పెన్ను కోసం ఫ్రెండునే చంపింది

పెన్ను కోసం గొడవ పడి తోటి స్నేహితురాలినే చంపిది ఒక అమ్మాయి. ఈ ఘటన జైపూర్‌లో జరిగింది. జైపూర్ చక్సులోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక పరీక్ష రాయడానికి స్కూల్‌కి వెళ్లింది. అక్కడ పరీక్ష హాలులో పెన్ను కోసం తన తోటి విద్యార్థినితో గొడవ పడింది. ఇది మనసులో పెట్టుకున్న విద్యార్థిని, పరీక్ష పూర్తయిన తర్వాత బాలిక ఇంటికి వెళ్లి మళ్లీ గొడవ పడింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమెను చంపాలని విద్యార్థిని నిర్ణయించుకుంది. అప్పటికే పదునైన రాడ్డుతో బాధితురాలి ఇంటికి వచ్చిన విద్యార్థిని, ఆమె తలపై బలంగా కొట్టింది. దాంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ దాడి గురించి పోలీసులకు చెబుతానని బాధితురాలు విద్యార్థినిని బెదిరించడంతో, భయపడ్డ విద్యార్థిని, బాధితురాలి తలపై 19 సార్లు కొట్టింది. దాంతో తీవ్ర రక్తస్రావమైన బాలిక అక్కడికక్కడే చనిపోయింది.

తిరిగి తన ఇంటికి వెళ్లిన విద్యార్థిని ఈ సంఘటన గురించి తన తల్లి మరియు అన్నకు వివరించింది. విద్యార్థినిపై ఉన్న ప్రేమతో ఆమె తల్లి మరియు అన్న బాలిక మృతదేహాన్ని రాయితో కట్టి పక్కనే ఉన్న చెరువులో పడేశారు. అయితే బాలిక మృతదేహానికి అంతిమ సంస్కారాలు జరపకపోతే తన కూతురుకి ఏమైనా అవుతుందని భయపడ్డ విద్యార్థిని తల్లి, ఘటన గురించి తన భర్తకు తెలిపింది. దాంతో విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు, అన్న అందరూ కలిసి బాలిక మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీసి స్థానికంగా నిర్మాణంలో ఉన్న పాఠశాల వద్ద పడేశారు.

మృతి చెందిన బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లి ఆమె తోటి విద్యార్థులను విచారించగా పెన్ను కోసం మృతిచెందిన బాలిక మరో విద్యార్థినితో గొడవపడినట్లు తెలిసింది. దాంతో పోలీసులు విద్యార్థినిని విచారించగా అసలు విషయం బయటపడింది. బాలికను చంపిన నిందితురాలిని అదుపులోకి తీసుకోని, ఆమె తల్లిదండ్రులు మరియు సోదరుడిని అరెస్టు చేసినట్లు జైపూర్ అదనపు పోలీసు కమిషనర్ అశోక్ గుప్తా తెలిపారు.

Latest Updates