కూల్‌‌గా ఉండు కేటీఆర్.. జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకో

జియాగూడ: టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఫెయిల్ అయిందని, పాత మ్యానిఫెస్టోనే కొత్తగా రూపొందించారని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి విమర్శించారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజల నుంచి రెస్పాన్స్ రావడం లేదన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోతోపాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టో కూడా ఫెయిల్ అయిందన్నారు. జియాగూడలో బీజేపీ అభ్యర్థి దర్శన్ తరఫున వివేక్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్.. టీఆర్ఎస్‌‌ మీద విరుచుకుపడ్డారు. జీహెచ్‌‌‌ఎంసీలో టీఆర్ఎస్‌‌కు 20 సీట్లు కూడా రావని తేలిపోయిందన్నారు.

‘బీజేపీ విడుదల చేసిన చార్జిషీట్ పై విమర్శలు చేస్తున్న కేటీఆర్.. మా చార్జిషీట్లో నీ అంశాలకు ముందు సమాధానం చెప్పు. జీహెచ్‌‌ఎంసీకి నిధులు కేటాయించకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తూ కమీషన్లు తీసుకున్నారు. అందుకే కేటీఆర్‌‌కు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కూల్‌‌గా ఉండు కేటీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించు. కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌గా ఉండి పార్లమెంట్ స్థానాల్లోనూ, దుబ్బాక ఉప ఎన్నికలోను ఓడిపోయారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఓడిపోబోతున్నారు. మతాల మధ్య విభేదాలను బీజేపీ సృష్టించడం లేదు. కేటీఆరే విద్వేషాలను సృష్టిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులతో వేధిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంచి పరిపాలన జరుగుతోంది. అది మీకు కనిపించడం లేదా కేటీఆర్? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బీజేపీ గుర్తు పువ్వు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తారు’ అని వివేక్ పేర్కొన్నారు.

Latest Updates