ప్రాణదాత.. 24 లక్షల మందికి తన రక్తమిచ్చి కాపాడాడు

story-of-australia-hero-great-blood-donor-james-harrison-269942-2

అతడి రక్తం చాలా ప్రత్యేకం. అది చాలా అరుదైన రకం. వ్యాధులతో పోరాడే యాంటీ బాడీస్ చాలా ఉన్నాయి అతడి రక్తంలో. తన ప్రత్యేకతతో ఎంతోమంది గర్భవతులకు దేవుడిగా మారాడు. నవజాత శిశువులకు ప్రాణం పోశాడు. ఆస్ట్రేలియా హీరో అయ్యాడు. అతడి గురించి తెల్సుకుందాం.

అతడి పేరు జేమ్స్ హారిసన్. చాలామంది ఏడాదికి ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే చాలు అనుకుంటారు. కొందరైతే అసలు బ్లడ్ ఇవ్వనే కూడదంటారు. అతికొద్దిమంది మాత్రమే తరచుగా బ్లడ్ డొనేట్ చేస్తూ తమ ఉదారత్వం చాటుకుంటుంటారు. కానీ.. జేమ్స్ హారిసన్ మనసున్న మానవుడు. అరవయ్యేళ్లుగా అతడు రక్తదానం చేస్తూనే ఉన్నాడు. ఎంతగా అంటే.. 3 వారాలకు ఒకసారి అతడు తన రక్తాన్ని దానం చేశాడంటే నమ్మగలరా. నమ్మాల్సిందే. అందుకే అతడిని ఆస్ట్రేలియా దేశం హీరోగా భావిస్తోంది.

జేమ్స్ హారిసన్ 1936 డిసెంబర్ 27న పుట్టారు. 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. అతడికి ఛాతి భాగంలో ఆపరేషన్ జరిగింది. 13 లీటర్ల బ్లడ్ అవసరం అయింది. సర్జరీ తర్వాత 3 నెలలు హాస్పిటల్ లోనే ఉన్నాడు. రక్తమే తనను రక్షించిందని ఆయన అనుకున్నాడు. తన రక్తం కూడా వేరేవాళ్లకు ఇలాగే ప్రాణం పోయాలని భావించి.. 18 ఏళ్ల వయసు వరకు ఆగి.. ఆ తర్వతా క్రమం తప్పకుండా ఆయన రక్తదానం చేస్తూ వచ్చాడు.

1954లో హారిసన్ బ్లడ్ డొనేషన్ ప్రారంభించాడు. రీసస్ అనే వ్యాధిని నయం చేసే యాంటీబాడీలు ఎక్కువగా ఉన్న.. చిక్కదనపు రక్తం ఆయనకు ఉందని రక్త పరీక్షల్లో తేలింది. చిన్నపిల్లల్లో రక్తానికి సంబంధించిన వ్యాధి(Hemolytic disease of new born)ని నయం చేసే లక్షణాలు అతడి రక్తంలో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. నవజాత శిశువుల రక్తంలో Rh D సమస్యను అధిగమింపచేసే.. యాంటీ D యాంటీబాడీస్ .. హారిసన్ రక్తంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలింది. అలా.. HDN అనే వ్యాధి బారిన పడి చనిపోకుండా.. హారిసన్ రక్తం పసిపిల్లలకు సంజీవనిగా పనిచేసింది.

హారిసన్ రక్తం అరుదైన రకం అని జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చాక… అతడికి.. ఒక మిలియన్ డాలర్స్ జీవిత బీమా చేయించారు. ఆ తర్వాత అతడి రక్త నమూనాలతోనే.. యాంటీ –డి ఇమ్యూన్ గ్లోబులిన్ అనే మెడిసిన్ కూడా తయారైంది. అత్యంత అరుదైన తన రక్తంతో.. ఆయన 2.4 మిలియన్ అంటే.. 24 లక్షల మంది గర్భస్త శిశువులకు,. గర్భవతులకు ప్రాణం పోశాడు. అందులో.. ఆయన కూతురు ట్రాసే కూడా ఉంది.

హారిసన్ వయసు ఇపుడు 82 ఏళ్లు. తన జీవితంలో 1000కి పైగా సందర్భాల్లో బ్లడ్ ప్లాస్మాను డొనేట్ చేశారాయన.  57 ఏళ్లకు పైగా కొనసాగిన ‘రక్తదాత’ అనే ఉద్యోగం నుంచి ఆయన గతేడాది ‘రిటైర్మెంట్’ తీసుకున్నారు. ఎందుకంటే 2018 మే నెలలో హారిసన్ వయసు 81 ఏళ్లు దాటింది. ఆస్ట్రేలియాలో 81 ఏళ్లు దాటిన వారి నుంచి రక్తాన్ని దానంగా తీసుకోరు. అదే రోజున ఆయన చివరిదైన 1173వ రక్తదానం చేశారు. అలా..   Man With The Golden Arm అని పేరు తెచ్చుకున్నాడు హారిసన్. హారిసన్ సేవలకు గుర్తింపుగా.. 1999లో అత్యంత గౌరవప్రదమైన మెడల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం అందుకున్నాడు. మరెన్నో గౌరవాలు దక్కించుకున్నాడు.

రెడ్ క్రాస్ రికార్డులు … జేమ్స్ హ్యారిసన్ ను ఆస్ట్రేలియా హీరో అని చెబుతున్నాయి. “మీరు నిజంగా హీరో.. అని ఎవరైనా అడిగితే.. నా జీవితంలో నేను చేయగలిగింది అది మాత్రమే. రక్తదాతగా నేను చేయగలిగే పని అదొక్కటే.  సో చేశాను. అది రికార్డ్ అయి ఉండొచ్చు” అని సింపుల్ గా చెప్పాడు హారిసన్. మానవత్వానికి అసలైన నిర్వచనంగా మారాడు.

Latest Updates