‘దిశ’ లాంటి న్యాయం కావాలి

దళిత మహిళపై దారుణానికి పాల్పడ్డవారిని ఎన్​కౌంటర్​ చేయాలి

ఆసిఫాబాద్​ జిల్లా జైనూర్, వాంకిడిలో ఆందోళనలు

బంద్, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించిన స్టూడెంట్లు

అగ్రవర్ణాల వారికే న్యాయం చేస్తారా అని నిలదీత

ఆసిఫాబాద్​ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురైన దళిత మహిళకు న్యాయం చేయాలంటూ జనం రోడ్డెక్కారు. ‘దిశ’ నిందితులను చంపేసినట్టే ఈ ఘటనకు పాల్పడినవారిని కూడా ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లాలోని జైనూర్ లో శనివారం బంద్, ఆందోళనలు చేశారు. జైనూర్, లింగాపూర్, సిర్పూర్ (యు), నార్నూర్​ మండలాల జనం, స్టూడెంట్లు పెద్దసంఖ్యలో ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అగ్రకులాల వారైతే ఓ న్యాయం, దళిత మహిళలకైతే మరో న్యాయమా అంటూ నినాదాలు చేశారు. జిల్లా ఎస్పీ రావాలని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. మూడు గంటలపాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. డీఎస్పీ వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. నిందితులు చట్టం పరిధిలో ఉన్నారని, నెల రోజుల్లో తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మూడెకరాల భూమి, ఇద్దరు పిల్లలకు గురుకుల స్కూళ్లో ఉచిత విద్య అందించేలా చూస్తామని హామీఇచ్చారు. ఇక వాంకిడిలో కూడా అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. దిశ నిందితులను ఎన్​కౌంటర్​ చేయడాన్ని హర్షిస్తున్నామని, దళిత మహిళను రేప్​ చేసి చంపేసినవారిని కూడా కాల్చి చంపాలని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మహోల్కర్ అశోక్  డిమాండ్​ చేశారు. దళిత మహిళను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డీవైఎఫ్ఐ, కేవీపీఎస్  నాయకులు, కార్యకర్తలు వాంకిడి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 20 లక్షలు ఆర్థిక సాయం చేయాలని, డబుల్​ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

అసెంబ్లీలో ప్రశ్నిస్తా: రేఖానాయక్

దళిత మహిళ రేప్, హత్య అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ చెప్పారు. శనివారం ఆమె బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై నమోదైన కేసు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని, బాధిత కుటుంబానికి ఇప్పటికే మొదటి విడతగా పరిహారాన్ని అందజేశారని చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చట్టాలు తెచ్చిందని, ఎవరైనా మహిళలు వేధింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.

ఈ కేసును పట్టించుకోవడం లేదేం: హర్షకుమార్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్​గా తీసుకుందని, మరి దళిత మహిళ విషయాన్ని పట్టించుకోవడం లేదేమని ఏపీకి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్​ ప్రశ్నించారు. దేశంలో రోజురోజుకు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. శనివారం బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించి, రూ.25 వేలు ఆర్థిక సాయం అందజేశారు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు.

Latest Updates