సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ

సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ

సూర్యాపేట: పట్టణంలోని కోర్టు చౌరస్తాలో మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి కేటీఆర్, జగదీష్ రెడ్డిలు ఆవిష్కరించారు. సంతోష్ బాబు భార్య, తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులతో కలసి మంత్రులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తా గా  నామకరణం చేశారు. కల్నల్ సంతోష్ బాబు 10 అడుగుల కాంస్య  విగ్రహం ఆయన ధైర్య సాహసాలు గుర్తు చేసి స్ఫూర్తి రగిలించేలా రూపొందించారు. గాల్వాన్ లోయలో చైనాతో ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు వీరోచిత పోరాటం చేసి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన పోరాట స్ఫూర్తికి కేంద్రం గుర్తించి దేశంలో అత్యున్నత పురస్కారమైన మహావీర చక్ర అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

సంతోష్ బాబు లేక అప్పుడే ఏడాది అయిందంటే నమ్మలేకపోతున్నా: కేటీఆర్
సూర్యాపేట పట్టణంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన సందర్బంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు  మన దగ్గర నుంచి వెళ్ళిపోయి అప్పుడే సంవత్సరం అయిందంటే నమ్మలేకపోతున్నామన్నారు. చాలా గొప్పగా, ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపేలా కల్నల్ సంతోష్ బాబు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అత్యత్భుతం అని, ఇది మనందరికీ గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఇచ్చిన గౌరవం,  సముచిత స్థానం భారత సైన్యం మొత్తానికి  ధైర్యాన్నిచ్చిందన్నారు. స్ఫూర్తివంతమైన ,ఆదర్శప్రాయమైన  నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారని, ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 
సంతోష్ బాబు తల్లిదండ్రులు దేవుళ్లు: మంత్రి జగదీష్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సంతోష్ బాబును కన్న తల్లిదండ్రులు నిజంగా దేవుళ్లతో సమానమని కొనియాడారు. చావు అందరికీ వస్తుంది కానీ, సంతోష్ బాబు లాగా  సింహం లాగా, సమున్నతంగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబానికి అన్ని వేళలా అండగా వున్నారని, కొండంత భరోసా ఇచ్చారని వివరించారు. ఈ రోజు సంతోష్ బాబు వర్ధంతి, ఈరోజు  ఆయన విగ్రహాన్నీ మంత్రి కేటార్ చేతుల మీదుగా ఆవిష్కరణ  చేసుకోవడం  చాలా గర్వంగా ఉన్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్  దార్శనికతతో 18 లక్షల మందికి IT ఉద్యోగాలు కల్పించారని, చేనేత రంగాన్ని  ఆదుకున్న గొప్ప వ్యక్తి కేటీఆర్ అని ప్రశంసించారు. తెలంగాణ ఆశా కిరణం, భవిష్యత్తు కేటీఆర్ అని, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. 
కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషిని మాట్లాడుతూ భారత్ చైనా సరిహద్దుల్లో నా  భర్త సంతోష్ బాబు వీర మరణం పొందడాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన మరణవార్తతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్న తమకు అనుక్షణం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్ , జగదీష్ రెడ్డి ఇలా ప్రతి ఒక్కరు అండగా నిలిచారని.. సముచిత గౌరవాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. నా పిల్లల భౌష్యత్తు కోసం భరోసా ఇచ్చారు, నాకు  గౌరవ ప్రదమైన ఉద్యోగం కల్పించారు, ముఖ్యంగా మంత్రి జగదీష్ రెడ్డి  మాకు అన్ని వేళలా అండగా ఉంటూ ధైర్యం అందించారంటూ కృతజ్ఞతలు తెలిపారు.