హెల్త్​ టాస్క్ ఫోర్స్ ఉంటే నాన్ స్టాప్ నిఘా

ప్రపంచంలో ప్రతి మూడు నాలుగేళ్లకొకసారి ఏదో ఒక వైరస్​ వ్యాపించడం, దాని ప్రభావంతో మన దేశంలోనూ అలర్ట్​గా ఉండడం జరుగుతోంది. ఈ కొత్త వైరస్​లతో సోకే జబ్బులకు చెక్​ పెట్టాలంటే ‘నేషనల్​ హెల్త్​ టాస్క్​ఫోర్స్’  అవసరం. ఎప్పుడైనా వైరస్​ని గుర్తించగానే హడావుడిగా చర్యలు తీసుకోవడం, అది తగ్గిపోగానే మరచిపోవడం అలవాటుగా మారింది.

ఇప్పుడు కరోనా వైరస్​​పై బిగ్​ ఫైట్​ చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఉంది. మన దేశం గతంలో ఇలాంటి ఎన్నో రోగాల నుంచి బయటపడింది. ఎయిడ్స్​, టీబీ, మలేరియా, లెప్రసీ, పోలియో, స్వైన్​ఫ్లూ, బర్డ్​ఫ్లూ, చికున్​గున్యా వంటి చాలా వ్యాధులను అదుపు చేయగలిగింది. వాటిని దాదాపు తరిమేసింది. అయినా ఎప్పటికప్పుడు కొత్త మహమ్మార్లు పుట్టుకొస్తూ మన సత్తాకు పరీక్ష పెడుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎవరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా కూడా ఈ కోవలోకే వస్తుంది.

కరోనా వైరస్ వార్తలు రాగానే… ఇది అంత ఫాస్ట్​గా వ్యాపించదని, ప్రాణాలు తీసే ప్రమాదకారి కాదని అనుకున్నారు. అది నిజం కాదని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. దీని​ కారణంగా చనిపోతున్నోళ్ల సంఖ్య రోజురోజుకీ​ పెరుగుతోంది. గడచిన 30 ఏళ్లలో మనం ఇలాంటి సవాళ్లను సక్సెస్​ఫుల్​గా దాటేసినా కరోనా విషయంలో మాత్రం  పరిస్థితి వేరుగా ఉంది. ఈ నేపథ్యంలో మన దేశం గతంలో తగిలిన ఎదురుదెబ్బల్ని ఎలా తట్టుకుంది, వాటి నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకుందా అనిపిస్తోంది.

ఎయిడ్స్​పై ఎన్నో దేశాలకు ఆదర్శం

ఎయిడ్స్​ మన దేశంలోకి 1984లో వచ్చింది. అప్పుడు దాన్ని ఎవరూ గుర్తించలేదు. వేరే దేశాల్లో పబ్లిక్​ హెల్త్​ సిస్టమ్​ హైఅలర్ట్​ ప్రకటించింది. ఆ వైరస్​ను అర్జెంట్​గా పట్టుకొని ఖతం చేయాలని ఆయా దేశాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మన దగ్గర మాత్రం దానికి తగ్గ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లేకపోయింది. ఏడాది తర్వాత వెల్లూర్​ క్రిస్టియన్​ మెడికల్​ కాలేజ్​ (సీఎంసీ)లోని సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​ ఇన్​ వైరాలజీ విభాగం ఆ ఇన్ఫెక్షన్​పై ఇన్వెస్టిగేషన్​కి​ ఒక సెల్​ను ప్రారంభించింది. చివరికి 1986లో హెచ్​ఐవీ​ని దొరకబుచ్చుకున్నాం.  ఈ స్పెషల్ సెల్​​ని ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రీసెర్చ్​ (ఐసీఎంఆర్​) అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థే ఎయిడ్స్​ కంట్రోల్​ కోసం జాతీయ వ్యూహాన్ని రూపొందించటానికి టాస్క్​ఫోర్స్​నీ ఏర్పాటు చేసింది. సీఎంసీ ఎక్స్​పర్ట్​లే ఈ ప్రోగ్రామ్​ని పర్యవేక్షించి విజయవంతం చేశారు. ఈ టాస్క్​ఫోర్స్​ని ఆ తర్వాత డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్​ హెల్త్​ సర్వీసెస్​లో కలిపారు. 1992లో వరల్డ్​ బ్యాంక్​ ఆర్థిక సాయంతో ప్రారంభమైన ‘ఎయిడ్స్​ కంట్రోల్​ ఆర్గనైజేషన్’​ టేకోవర్​ చేసింది. ఈ విషయంలో ఇండియాను ప్రపంచ దేశాలు పెద్ద సంఖ్యలో మెచ్చుకున్నాయి.

సక్సెస్​ స్టోరీలతో స్ఫూర్తి పొందాలి

వరుసగా మూడేళ్లు ఒక్క పోలియో కేసు కూడా నమోదుకాని దేశాన్ని డబ్ల్యూహెచ్​వో పోలియో రహిత దేశంగా ప్రకటిస్తుంది. ఆ గుర్తింపు మన దేశానికి వచ్చింది. 1995లో ఈ వ్యాధిపై యుద్ధం ప్రకటిస్తే 2011 నాటికి ఫలితం దక్కింది. ఈ యుద్ధంలో భాగంగా నేషనల్​ ఎక్స్​పర్ట్​ అడ్వైజరీ గ్రూపును ఏర్పాటుచేశారు. ఆ గ్రూపు పోలియో వ్యాప్తిని అరికట్టడానికి క్షణక్షణం కృషి చేసింది. ఇలా ఒక్కో రోగంపై ఒక్కో టాస్క్​ఫోర్స్​ని ఏర్పాటు చేయటం కన్నా శాశ్వతంగా పబ్లిక్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ని నెలకొల్పటం మంచిదని సూచిస్తున్నారు. శ్రీలంక, థాయ్​లాండ్​ల్లో ఈ వ్యవస్థ ఉంది. దీనివల్ల ఆర్థికంగా, సమయంపరంగా కలిసొస్తుందంటున్నారు. ఎయిడ్స్​, పోలియో, మశూచి తదితర జబ్బుల్ని పూర్తిగా పారదోలిన మనం ఆ సక్సెస్​ స్టోరీల నుంచి స్ఫూర్తి​ పొందాలి. కానీ, పబ్లిక్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ను ఏర్పాటు చేయాలని ఎన్ని సార్లు కోరినా పట్టించుకోకపోవటంతో కరోనా లాంటివి వస్తున్నాయనే విమర్శల్ని ఎదుర్కొంటున్నాం. ఫంక్షన్లప్పుడు అద్దెకి తెచ్చి వేసే షామియానాల్ని అవసరం తీరగానే తీసేస్తాం. అదే పక్కా ఇల్లు కట్టుకుంటే శాశ్వత ఆస్తిలా ఉంటుందని మర్చిపోకూడదు.

తర్వాత వెనకబడ్డాం

నిఫా, సార్స్, స్వైన్​ఫ్లూ, చికున్​గున్యా వంటి వైరస్​లను ముందుగా గుర్తించటంలో ఇండియా వెనకబడింది. ఇతర దేశాలు చెప్పాకనే మేల్కొంది. అయినాకూడా ఇప్పటికీ స్పెషల్​ హెల్త్​ టాస్క్​ఫోర్స్​ని ఏర్పాటుచేయలేదు. ఆయా రోగాల్ని రూపుమాపటానికి మనకంటూ వ్యూహం లేకపోయింది. టెస్టింగ్​ ల్యాబ్​లు చాలినన్ని లేవు. నియంత్రణ చర్యలు, ఇమ్యునైజేషన్​ ప్రోగ్రామ్​లు పెట్టకుండా అందుబాటులో ఉన్న ఇన్​ఫ్లుయెంజా వ్యాక్సిన్​తోనే ఆ వైరస్​లను కట్టడి చేశారు. అన్ని వైరస్​లూ, బ్యాక్టీరియాలూ ఇలా తేలిగ్గా తోకముడవవు. కరోనా మాదిరిగా ఎదురుతిరుగుతాయి.

ముందున్న మార్గాలేంటి?

కరోనా ఇప్పటికి ఒక కన్ను తెరిస్తేనే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంది. రెండో కన్ను,​ మూడో కన్ను తెరిస్తే ఇంకెంత అల్లకల్లోలం ఏర్పడుతుందో తలచుకుంటేనే పీడ కలలా వెంటాడుతోంది. ఈ భయాల నుంచి బయటపడటానికి అప్​–టు–డేట్​ ల్యాబ్​ టెస్టులు ఉండాలి. షార్ట్​, మీడియం, లాంగ్​ టర్మ్​ వ్యూహాలు అమలుచేయాలి. హెల్త్​ మేనేజ్​మెంట్​కి సపోర్టివ్​గా రీసెర్చ్​ కొనసాగాలి. ఎక్స్​పర్ట్​లతో టాస్క్​ఫోర్స్​ని ఏర్పాటుచేయాలి. ఆరోగ్య రంగ పరిస్థితిపై రోజు వారీ నిర్ణయాలు తీసుకోవాలి. జనానికి భరోసా కల్పించాలి.

జనాభాపై జబ్బు ప్రభావం

మన దేశ జనాభా130 కోట్ల పైమాటే. అందులో 80 కోట్ల మంది పెద్దోళ్లే. వాళ్లల్లో కనీసం 10 శాతం (8 కోట్ల) మందికి కరోనా ఇన్ఫెక్షన్​ సోకినా, ఆ 8 కోట్ల మందిలో షుగర్, ఊపిరితిత్తుల జబ్బుతో బాధపడే తక్కువలో తక్కువ 10 శాతం (80 లక్షల) మంది తీవ్రంగా రోగాన బారినపడ్డా ప్రమాదకరమే. 80 లక్షల మందిలో ఒక్క శాతం అంటే 80 వేల మంది చనిపోయినా అది చాలా పెద్ద సంఖ్యే. మనకి మాయని మచ్చే అవుతుంది. ఆర్థిక రంగం మరింత కుదేలవటం ఖాయం. అదే జరిగితే గనుక కరోనాకి మన దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Latest Updates