభుత్వానికి చెంచా గిరి చేసుకుంటూ బతుకుతున్నారని ఆరోపించారు.  ఆర్టీసీ సమ్మెను బలహీనుడికి.. బలవంతునికి జరుగుతున్న పోరాటంగా అభివర్ణించిన ఆయన… భగవంతుడు ఎవరిని గెలిపిస్తాడో చూడాలన్నారు.

అంతేకాదు రాష్ట్రంలో ఉద్యమాలకు విలువ లేకుండా పోయిందన్నారు జగ్గారెడ్డి.  40 రోజులు ఆర్టీసీ సమ్మె జరగడం ఇదే మొదటిసారి అన్నారు. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకడం లేదన్నారు. తక్కువ జీతాలు ఉన్న ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే అనారోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ రోజు కూడా ఆవుల నరేశ్‌ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు. తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవని చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్  అన్నారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఒకవైపు  రైతుల ఆత్మహత్యలు…మరోవైపు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు జరుగుతుంటే  ప్రభుత్వానికి కొంచెం కూడా సిగ్గనపించడం లేదా అంటూ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.

Latest Updates