గ్రేటర్ ​వ్యాప్తంగా ఇంకా కొనసాగుతున్న నాలాల పనులు

గ్రేటర్ ​వ్యాప్తంగా ఇంకా కొనసాగుతున్న నాలాల పనులు

హైదరాబాద్, వెలుగు: పది రోజుల్లో మాన్​సూన్​ మొదలు కాబోతున్నా గ్రేటర్​వ్యాప్తంగా ఇంకా నాలల అభివృద్ధి, పూడికతీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఏటా అనేక కాలనీలు నీట మునుగుతున్నాయి. ఈసారి ఆ సమస్య లేకుండా చేస్తామని బల్దియా ఆఫీర్లు యాక్షన్​ప్లాన్ ప్రకటించి పనులు చేపట్టారు. ఏడెనిమిది నెలలుగా కొనసాగుతున్నా 50 నుంచి 60 శాతం మించి పూర్తి కాలేదు. ఎక్కడికక్కడ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. కొన్నిచోట్ల నాల వైడనింగ్​పనులు అసలు మొదలుకాలేదు. ఎండా కాలానికి ముందే నాలాల అభివృద్ధి, పూడిక తీత పనులు చేపట్టినా ఏ ఒక్కచోటా పూర్తి చేయలేదు.

టోలిచౌకిలో.. 

టోలిచౌకి తలాబ్​కట్ట సమీపంలో నదీం కాలనీ, నీరజ్ కాలనీ, విరాసత్ కాలనీ, షాదిమ్ నగర్ కాలనీలు ఉన్నాయి. ఇక్కడ ఇండ్ల మధ్య నుంచి నాలా ఉంటుంది. డ్రైనేజీ నీరు నేరుగా చెరువులో కలుస్తోంది. వర్షం కురిసిన ప్రతిసారి నాలాలు పొంగి ఇండ్లల్లోకి వరద చేరుతోంది. సపరేట్​డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ముంపు సమస్య తలెత్తుతోందని స్థానికులు వాపోతున్నారు. గతంలో ఈ కాలనీల్లో రెస్క్యూ టీమ్‌లు బోట్లు వేసుకుని వచ్చి ఇక్కడి ప్రజలను బయటకు తెచ్చారు. ఇలాంటి కాలనీల్లోనూ ఇంకా నాలా పూడికతీత పనులు పూర్తి కాలేదు. బయటికి తీసిన పూడిక మట్టి, చెత్త ఇంకా నాలా పక్కనే కుప్పలుగా పోసి ఉంది. 

అల్ జుబైల్‌ కాలనీలో.. 

ఫలక్‌నుమాలోని అల్ జుబైల్ కాలనీ చుట్టుపక్కల దాదాపు ఎనిమిది చెరువులు ఉన్నాయి. ఇక్కడ నాలుగు వేల కుటుంబాలు ఉంటున్నాయి. భారీ వర్షాలకు చెరువుల కట్టలు తెగి, పక్కనే ఉన్న నాలా పొంగి కాలనీ మొత్తం మునుగుతోంది. గతంలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద చేరింది. అనేక మంది నీట మునిగి చనిపోయారు. 8 నెలలుగా డ్రైనేజీ నాల విస్తరణ, పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. బయటికి తీసిన పూడిక నాల పక్కనే కుప్పలుగా పడి ఉంది. నాలా సైడ్ వాల్​ఇంత వరకు నిర్మించలేదు. ఆక్రమణలను పూర్తిగా తొలగించలేదు. మొత్తంగా సగం సగం పనులు అయ్యాయి. వానలు మొదలైతే మునుపటి పరిస్థితే రిపీట్ అయ్యేలా ఉంది.

లింగోజిగూడలో..

లింగోజిగూడ డివిజన్ నుంచి సరూర్ నగర్ చెరువు వరకు, సరూర్ నగర్ చెరువు నుంచి చైతన్యపురి మెయిన్ నాలా వరకు, అక్కడి నుంచి మూసి వరకు కొనసాగుతున్న నాలా పనులు స్లోగా సాగుతున్నాయి. బండ్లగూడ చెరువు నుంచి వచ్చే వరద కిందికి పోయే మార్గం కనిపించడం లేదు.వనస్థలిపురం కప్పల చెరువు వద్ద ఇదే పరిస్థితి ఉంది.

కుత్బుల్లాపూర్​లో.. 

కుత్బుల్లాపూర్​నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉమామహేశ్వరనగర్​ను ఏటా ఫాక్స్ సాగర్ చెరువు నిండి వచ్చే వరద ముంచెత్తుతోంది. 2020లో బస్తీ మొత్తం మునిగి 643 కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. కుత్బుల్లాపూర్ సర్కిల్​పరిధిలోని కెమికల్ నాలా పొంగి ప్రజలు దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నారు. సుమారు 93 కోట్లతో 13 కిలోమీటర్ల మేర నాలా, పైపులైను విస్తరణ పనులు చేపట్టగా ఇప్పటికీ10 శాతం కూడా పూర్తికాలేదు. ఉమామహేశ్వరనగర్ మునగుకుండా వేస్తున్న పైప్​లైన్​పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఫాక్స్​సాగర్​గతంలో మాదిగా నిండిపోతే నీటిని కిందికి వదలడానికి తూము గేట్లు పనిచేయడం లేదు.

నాగోల్ హనుమాన్ నగర్ కాలనీలో..

భారీ వర్షం కురిసిన ప్రతిసారి నాగోలు హనుమాన్​నగర్ కాలనీకి సమీపంలోని అన్నారం చెరువు పొంగుతోంది. ఈ కాలనీకి సమీపంలోని ఓ కాలేజ్ దగ్గర ఉన్న కుంట నిండి వరద ముంచెత్తుతోంది. రెండేళ్లుగా ఇదే పరిస్థితి. చెరువులు, కుంటలు నిండినప్పుడు నీటినికి కిందికి వదిలేందుకు ప్రత్యేకంగా పైప్​లైన్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నప్పటికీ ఆఫీసర్లు పట్టించుకోవడంలేదు.

ఎల్బీనగర్‌‌లో.. 

గత రెండేళ్లలో భారీ వర్షం కురిసిన ప్రతిసారి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని కాలనీలు ఆగం అవుతున్నాయి. జీహెచ్‌ఎం‌సీ, ఎస్‌ఎన్‌డీపీ ఆఫీసర్లు 2020 అక్టోబరు తర్వాత రూ.103 కోట్లతో తొమ్మిది ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పటివరకు పూర్తయింది 70 శాతం పనులే. మన్సూరాబాద్ కు ఎగువున ఉన్న 150 కాలనీల నుంచి వచ్చే వరద బండ్లగూడ చెరువు మీదుగా మూసిలోకి వెళ్లాల్సి ఉంది. ఆఫీసర్లు చెరువు ఇన్‌లెట్ పూర్తి చేశారు కానీ ఔట్ లెట్​పూర్తి చేయలేదు. 

రెండేళ్లయినా ఏం మారలే

సిటీలో 2020 అక్టోబర్ 1 నుంచి 14 వరకు 26.8 సెం.మీలు, అక్టోబర్ 13న ఒక్కరోజే 19.18 సెం.మీల వర్షపాతం నమోదైంది. పదుల సంఖ్యలో జనం చనిపోయారు. లక్షలమంది నిరాశ్రులయ్యాయి. ఎల్బీనగర్ నియోజక వర్గంలోని బైరామల్ గూడలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించారు. ఆ టైంలో ముంపు పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రులను నిలదీస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఖైరతాబాద్, బేగంపేట, పటేల్ నగర్ లో నీటమునిగిన ప్రాంతాలను నేతలు పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఈ ప్రాంతాల్లో నేటికీ ఎలాంటి మార్పులేదు. 

అధికారుల నిర్లక్ష్యమే కారణం

వందల కుటుంబాలకు ముప్పు ఉందని తెలిసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నారు. 2020లో వర్షాలకు ఫాక్స్ సాగర్ చెరువు నిండి ఉమామహేశ్వరనగర్ బస్తీ మొత్తం మునిగిపోయింది. స్థానికులు బస్తీ వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో నాయకులు హడావిడి చేసి పైపులైన్ వేయించారు. ముంపు నివారణ చర్యలు మాత్రం పూర్తిగా చేయలేదు. పనులు జరుగుతూనే ఉన్నాయి. పైపులైన్​ వేసినప్పటికీ మరోసారి ఫాక్స్ సాగర్ చెరువు నిండితే మునక తప్పదు.
- రాజు, ఉమామహేశ్వరనగర్, కొంపల్లి మున్సిపాలిటీ

అక్రమ నిర్మాణాలు తొలగించాలి

వర్షాకాలం వచ్చిందంటే భయంతో బతకాల్సి వస్తోంది. నాలాలు పొంగి వరద ఇండ్లలోకి చేరుతోంది. వాన కురిసిన ప్రతిసారి ఫ్యాక్టరీలు కెమిల్స్ వదులుతున్నాయి.కెమికల్ నాలాను విస్తరించడం సంతోషం. పనులు త్వరగా పూర్తిచేయాలి. నాలా వెడల్పుతోపాటు అక్రమ నిర్మాణాలను తొలగించాలి. భారీ వర్షాలు కురిసేలోపే పనులు పూర్తి చేస్తే బాగుంటుంది. 
- కృష్ణ, సుభాష్​నగర్, కుత్పుల్లాపూర్ సర్కిల్

60 శాతం పనులు పూర్తి

మా ఏరియాలో చేపట్టిన నాలాల పనులు 60 శాతం పూర్తయ్యాయి. కొనసాగుతున్న పనులను స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, లీడర్లు వచ్చి చూసి వెళ్తున్నారు.  నాలాల్లో ఆరు అడుగుల మేర పూడిక తీశాం. చెరువు నుంచి నీరు వెళ్లేందుకు టన్నెల్ పనులు పూర్తయ్యాయి. మాములు వానలకు అయితే తట్టుకోగలం. భారీ వర్షం పడితే మాత్రం మునుపటి పరిస్థితి రిపీట్ అవుతుంది. 
- జుల్ఫెకర్​యార్ ఖాన్, ప్రెసిడెంట్, నదీం కాలనీ, టోలిచౌకి

ఇంకో 2 నెలలు పట్టొచ్చు

నాలా పనులు మొదలుపెట్టి 8 నెలల పైనే అయింది. అల్ జుబైల్ కాలనీ నాలా పక్కన ఉన్న కొన్ని ఇండ్లను పడగొట్టాం. ఆఫీసర్లు వారికి వేరే చోట స్థలం కేటాయించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. పూర్తిగా కావడానికి ఇంకో రెండు నెలలు పట్టేలా ఉంది. 
- సాజిద్ ఖాన్, ప్రెసిడెంట్, అల్ జుబైల్ కాలనీ, ఫలక్ నుమా