ఇరాక్​లో చిక్కుకుపోయిన్రు

ఏజెంట్ల మోసంతో గోస పడుతున్న తెలంగాణ వాసులు

కరీంనగర్‍, వెలుగుఏజెంట్లు చెప్పిన మాయమాటలు నమ్మి దేశం కానీ దేశంలో  తెలంగాణ జిల్లాలకు చెందిన యువకులు అవస్థలు పడుతున్నారు. ఉపాధి కల్పిస్తానని ఏజెంట్లు  చెప్తే నమ్మి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని  కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 16 మంది ఇరాక్ కు వెళ్లారు. అక్కడ పని దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. తాము మోసపోయిన విషయాన్ని గుర్తించిన వారంతా తమ కష్టాలను వివరిస్తూ   వీడియోలు పంపించారు.

పుట్టిన  ఊరిలో ఉపాధి లేక అప్పుల పాలై పరాయి దేశాలకు పయనమవుతున్న ఎందరో  అక్కడికెళ్లాక పని దొరకక నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణలోని నాలుగు జిల్లాలకు చెందిన 16 మంది ప్రస్తుతం ఇరాక్ కుర్బిస్తాన్ ప్రాంతంలోని ఎర్బిల్ పట్టణంలో అక్రమ నివాసులుగా దినదిన గండంగా గడుపుతున్నారు. ఈ 16 మందిని గల్ఫ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు గుర్తించి ఒక్కచోటకు చేర్చి ఆశ్రయం కల్పించారు. వీరిలో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూరుకు చెందిన కాళ్ల శ్రీనివాస్, చెందోలి గ్రామానికి చెందిన రేగుల రాజేశం, జగిత్యాల మండలం లింగంపేటకు చెందిన మామిడిపల్లి ప్రశాంత్, సిరికొండ వెంకటేశ్, ధరుమాజీపేటకు చెందిన పల్లెర్ల లక్ష్మినారాయణ, మంచిర్యాల జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన దుర్గం చంద్రయ్య, నిజామాబాద్ జిల్లా సాహెబ్ పేటకు చెందిన బట్టు గంగాధర్, వేల్పూరుకు చెందిన కుష్టాపురం ప్రేమ్ చందర్, రెంజర్లకు చెందిన సాకలి భూమేశ్, పడ్కల్ గ్రామానికి చెందిన జి. అశోక్,  కరీంనగర్ జిల్లా సర్వాపూర్ కు చెందిన ఉప్పరి అనిల్, ఆదిలాబాద్ జిల్లా బుట్టాపూర్ కు చందిన చిట్యాల చిన్న నర్సయ్య, ఉడుంపూర్ కు చెందిన ధూరూరి గోపాల్, వెంకట్రావుపేటకు చెందిన అంకటి సత్తయ్య,  గోరఖ్ పూర్(యూపీ)కి చెందిన దివాన్ పాసీ ఉన్నారు.

బిక్కుబిక్కుమంటూ..

గల్ఫ్ ఉద్యోగుల సంక్షేమం సంఘంవారు  వీరికి ఎంతోకాలం ఆశ్రయం కల్పించలేని పరిస్థితి ఉంది.  ఇరాక్ చట్టాల ప్రకారం అకామా(పని చేసేందుకు ఆ దేశం ఏడాది గడువుతో ఇచ్చే అనుమతి పత్రం) ఉంటేనే ఆ దేశంలో పని చేసుకోవచ్చు. లేదంటే వారందరిని అక్రమ నివాసులుగా గుర్తించి జైళ్లలో వేస్తారు. విజిటింగ్​వీసా మీద వచ్చి పరిమితికి మించి అక్కడ గడిపితే వారిపై ఘరామా(ఫైన్) విధిస్తారు. మన దేశ కరెన్సీ ప్రకారం నెలకు రూ.  35 వేలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ 16 మందిలో చాలామంది ఏడాది నుంచి నాలుగేళ్లుగా అక్కడే బిక్కుబిక్కుమంటూ  తలదాచుకుంటూ గడుపుతున్నారు. దొంగచాటుగా ఎక్కడన్నా పని దొరికితే ఆ వచ్చిన కొద్దిపాటి సొమ్ముతో కడుపు నింపుకోవడం…  లేదంటే పస్తులుంటున్నామని వారు చెబుతున్నారు. వీరంతా తిండి తిప్పలకు ఇబ్బంది పడుతూ..  ఇరాక్ లో ఉండలేక..  తిరిగి ఇండియాకు రాలేక చీకటి గదుల్లో..  నిర్మాణంలో ఉన్న భవనాల్లో తలదాచుకుంటున్నారు.

ఇండియాకు వచ్చేలా చూడండి

తెలిసీ తెలియక ఇరాక్ వచ్చి అక్రమ నివాసులుగా ముద్రపడిన వారికి ఆ దేశం అప్పుడప్పుడు ఆమ్నెస్టీ(క్షమాబిక్ష) ప్రకటిస్తుంది. అప్పుడు మాత్రమే  ఫైన్ లేకుండా దేశం విడిచిపోవడానికి  అనుమతిస్తుంది. కానీ ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆమ్నెస్టీ లేదు. దీంతో వీరు బయట కనిపిస్తే అరెస్టు చేస్తారు. లేదంటే ఘరామా కట్టి రావాల్సి ఉంటుంది. ఘరామా కట్టాలంటే తమలో చాలామంది ఒక్కొక్కరు రూ. 4 నుంచి 6 లక్షలు కట్టాలి.  అప్పులు చేసి ఇరాక్ వెళ్లిన వీరి దగ్గర తిరిగి వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఎలాగైనా కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలే  స్పందించి  తమను ఇరాక్ నుంచి ఇండియాకు తీసుకువెళ్లాలని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.  అకామా చేయిస్తామని చెప్పి తమను ఏజెంటు మోసం చేశాడంటూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూరుకు చెందిన బాధితులు, నిర్మల్ జిల్లాకు చెందిన మరో బాధితుడు కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో పంపించారు. తన భార్య చనిపోతే కూడా పోలేదని ఓ బాధితుడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు. తన కుటుంబసభ్యులకు బాగాలేకున్నా చూసుకునేందుకు వెళ్లలేని దుర్భర స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ కు
విజ్ఞప్తి చేశారు.

Latest Updates