స్ట్రెస్​ త‌గ్గించే సూప‌ర్ ఫుడ్స్

కరోనా తెచ్చిన కష్టాలతో చాలామంది మెంటల్​గా డిస్టర్బ్​ అవుతున్నారు. ఈ స్ట్రెస్​ నుంచి బయటపడాలంటే, మైండ్​ను కూల్​గా ఉంచే సూపర్​ ఫుడ్స్​ తినడం అవసరం అంటున్నారు డాక్టర్స్​.
పెరుగు: చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు పెరుగు మంచి పోషకాహరం. పెరుగులో చక్కెర కలుపుకుని తింటే మెదడు చురుకుగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పెరుగుతో అరటి పండ్లను కూడా కలిపి తినొచ్చు. ప్రొటీన్లు, మేలు చేసే కొవ్వులతోపాటు మరెన్నో పోషకాలు పెరుగులో ఉంటాయి. రోజూ ఒక కప్పు పెరుగు తింటే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఎదురయ్యే సమస్యలేవీ ఇబ్బంది పెట్టవట. అంతేకాదు.. మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి పెరుగుకు మించింది లేదని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు.
గింజలు : బాదం, జీడిపప్పు, వేరుశెనగ, పిస్తా, ఆక్రోట్ల వంటి డ్రైఫ్రూట్స్, గింజలు కూడా ఒత్తిని తగ్గించే సూపర్​ఫుడ్స్​. ఇవి సెరటోనిన్​ను విడుదల చేస్తాయి. వీటిని తినడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. నేరుగా తిన్నా, నానబెట్టి తిన్నా, ఫ్రూట్​ జ్యూస్​లు, మిల్క్​షేక్స్​లో కలిపి తిన్నా.. వీటిలో ఉన్న పోషకాలు శరీరానికి అందుతాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.
అరటి: డోపమైన్, సెరటోనిన్ శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి అరటి పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను పొందాలంటే అరటిపండుకు మించింది లేదు. రోజూ ఒక అరటిపండు తినే పిల్లలు చదువుల్లో మెరుగ్గా రాణిస్తారని ఇప్పటికే అనేక సర్వేల్లో రుజువైంది. బరువు పెరగాలన్నా, జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా రోజూ అరటిపండ్లను తినాలి. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా అరటి పండ్లను డైట్​లో చేర్చాల్సిందే.
ఆరెంజ్ : ఇమ్యూనిటీని పెంచి, జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయగలిగే శక్తి ఆరెంజ్​కు ఉంది. మెదడు, హార్ట్​, లివర్​, కిడ్నీ ఆరోగ్యాన్ని ఆరెంజ్ మెరుగుపరుస్తుంది. సీజనల్​ వ్యాధుల నుంచి కాపాడుతుంది. స్ట్రెస్​ను తగ్గించి, చురుగ్గా ఉంచుతుంది.
కాఫీ: అలసటగా అనిపించినా, బాగా ఆలోచించడం వల్ల తలనొప్పిగా అనిపించినా, ఒత్తిడి పెరుగుతున్నా.. వెంటనే ఓ కప్పు కాఫీ తాగాలి. కాఫీలోని కెఫిన్​ వల్ల మెదడు చురుగ్గా ఆలోచిస్తుంది. అందుకని, స్ట్రెస్​గా ఫీలైనప్పుడు ఓ కప్పు కాఫీ తాగొచ్చు. అయితే కాఫీ అతిగా తాగడం మంచిది కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
డార్క్​ చాక్లెట్: డార్క్​ చాక్లెట్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కోకోవా, మెంటల్ హెల్త్​కు మంచి మెడిసిన్​. డార్క్​ చాక్లెట్​ తినే అలవాటు ఉన్నవాళ్లు ఎప్పుడూ క్రియేటివ్​గా ఆలోచిస్తారట. అంతేకాదు.. ఎప్పుడూ హ్యాపీగా, నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారట కూడా. తరచూ స్ట్రెస్​కు గురయ్యేవాళ్లు రోజుకో డార్క్​ చాక్లెట్​ తింటే ఒత్తిడి నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు సైకాలజిస్టులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates