మ్యాటర్‌‌ చాలా ఉంది.. అందుకే అవార్డులొచ్చినయ్‌‌

నేషనల్‌‌ ఫిల్మ్‌‌ అవార్డ్స్‌‌లో ఈసారి ‘తెలుగు సినిమా’ సత్తా చాటింది. మెయిన్‌‌ కేటగిరీల్లో బెస్ట్ యాక్ట్రెస్‌‌తో పాటు ఏడు అవార్డులు దక్కించుకుంది.  రీజనల్‌‌ కేటగిరీలో తెలుగులో ‘మహానటి’ సినిమా అవార్డు గెల్చుకున్న విషయం తెలిసిందే. అదే టైంలో ఎప్పటిలాగే అవార్డుల ప్రకటనలో జ్యూరీల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఫేవరెట్‌‌ స్టార్లకు అవార్డులు రాకపోవడంపై ఫ్యాన్స్‌‌, సోషల్‌‌ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతి పక్కనపెడితే ఈసారి వివిధ భాషల్లో అవార్డ్స్‌‌ దక్కించుకున్న చిత్రాలు చాలా వరకు ‘లో–ఫ్రొఫైల్‌‌’ సినిమాలు కావడం విశేషం. ఆ సినిమాలు.. వాటి విశేషాలు, నేపథ్యాలు చూద్దాం ఇప్పుడు…

అరవై ఆరవ జాతీయ సినిమా అవార్డుల కోసం మొత్తం 400 చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిల్లో ఫీచర్‌‌‌‌ సినిమాలు రెండొందలకు పైనే ఉన్నాయి.  గుజరాతీ చిత్రం ‘హెలారో’ బెస్ట్‌‌‌‌ ఫీచర్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌గా అవార్డు కైవసం చేసుకుంది. ఉమెన్‌‌‌‌ ఎంపర్‌‌‌‌మెంట్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌తో దర్శకుడు అభిషేక్‌‌‌‌ షా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు.  అయితే మిగతా లాంగ్వేజ్‌‌‌‌ల్లో ఎవరూ ఊహించని విధంగా బడ్జెట్ తక్కువ సినిమాలకు అవార్డులు వచ్చాయి.  వాటిల్లో రియలిస్టిక్‌‌‌‌,  సోషల్ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌కు చెందిన సినిమాలే ఎక్కువగా ఉండటం మరో విశేషం.

టార్టిల్‌‌‌‌–రాజస్తానీ

రాజస్తాన్‌‌‌‌లో  నీటి కరువు కొత్తేం కాదు. కానీ, రోజురోజుకీ ఆ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఆ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించిన సినిమా ‘టార్టెల్‌‌‌‌’.  దినేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పాపులర్‌‌‌‌ కమెడియన్‌‌‌‌ సంజయ్‌‌‌‌ మిశ్రా లీడ్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌ చేశాడు. కథ విషయానికొస్తే.. ఒక ఊరిలో నీటి కొరత ఎక్కువగా ఉంటుంది.  ఈ ఊరి జనాలు బురద నీళ్లను తాగేందుకు ఉపయోగిస్తారు.  ఆ టైంలో ఆ ఊరికి ఒక పెద్దాయన వస్తాడు. ఆ పరిస్థితుల్ని మార్చేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, ఆ ఊళ్లో కొందరు ఆసాములు ఆ పెద్దాయన ప్రయత్నానికి అడ్డుపడతారు.  చివరికి ఆ పెద్దాయన తన లక్ష్యాన్ని ఎలా సాధిస్తాడు? అన్నదే టార్టెల్‌‌‌‌ సినిమా కథ. సీరియస్‌‌‌‌నెస్‌‌‌‌తో హ్యూమర్‌‌‌‌ బోలెడంత ఉంది ఈ సినిమాలో.

భారమ్‌‌‌‌–తమిళ్‌‌‌‌

కోలీవుడ్‌‌‌‌లో ఈ సినిమాకు అవార్డు వస్తుందని ఎవరూ ఊహించలేదు. తమిళనాడులో తలైకూతల్‌‌‌‌ అనే ఘోరమైన సంప్రదాయం ఉండేది. ఊళ్లలో వయసు పైబడి, జబ్బులతో మంచం పట్టినవాళ్లను ఇంట్లోవాళ్లే నిర్దాక్షిణ్యంగా చంపేసే సంప్రదాయం అది. దీని ఆధారంగా ‘భారమ్‌‌‌‌’ సినిమా తీసింది ప్రియా కృష్ణస్వామి. కథ.. భార్య చనిపోవడంతో కరుప్పస్వామి, తన చెల్లి దగ్గర ఉంటూ వాచ్‌‌‌‌మెన్‌‌‌‌ పని చేస్తుంటాడు. ఒకరోజు కరుప్పస్వామికి యాక్సిడెంట్‌‌‌‌ అవుతుంది. నడుం పడిపోయిన కరుప్పస్వామిని కొడుకు ఇంటికి తీసుకెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత  కరుప్పస్వామి కన్నుమూస్తాడు. అయితే అతని అల్లుడు వీరాకి ఆ మరణం సహజమైంది కాదనే అనుమానం వస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ‘భారమ్‌‌‌‌’లో  నటించిన వాళ్లలో పాండిచ్చేరి యూనివర్సిటీ స్టూడెంట్స్‌‌‌‌, నాన్‌‌‌‌–యాక్టర్లే ఎక్కువగా ఉండటం విశేషం.

హమీద్‌‌‌‌– ఉర్దూ

బాధల్ని దిగమింగుకుని జీవితంలో ముందుకు కొనసాగాలి.. అనే మెసేజ్‌‌‌‌తో తెరకెక్కింది ‘హమీద్‌‌‌‌’. ఫేమస్‌‌‌‌ రైటర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ అమీన్ భట్‌‌‌‌ రాసిన ‘ఫోన్‌‌‌‌ నెంబర్‌‌‌‌ 786’ నాటకం ఈ సినిమాకు మూలం. కథ విషయానికొస్తే.. ‘ఏడాదిగా తండ్రి కనిపించకుండా పోవటంతో చిన్నారి హమీద్‌‌‌‌ దిగాలుగా ఉంటాడు. అప్పుడే 786 అనే నెంబర్‌‌‌‌ దేవుడికి సంబంధించిందని అతనికి తెలుస్తుంది. ఆ నెంబర్‌‌‌‌కి ఫోన్‌‌‌‌ కాల్ చేస్తాడు. అది సీఆర్‌‌‌‌పీఎఫ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌కి కనెక్ట్‌‌‌‌ అవుతుంది. ఒక ఆఫీసర్‌‌‌‌ ఆ కాల్‌‌‌‌ని రిసీవ్‌‌‌‌ చేసుకుంటాడు. తన తండ్రిని తాను ఎంత మిస్‌‌‌‌ అవుతున్నానో ఆ  ఆఫీసర్‌‌‌‌తో చెప్తాడు హమీద్‌‌‌‌. ఆ చిన్నారి అమాయకత్వం ఆ ఆఫీసర్‌‌‌‌ని కలిచివేస్తుంది. రెగ్యులర్‌‌‌‌గా ఆ చిన్నారితో మాట్లాడుతుంటాడు. ఒకరోజు తండ్రి చనిపోయాడనే విషయం హమీద్‌‌‌‌కి తెలుస్తుంది. కానీ, బాధపడితే ఏం లాభం ఉండదని అర్థం చేసుకుంటాడు. తల్లితో సంతోషంగా బతకడం ప్రారంభిస్తాడు.

ఏక్‌‌‌‌ జే ఛిలో రాజా–బెంగాలీ

బెంగాల్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లో జరిగిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా డైరెక్టర్‌‌‌‌ శ్రీజిత్‌‌‌‌ ముఖర్జీ ఈ సినిమా తీశాడు. జమీందారీ కుటుంబంలో పుట్టిన మహేంద్ర కుమార్‌‌‌‌ చౌదరి.. పులిదాడిలో చనిపోవడంతో అంతిమసంస్కారాలు చేస్తారు. కానీ, పన్నెండేళ్ల తర్వాత భావల్‌‌‌‌ సన్యాసి ఒకరు తానే మహేంద్ర చౌదరినంటూ తిరిగి కోటకు వస్తాడు.  ఆ కేసు కోర్టుకి చేరుతుంది. సుదీర్ఘ కాలం వాదనలు జరుగుతాయి. చివరకు కోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది సస్పెన్స్‌‌‌‌!. ఎమోషనల్‌‌‌‌ స్టోరీగా తెరకెక్కిన ‘ఏక్‌‌‌‌ జే ఛిలో రాజా’ కమర్షియల్‌‌‌‌గా బిగ్ సక్సెస్‌‌‌‌ అయ్యింది.

సుడానీ ఫ్రమ్‌‌‌‌ నైజీరియా – మలయాళం

కామెడీ–స్పోర్ట్స్‌‌‌‌ డ్రామాగా తెరకెక్కిన సుడానీ ఫ్రమ్‌‌‌‌ నైజీరియా గతేడాది బిగ్గెస్ట్‌‌‌‌ కమర్షియల్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ చిత్రాల్లో ఒకటి. కేరళ స్టేట్‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌ అవార్డ్స్‌‌‌‌ ఐదు వచ్చాయి ఈ సినిమాకి. ఫ్రెండ్‌‌‌‌షిప్ నేపథ్యంగా సాగే సినిమా ఇది.  మలప్పురంలో జులాయిగా తిరిగే మజీద్‌‌‌‌, ఒక ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌ టీమ్‌‌‌‌ని ఏర్పాటు చేస్తాడు. అందులో ముగ్గురు నైజీరియన్‌‌‌‌ ప్లేయర్లు ఉంటారు. వాళ్లలో శామ్యూల్‌‌‌‌కి మజీద్‌‌‌‌కి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే పాస్‌‌‌‌పోర్ట్ లేకపోవడంతో పోలీసులు శామ్యూల్ కోసం వెతుకుతుంటారు.  ఎలాగోలా మజీద్‌‌‌‌ కొత్త పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌తో శామ్యూల్‌‌‌‌ను సొంత దేశానికి పంపిస్తాడు.  శామ్యూల్‌‌‌‌ వెళ్లిపోయాక మజీద్‌‌‌‌కు జీవితం అంటే ఏంటో తెలిసొస్తుంది. తనకు దూరమైన బంధాలను మజీద్‌‌‌‌ తిరిగి దగ్గరికి చేర్చుకోవడంతో కథ ముగుస్తుంది.

భోంగా–మరాఠీ

ప్రాణం కంటే మతం గొప్పదా? లేదంటే మతం కంటే ప్రాణం గొప్పదా?.  ‘భోంగా’ సినిమా ఈ టాపిక్‌‌‌‌నే ప్రస్తావించింది. మరాఠీ ఫిల్మ్‌‌‌‌ ఇండస్ట్రీలో అవార్డ్‌‌‌‌ విన్నింగ్‌‌‌‌  డైరెక్టర్‌‌‌‌గా పేరున్న శివాజీ పాటిల్‌‌‌‌ తీసిన సినిమా ఇది. భోంగా అంటే ‘లౌడ్‌‌‌‌స్పీకర్‌‌‌‌’ అని అర్థం. స్టోరీ విషయానికొస్తే.. బిడ్డకు సీరియస్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌ ఉండటంతో ఒక ముస్లిం ఫ్యామిలీ ఇంటిని షిప్ట్‌‌‌‌ చేస్తుంది. అయితే కొత్త ఇంటికి ఎదురుగా మసీదు ఉంటుంది. మసీదులో ఉన్న స్పీకర్‌ నుంచి ఎక్కువ సౌండ్‌ వస్తుండడంతో చిన్నారి ఆరోగ్యం మరీ దెబ్బతింటుంది. దీంతో లౌడ్‌‌‌‌స్పీకర్‌‌‌‌ మైకును ఇంకో వైపు తిప్పాలని మసీదులో పని చేసే అనౌన్సర్‌‌‌‌ని ఆ పేరెంట్స్‌‌‌‌ కోరతారు. కానీ, ఆ వ్యక్తి అందుకు అంగీకరించడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ బిడ్డ చనిపోతుంది. అంతిమ యాత్రకి ఎదురుపడిన అనౌన్సర్‌‌‌‌పై ఆ తండ్రి తన ఆక్రోశం వెళ్లగక్కుతాడు.  బిడ్డ చావుతో ఆ అనౌన్సర్‌‌‌‌లో మార్పు వస్తుంది. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఆరోజు నుంచి మైక్‌‌‌‌ లేకుండానే  ప్రార్థనలు చేస్తాడు అనౌన్సర్‌.

నాతిచరామి – కన్నడ

ఉమెన్‌‌‌‌ సెంట్రిక్‌‌‌‌ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయ్‌‌‌‌!. వాటిల్లో ఆడవాళ్ల వ్యక్తిగత సమస్యలను ప్రస్తావించే సినిమాలు ఇంకా అరుదు. కాంట్రవర్సీలకు భయపడి చాలా మంది దర్శకులు అలాంటి సబ్జెక్టుల జోలికిపోరు.  కానీ, యంగ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ మాన్సోర్‌‌‌‌ మాత్రం సెన్సిటివ్‌‌‌‌ విషయాల్ని చూపిస్తాడు తన సినిమాల్లో.  అందుకే డ్యాషింగ్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌గా అతనికి పేరుంది. ‘నాతిచరామి’ కూడా అలాంటి సబ్జెక్టుల్లో ఒకటి. ఒకవైపు తాగుబోతు భర్త– మరోవైపు ప్రతీదానికి తనదే తప్పుగా చూసే సొసైటీతో విసిగిపోతుంది గౌరీ. శారీరక కోర్కెలు, నమ్మకాల మధ్య ఆమె  నలిగిపోతుంటుంది. వాటిని అధిగమించి గౌరీ తన లైఫ్‌‌‌‌ను ఎలా తీర్చిదిద్దుకుంటుంది అనేదే నాతిచరామి కథ. సినిమా కమర్షియల్‌‌‌‌గా సక్సెస్‌‌‌‌ కాకపోయినా.. క్రిటిక్స్‌‌‌‌ ప్రశంసలు మాత్రం అందుకుంది. శృతిహరిహరన్‌‌‌‌ యాక్టింగ్‌‌‌‌ ఈ సినిమాకు మెయిన్‌‌‌‌ అట్రాక్షన్‌‌‌‌.

హర్జీతా(హర్‌‌‌‌ జీతా)–పంజాబీ

పంజాబీలో కమర్షియల్‌‌‌‌గా డిజాస్టర్‌‌‌‌ అనిపించుకున్న ఈ సినిమా బెస్ట్‌‌‌‌ మూవీగా అవార్డు దక్కించుకోవడం విశేషం. పేద కుటుంబంలో పుట్టిన హర్జీత్‌‌‌‌ సింగ్‌‌‌‌కి హాకీ అంటే చాలా ఇష్టం. కానీ, కుటుంబ పరిస్థితులు అతనికి సహకరించవు. అయినా కూడా హాకీపై ఇష్టం చంపుకోడు. ఎలాగోలా ట్రైనింగ్ తీసుకుని జూనియర్‌‌‌‌ టీంలో చోటు సంపాదించుకుంటాడు. అంతేకాదు జూనియర్ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టోర్నీలో టీంని చాంపియన్‌‌‌‌గా నిలబెడతాడు. స్టోరీ లైన్‌‌‌‌ బాగున్నప్పటికీ.. స్క్రీన్‌‌‌‌ప్లే పేలవంగా ఉండటం, కథ నిదానంగా సాగడం, ఓవర్ డ్రామా వల్ల ఈ సినిమా ప్లాప్‌‌‌‌ అయ్యింది. అయితే బెస్ట్‌‌‌‌ రీజినల్ మూవీగా అవార్డు దక్కించుకుంది. ఈ సినిమాలో యాక్ట్‌‌‌‌ చేసిన సమీప్‌‌‌‌ రనౌత్‌‌‌‌కి బెస్ట్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ యాక్టర్‌‌‌‌ అవార్డు దక్కింది.

వీటికి కూడా వచ్చినయ్‌‌‌‌

అమోరీ: కొంకణి
బుల్‌‌‌‌బుల్ కెన్‌‌‌‌ సింగ్: అస్సామీస్‌‌‌‌
రెవా: గుజరాతీ

ఇవి స్పెషల్​

బాలీవుడ్‌‌లో తక్కువ బడ్జెట్‌‌తో తెరకెక్కిన సినిమాలు సెన్సేషన్‌‌ క్రియేట్‌‌ చేయడం ఈ మధ్యకాలంలో పెరిగింది. భారీ అంచనాలతో వస్తున్న సినిమాలు బోల్తా పడుతుంటే.. ఏ మాత్రం అంచనాల్లేకుండా వస్తున్న సినిమాలు రికార్డుల్ని క్రియేట్‌‌ చేస్తున్నాయి. ఈ ఇయర్‌‌ నేషనల్‌‌ ఫిలిం అవార్డ్స్ లో ‘స్పెషల్‌‌’ అట్రాక్షన్‌‌గా నిలిచిన ‘అంధాదున్‌‌, బదాయి హో’.. రెండూ ఆ కేటగిరీకి చెందిన సినిమాలే కావడం విశేషం.

బ్లైండ్‌‌.. బట్ ట్రెయిన్డ్‌‌

ఈ సినిమాకి అయిన బడ్జెట్‌‌ ముప్ఫై రెండు కోట్లు. వసూలు చేసింది నాలుగు వందల కోట్లకు పైనే. లాక్కోర్దర్ అనే ఫ్రెంచ్‌‌ సినిమా నుంచి స్టోరీని అడాప్ట్ చేసుకుని ఈ సినిమా తీశాడు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్‌‌. స్టోరీ విషయానికొస్తే.. బ్లైండ్‌‌ అయినప్పటికీ పియానో ఆర్టిస్టుగా పేరు సంపాదించుకుంటాడు ఆకాష్‌‌. ఈ క్రమంలో అతనికొక గర్ల్‌‌ఫ్రెండ్‌‌ దొరుకుతుంది. అయితే అనుకోకుండా ఒక హత్య కేసులో ఆకాష్‌‌ చిక్కుకుంటాడు. అతను నిజంగానే గుడ్డివాడా? లేక నటిస్తున్నాడా? అనే అనుమానం సినిమాలో క్యారెక్టర్‌‌లకే కాదు.. ప్రేక్షకులకు కూడా కలుగుతుంది. ఆ సస్పెన్స్‌‌ అలాగే కొనసాగిస్తూ.. ఆ కేసు నుంచి బయటపడతాడు ఆకాష్‌‌. బ్లాక్‌‌ కామెడీ క్రైమ్‌‌ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానాకి బెస్ట్ యాక్టర్‌‌ అవార్డు కూడా దక్కింది. నెట్‌‌ఫ్లిక్స్‌‌లో ఈ సినిమాను చూడొచ్చు.

కామెడీ బ్లాక్‌‌బస్టర్‌‌

బదాయి హో.. డిఫరెంట్‌‌ కాన్సెప్ట్‌‌తో వచ్చిన సినిమా. పెళ్లీడుకొచ్చిన కొడుకు ఉన్న ఇంట్లో.. ఆ తల్లి మళ్లీ ప్రెగ్నెంట్‌‌ అయితే ఎలా ఉంటుందనే కథతో అమిత్‌‌ రవీంద్రనాథ్‌‌ శర్మ ఈ సినిమాను తీశాడు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన బదాయి హో..  మీడియాలో చర్చకు దారితీసింది. ఇరవై తొమ్మిది కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కిన ఈ సినిమా.. సుమారు రెండువందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హాట్‌‌స్టార్‌‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

మనకు తెలియని కథలు

ప్యాంగ్చెప్నా, గారో, షెర్దుక్‌‌పెన్‌‌.. నార్త్‌‌ఈస్ట్‌‌(ఈశాన్య) రాష్ట్రాల్లో ఈ తెగల గురించి..

ఆ పేర్లతోనే వాళ్లు మాట్లాడుకునే భాషల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకపోయి ఉండవచ్చు. అలాంటిది ఈ భాషల్లో తెరకెక్కే సినిమాల గురించి ఎలా తెలుస్తది!.  కానీ, బాలీవుడ్‌‌ డామినేషన్‌‌ తగ్గి రీజనల్‌‌ చిత్రాల హవా కొనసాగుతున్న వేళ.. ఈ మూడు భాషల సినిమాలు నేషనల్ అవార్డ్స్‌‌ దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాయి. మ.అమ: గారో

మేఘాలయాలో జనాభాపరంగా రెండో ప్లేస్‌‌లో ఉన్న ట్రైబల్ తెగ ‘గారో’. ఈ తెగ మాట్లాడే భాష గారో.  ఈ లాంగ్వేజ్‌‌లో తెరకెక్కిన చిత్రం ‘మ.అమ’. చనిపోయిన భార్యను వెతుక్కుంటూ ఒక ముసలి వ్యక్తి సాగించే ప్రయాణం ఈ సినిమా కథ.  డొమినిక్‌‌ సంగ్మా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సొంతూరిలోనే సంగ్మా ఈ చిత్రాన్ని తీయడం విశేషం. పైగా ఇందులో లీడ్‌‌ పాత్ర పోషించింది సంగ్మా తండ్రి ఫిలిప్‌‌ సంగ్మా.  గతేడాది ముంబైతో పాటు పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌‌లో ఈ గారో సినిమాని ప్రదర్శించారు కూడా.

మిషింగ్‌‌: షెర్దుక్‌‌పెన్‌‌

రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌‌లో లేని భాషల కోసం ‘స్పెషల్ లాంగ్వేజ్‌‌ కేటగిరీ’ని చేర్చారు నేషనల్ ఫిలిం అవార్డ్స్‌‌ల్లో. ఆ కేటగిరీలో షెర్దుక్‌‌పెన్‌‌ భాషకు చెందిన ‘మిషింగ్‌‌’ సినిమా అవార్డు దక్కించుకుంది. గువహటికి చెందిన బాబీ శర్మ బారువా ఈ సినిమాకి దర్శకత్వం వహించింది.  భాష తెలియకపోయినా నేర్చుకుని మరీ ఈ సినిమా తీసిందామె.  షెర్దుక్‌‌పెన్‌‌ భాషలో మిషింగ్‌‌ అంటే ‘భూతం’ అని అర్థం.  ఆర్మీ నుంచి పారిపోయి వచ్చిన ఒక వ్యక్తి షెర్దుక్‌‌పెన్‌‌ కమ్యూనిటీ ఏరియాను బాగు చేస్తుంటాడు. ఇంతలో సడన్‌‌గా ఆ వ్యక్తి కనిపించకుండా పోతాడు. దశాబ్దాల తర్వాత అతని అదృశ్యం వెనుక కారణాలు తెలిసి జనాలు  షాక్‌‌కి గురవుతారు.

ఇన్‌‌ ది ల్యాండ్‌‌ ఆఫ్‌‌ పాయిజన్‌‌ ఉమెన్‌‌: ప్యాంగ్చెప్నా

ప్యాంగ్చెప్నా  తెగ అరుణాచల్‌‌ ప్రదేశ్‌‌లో ఉండే ఒక గిరిజన తెగ.  కేవలం ఐదు వేల మంది మాత్రమే ఈ భాష మాట్లాడతారు.  ‘ఇన్‌‌ ది ల్యాండ్‌‌ ఆఫ్‌‌ పాయిజన్‌‌ ఉమెన్‌‌’ సినిమా ఒక ఫిక్షన్‌‌ కథ.  మంజు బోరా డైరెక్షన్ వహించిన ఈ చిత్రం..  ప్యాంగ్చెప్నా  గిరిజన తెగ ప్రజలు నమ్మకం నుంచి పుట్టిన కథ.  ఫేమస్‌‌ అస్సాం రైటర్‌‌ థోంగ్చి రాసిన భిక్ష్‌‌కన్యర్‌‌ డెషాట్‌‌ పుస్తకం  ఈ సినిమా కథకు మూలం.  ‘విషకన్య’గా పేరున్న ఒక వృద్ధురాలి వెనుక మిస్టరీ చేధించేందుకు ఒక యంగ్‌‌ టీం ప్రయత్నిస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్‌‌లో ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.

పైన చెప్పుకున్న మూడు భాషలకు రాజ్యాంగంలో అధికారిక గుర్తింపు లేదు. అయినా కూడా తమ భాషల చిత్రాలు రీజనల్‌‌ చిత్రాలుగా అవార్డులు దక్కించుకోవడంపై ఆ చిత్రాల యూనిట్‌‌, ఆ భాష మాట్లాడుకునే జనాలు  ఖుషీగా ఉన్నారు.

Latest Updates