అప్పులు చేసి, ఆస్తులమ్మితే రాష్ట్రం అభివృద్ధి కాదు

అప్పులు చేసి, ఆస్తులమ్మితే రాష్ట్రం అభివృద్ధి కాదు

అప్పులు చేసి, ఆస్తులు అమ్మి రాష్ర్టాన్ని అభివృద్ధి చేయలేమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మానవ వనరుల అభివృద్ధి జరిగితేనే, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. ‘బడ్జెట్‌‌‌‌ను టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కారు ఓ న్యూస్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌గా మార్చింది. మస్తు నిధులిచ్చామని చప్పట్లు కొట్టించుకునేందుకు అంకెల గారడీతో బడ్జెట్‌‌‌‌ కేటాయింపులు చేసింది. ఆ కేటాయింపులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసి చూపించాలి’ అని సవాల్‌‌‌‌ విసిరారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్‌‌‌‌పై చర్చ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ‘నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దాని గురించి బడ్జెట్‌‌‌‌లో ఎందుకు ప్రస్తావించలేదు? ఎస్సీ, ఎస్టీ యువతకు షూరిటీ లేనిదే ఒక్క రూపాయి రుణం కూడా ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వక, సబ్సిడీ లోన్లు కూడా ఇవ్వకపోతే, బ్యాంకుల్లో లోన్లు అందించకపోతే నిరుద్యోగులు ఏం చేయాలి’ అని ప్రశ్నించారు.
   
గిరిజనులను బతకనివ్వరా?

‘ప్రభుత్వం పట్టాలిచ్చిన భూముల్లోనూ ఫారెస్టు ఆఫీసర్లు ట్రెంచులు కొడుతున్నారు. టైగర్ జోన్ అంటూ అడవిలోంచి ఒక్క పుల్లను తెచ్చుకోనివ్వట్లేదు. ఊరి వాగులో, చెరువుల్లో చేపలను పట్టుకోనివ్వకుండా వలలను తగలబెడ్తున్నారు. చెక్‌‌‌‌డ్యాంలు కట్టుకోనివ్వట్లే. రోడ్లను రిపేర్ చేయించుకోనివ్వట్లే’ అని సీతక్క మండిపడ్డారు. ‘గిరిజనుల ఇండ్లు దారుణంగా తయారు అయ్యాయి. వాటిని కప్పుకునేందుకు అడవిలో పొర్కను కూడా ఫారెస్టోళ్లు ముట్టనివ్వట్లేదు. సిమెంట్, రాడ్లు కొని ఇండ్లు కట్టుకునేంత స్థోమత గిరిజనులకు లేదు. టాయిలెట్లు కట్టుకోవడానికి ఊరి వాగులోని ఇసుకను కూడా తెచ్చుకోనివ్వకుండా గిరిజనులను ఇబ్బంది పెడుతున్నారు. అడవుల్లోని ప్రజల సమస్యలను కూడా ప్రభుత్వం కాస్త పట్టించుకోవాలి’ అని అన్నారు. కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం రూ.లక్షలు ఖర్చు అవుతోందని, కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీతక్క అన్నారు. రాష్ర్టంలో మహిళలపై దాడులు పెరగడం పట్ల, నడి రోడ్లపై హత్యలు జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.