పేరే మారింది! : ఇంకా రెగ్యులర్​ కాని కరెంట్​ ఆర్టిజన్లు

కోర్టు తీర్పు ఇచ్చినా
అమలు చేయని సర్కారు

23,667 మందికి సర్వీస్​
రూల్స్​ వర్తింపజేయాలని కార్మికుల డిమాండ్​

హైదరాబాద్, వెలుగురాష్ట్రం వచ్చి ఐదేళ్లలో కాంట్రాక్ట్​ కార్మికుల పేరు ఆర్టిజన్లుగా మారిందే తప్ప రెగ్యులరైజ్​ కాలేదని కరెంట్​ ఆర్టిజన్లు ఆవేదన చెందుతున్నారు. వేతన స్కేలు, టీఏ, డీఏ, హెచ్​ఆర్​ఏ వంటివేవీ అమలు కావడం లేదంటున్నారు. 1959 నుంచి కరెంట్​ కంపెనీల్లో కొనసాగుతున్న ఏపీఎస్​ఈబీ విధానాలు అమలు చేయట్లేదంటున్నారు. ఇవన్నీ లేకుండా తాము రెగ్యులరైజ్​ ఎలా అయినట్టని ప్రశ్నిస్తున్నారు. ఒక్క సంతకంతో 23 వేల మంది కార్మికులను రెగ్యులరైజ్​ చేస్తానని 2013 అక్టోబరు 5న ఉద్యమ నేతగా మింట్​ కాంపౌండ్​లో సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ, రాష్ట్రం వచ్చాక కూడా అమలు చేయలేదని టీటఫ్​ నేతలు ఆరోపిస్తున్నారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం 25 వేలు దాటలేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో 23,667 మంది ఆర్టిజన్లకు ఏపీఎస్​ఈబీ సర్వీస్​ రూల్స్​ వర్తింపజేయాలన్న ప్రధాన డిమాండ్​తో సమ్మెకు సిద్ధమవుతున్నారు ఆర్టిజన్​ కార్మికులు. పీస్​రేట్​తో పనిచేసే ఎస్​పీఎం, ఎంఆర్​జీ, స్టోర్​ వర్కర్స్​, స్పాట్​ బిల్లింగ్​, పీసీఏ, పీఏఏ వంటి 6,500 మంది కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, పాత రూల్స్​ కాదని కొత్తగా తెస్తున్న స్టాండింగ్​ ఆర్డర్స్​ను వెనక్కు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

కోర్టు తీర్పు ఇచ్చినా…

కాంట్రాక్ట్​ కార్మికులను రెగ్యులరైజ్​ చేస్తున్నట్టు 2017 జులై 29న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆర్టిజన్లుగా పేరు మార్చింది. జీతాన్ని 14 వేల రూపాయలు చేసింది. అయితే, ఉత్తర్వులొచ్చిన మూడు రోజులకే సత్యం రెడ్డి అనే లాయర్​, కార్మికుల రెగ్యులరైజేషన్​ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేశారు. కోర్టు స్టే ఇచ్చింది. దీంతో 2018 జులై 21న ఆర్టిజన్లు సమ్మెకు దిగారు. అదే నెల 29న కార్మికులతో విద్యుత్​ శాఖ మంత్రి చర్చలు జరిపారు. జీతాన్ని రూ.14 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. కోర్టు ఓకే చెప్పగానే రెగ్యులరైజ్​ చేస్తామని మాట ఇచ్చింది. కానీ, ఆర్టిజన్లను రెగ్యులరైజ్​ చేసుకోవచ్చంటూ గత ఏడాది సెప్టెంబర్​ 18న కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ చేయలేదు. ఆర్టిజన్లందరినీ రెగ్యులరైజ్​ చేసి ఉద్యోగాలిచ్చినట్టు అసెంబ్లీలో ప్రకటించినా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. రెగ్యులర్​ ఉద్యోగులకు వచ్చే వెసులుబాట్లేవీ వాళ్లకు అందట్లేదు. ప్రమాదాల్లో ఆర్టిజన్లు చనిపోయినా వారి కుటుంబాల్లోని వ్యక్తులకు కారుణ్య నియామకాల్లో జాబ్​ వచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్​ కంపెనీల రూల్స్​ను అమలు చేస్తామని విద్యుత్​ సంస్థల యాజమాన్యాలు చెబుతుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. డిమాండ్లను సాధించుకోవడానికి ఆందోళనలు
చేస్తున్నారు.

ఇవీ డిమాండ్లు

23,667 మంది ఆర్టిజన్లకు ఏపీఎస్​ఈబీ సర్వీస్​ రూల్స్​ వర్తింపజేయాలి

6,500 మంది పీస్​ రేట్​ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి

పర్మనెంట్​ ఉద్యోగుల ఈపీఎఫ్​ను జీపీఎఫ్​గా మార్చాలి

స్టాండింగ్​ ఆర్డర్స్​ను వెనక్కు తీసుకోవాలి

కరెంట్​ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయాలి

నోషనల్​ ఇంక్రిమెంట్​లోని తేడాలను తగ్గించాలి

ఒకే కంపెనీలో రెండు విధానాలుండొద్దు

స్కేల్​, ప్రమోషన్లు, బదిలీలు, హెచ్​ఆర్​ఏ, టీఏ, డీఏ, కారుణ్య నియామకాలు వంటి 70 డిమాండ్లు

వరంగల్ సభ తర్వాత సమ్మె

కరెంట్​ కార్మికులను రెగ్యులరైజ్​ చేయాలని కోరాం. రెగ్యులర్​ ఉద్యోగులకు వర్తించే రూల్స్​నే ఆర్టిజన్లకు వర్తింపజేయాలని డిమాండ్​ చేస్తున్నాం. కానీ ప్రైవేటు తరహాలో అమలు చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నాయి.  నోటీసిచ్చే ఉద్యమిస్తున్నాం. వరంగల్​ సభ తర్వాత మెరుపు సమ్మె చేస్తం.                         – పద్మారెడ్డి, చైర్మన్​, టీటఫ్

 

Latest Updates