స్కూల్ లో కరెంట్ షాక్.. స్టూడెంట్ మృతి

    జెండా పైపును తీస్తుండగా కరెంట్ తీగలకు తగిలి ఘటన

    పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన

తంగళ్లపల్లి, వెలుగు: స్కూల్ లో జెండా పైపును తీస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలకు తగలడంతో పదో తరగతి స్టూడెంట్ మృతి చెందిన సంఘటన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి ప్రభుత్వ పాఠశాలలో సోమవారం జరిగింది. సారంపల్లి గ్రామానికి చెందిన మసరకంటి కన్నయ్య, మల్లవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు అజయ్, ప్రదీప్. మండెపల్లి స్కూల్ లో అజయ్ పదో తరగతి, ప్రదీప్ ఏడో తరగతి చదువుతున్నారు. రిపబ్లిక్ డే రోజు జెండా ఆవిష్కరణకు వినియోగించిన ఇనుప పైపును తీసుకురమ్మని టీచర్ అజయ్ కు చెప్పగా… దాన్ని తీస్తుండగా కరెంట్ తీగలకు తగలడంతో షాక్ వచ్చింది. వెంటనే 108 అంబులెన్స్ లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్​ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. పెద్ద కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రికి చేరుకున్న సీఐ ఎండీ సర్వర్, ఎస్ఐ అభిలాష్​ కుటుంబసభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. స్టూడెంట్ కరెంట్ షాక్​తో మృతి చెందాడని తెలుసుకొని మండెపల్లి, రాళ్లపేట గ్రామస్తులు స్కూల్​దగ్గరికి చేరుకొని ఆందోళన చేశారు. స్కూల్లో తరచూ పిల్లలతో పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ కోల వంశీ, బొమ్మన చంద్రయ్య అనే ఇద్దరు షాక్​కు గురయ్యారని, అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు చదువు చెప్పాలని స్కూల్ కు పంపిస్తున్నామని, పనులు చేయించడానికి కాదని అన్నారు.

Latest Updates