
పీసీసీ చీఫ్ ప్రకటనపై మాణిక్కంతో కాంగ్రెస్ నేతలు
లీడర్లకు ఫోన్‌చేసి ఒపీనియన్ తీసుకున్న హైకమాండ్
ప్రకటన డిలే అయ్యే చాన్స్.. పదవి కోసం మళ్లీ ప్రయత్నాలు
ఢిల్లీకి వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ బై ఎలక్షన్ పూర్తయ్యే వరకు పీసీసీకి కొత్త చీఫ్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బై ఎలక్షన్ పూర్తయ్యే దాకా ఆగడమే మంచిదని పార్టీ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడ్ని వీలైనంత త్వరలో ప్రకటించాలని రెండు రోజుల కిందే ఏఐసీసీ చీఫ్ సోనియాను మాణిక్కం అప్రోచ్ అయ్యారు. దీంతో ఒకటీరెండు రోజుల్లో ప్రకటన వస్తుందన్న ప్రచారం జరిగింది. మంగళవారం ఏ క్షణమైనా ప్రకటన రావొచ్చని రాష్ట్ర నేతలంతా ఎదురు చూశారు. కానీ దానికి బ్రేక్ పడింది. ఈ బ్రేక్‌కు సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి రాసిన లెటర్ కారణమని నేతలు చెప్తున్నారు. తన నియోజకవర్గమైన నాగార్జునసాగర్‌కు బై ఎలక్షన్ ఉన్నందున, ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు కొత్త అధ్యక్షుడ్ని ప్రకటించొద్దని హైకమాండ్‌ను లెటర్లో జానారెడ్డి కోరారని, అందుకే వాయిదా పడిందని నమ్ముతున్నారు. దీన్ని బలపరిచే రీతిలో మాణిక్కం ఠాగూర్ బుధవారం పీసీసీ ముఖ్య నేతలతో జూమ్‌లో మీట్ అయ్యారు. ఈ మీటింగ్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డి, కుసుమ కుమార్ పాల్గొన్నట్లు తెలిసింది. కొత్త ప్రెసిడెంట్‌ను ఎప్పుడు ప్రకటిస్తే బాగుంటుందని వారి నుంచి మాణిక్కం అభిప్రాయాలు సేకరించారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఆమోదమేనని, అయితే సాగర్ బై ఎలక్షన్ వరకు ఆగితే అన్ని విధాలా మంచిదని నేతలు చెప్పినట్లు సమాచారం. మరో వైపు మధు యాష్కీ, వంశీచంద్ రెడ్డి, సంపత్ తదితరుల ఒపీనియన్‌ను ఏఐసీసీ పెద్దలు ఫోన్లో తీసుకున్నట్లు తెలిసింది.
మళ్లీ లీడర్ల ప్రయత్నాలు
తొలుత పీసీసీ అధ్యక్షుడి రేసులో చాలా మంది నేతలు ఉండగా.. చివరికి రేసులో ఇద్దరు ముగ్గురు మాత్రమే నిలిచారు. పదవి ఎంపీ రేవంత్కేనని వారం కిందటి వరకు ప్రచారం జరిగింది. దీనిపై కొందరు సీనియర్ నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల కింద ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు తెర మీదికి వచ్చింది. ఇప్పుడు సాగర్ ఎన్నికల వరకు ఆగాలని జానారెడ్డి లెటర్ రాయడంతో ప్రాసెస్ డిలే అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కొందరు లీడర్లలో మళ్లీ ఆశలు చిగురించాయి. పదవి కోసం మరో ప్రయత్నం చేసేందుకు రెడీ అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడి పదవికి అన్ని విధాలా తానే అర్హుడనని ఆయన ఏఐసీసీ పెద్దల ద్వారా హైకమాండ్‌కు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. సంపత్ కుమార్ కూడా పీసీసీ చీఫ్ పదవి తనకు ఇస్తే సామాజిక కూర్పు సరిగ్గా ఉంటుందని, రెడ్డికి ఇతర పదవులు ఇచ్చినా ఏ సమస్య రాదని మాణిక్కం ఠాగూర్‌కు చెప్పుకున్నట్లు సమాచారం. మధు యాష్కీతోపాటు మరో ఇద్దరు నేతలు కూడా చివరి ప్రయత్నాల్లో ఉన్నట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
For More News..