వికారాబాద్​ జిల్లాలో వింత వ్యాధి.. 150 మందికి అస్వస్థత

వింత వ్యాధితో ఒకరి మృతితో కలకలం

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఒకరు మృతిచెందగా 15‌0 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్​మండలం ఎర్రవల్లి, కొత్తగడి, చింతన్​బోడ, నారాయణపూర్​, పెండ్లిమడుగు, పులుమద్ది, నవాబుపేట మండలం మమదాన్​పల్లి, ఎక్​మామిడి, వట్టిమీనేపల్లి, చిట్టిగిద్ద, ఆర్కతల పంచాయతీల పరిధిలో 150 మంది వరకు వింత రోగ లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. ప్రధానంగా గ్రామస్తుల్లో మూడు రోజులుగా మూర్ఛ రోగ లక్షణాలు కనిపిస్తున్నాయి. కళ్లు తిరిగి పడిపోవడం, నోటి నుంచి నురగ రావడం, పళ్లు కొరుక్కోవడం, కాళ్లు, చేతులు కొట్టుకోవడం వంటి లక్షణాలతో బాధ పడుతున్నారు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కిష్టారెడ్డి(52) ఇలాంటి లక్షణాలతో శనివారం మృతిచెందారు. ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య మంత్రి సబితారెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో జిల్లా కలెక్టర్​ పౌసుమి బసును అలెర్ట్​ చేశారు. వికారాబాద్​ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మహావీర్, సాయి డెంటల్​ కాలేజ్, ప్రభుత్వ దవాఖానాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్​ ఆదేశించారు. మంత్రి సబితారెడ్డి వికారాబాద్​ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు.

పరిస్థితి అదుపులో ఉంది

ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉంది. అనారోగ్యానికి గురైన వారి కుటుంబసభ్యులు, ప్రజలు ఆందోళన చెందవద్దు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. రిపోర్టుల ఆధారంగా రోగ నిర్ధారణ చేస్తాం. -సుధాకర్​షిండే, డీఎంహెచ్​వో, వికారాబాద్

కారణాలను వెతుకుతున్నాం

కల్తీ కల్లు తాగారన్న అనుమానంతో గ్రామాల్లోని దుకాణాల్లో శాంపిళ్లను సేకరించాం. వాటిని హైదరాబాద్​ ల్యాబ్​కు పంపించాం. రిపోర్టుల వచ్చిన తర్వాత వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం. – వరప్రసాద్, ఎక్సైజ్ ​సూపరింటెండెంట్​

Latest Updates