గుండుతో నిరసన వెనుక స్టోరీ!

సియోల్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చో కుక్​కు న్యాయశాఖ మంత్రి పదవి కట్టబెట్టడంపై సౌత్​ కొరియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ప్రతిపక్షనేత హ్వాంగ్​ క్యోహన్​ బహిరంగంగా గుండు కొట్టించుకున్నారు. సోమవారం సాయంత్రం ప్రెసిడెన్షియల్​ప్యాలెస్​ ముందు తన మద్ధతుదారులు, జర్నలిస్టుల సమక్షంలో ఆయన ఇలా నిరసన తెలిపారు. చో కుక్​ను వెంటనే పదవిలో నుంచి తొలగించాలని హ్వాంగ్​ డిమాండ్​ చేశారు. ఇదే విషయంపై పోయిన వారం ఇద్దరు మహిళా ఎంపీలు కూడా ఇలాగే నిరసన తెలిపారు.

ఎవరీ చో కుక్

వృత్తిరీత్యా కుక్​ లా ప్రొఫెసర్.. ప్రెసిడెంట్​ మూన్​ జేయిన్​అసిస్టెంట్. వారం క్రితమే మంత్రి పదవి స్వీకరించారు. అకడమిక్​ ఫ్రాడ్  సహా పలు ఆర్థిక నేరాలలో కుక్​ కుటుంబం పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను లెక్కచేయకుండా కుక్​ కు మంత్రి పదవి కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది. యూనివర్సిటీలో తన కూతురుకు సీటు ఇప్పించేందుకు కుక్​ భార్య ఫోర్జరీకి పాల్పడ్డారని వర్సిటీ స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై కుక్​ విచారం వ్యక్తంచేశారు. కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో కుక్​ను దూరంపెట్టడం సరికాదని ప్రెసిడెంట్​మూన్​జేయిన్​ అన్నారు.

గుండుతో నిరసన వెనక..

సౌత్​ కొరియాలో నిరసన తెలపడానికి, దానిపై కమిట్మెంట్​ చెప్పడానికి  గుండు కొట్టించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. చైనా ఫిలాసఫర్​ కన్ఫ్యూషియన్​ కాలంలో మొదలైన ఈ నిరసన ఇప్పటికీ కొనసాగుతోంది.  సైనిక నియంతృత్వ పాలనలో అసమ్మతివాదులు, ఆ తర్వాత ఉద్యమకారులు, రాజకీయ నేతలు దీనిని ఫాలో అవుతున్నారు. 2018 లో పబ్లిక్​ టాయిలెట్లలో సీక్రెట్​ కెమెరాలను ఏర్పాటు చేసిన ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. దీనిపై పలువురు మహిళలు గుండ్లతో నిరసన తెలిపారు. అంతకుముందు అమెరికా యాంటీ మిస్సైల్​ సిస్టమ్​కు వ్యతిరేకంగా 900 మంది కొరియన్లు గుండు కొట్టించుకున్నారు. ఇచెయాన్​ సిటీకి దగ్గర్లో కొత్త ఇండస్ట్రియల్​ ప్లాంట్​ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిటీ ప్రజలు వందలాదిగా గుండు కొట్టించుకున్నారు.

Latest Updates