స్టూడెంట్ సైంటిస్ట్.. ఈ కరీంనగర్ పిలగాడు

student-scientist-mittapally-srikanth-from-karimnagar

ఆ పిలగాడికి ప్రయోగాలంటే చాలా ఇష్టం. తన ప్రయోగాలతో తోటి విద్యార్థులనే కాదు.. సైంటిస్టులను ఆలోజింపచేశాడు. రైతులకు ఉపయోగపడే ‘సోలార్​ మల్టీ అగ్రికట్టర్’ అనే పరికరం తయారు చేశాడు. ఆ పిలగాడు ఎవరు? ఆ పరికరం ఎందుకు కనిపెట్టాడు?

ఇది సైన్స్​ అండ్​ టెక్నాలజీ యుగం. అందుకే విద్యార్థులు ప్రయోగాల బాట పడుతున్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతున్నారు. గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన మిట్టపల్లి శ్రీకాంత్​అనే విద్యార్థి కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీకాంత్​ చిన్నతనం నుంచి చదువులో చురుకు. శ్రీకాంత్ ​ప్రతిభను గుర్తించి టీచర్లు మరింత ప్రోత్సహించారు. దాంతో చదువుతోపాటు ప్రయోగాలపై దృష్టి పెట్టాడు.

రైతుల కోసం పరికరం
టెక్నాలజీపరంగా ఎంత అభివృద్ధి సాధించినా.. గ్రామీణ రైతులు ఇప్పటికీ పాత పనిముట్లనే వాడుతున్నారు. దాంతో సాగులో వెనకబడుతున్నారు. అప్పుల ఊబిలోనూ కూరుకుపోతున్నారు. రైతులకు మేలు చేసే ప్రయోగాలు చేస్తే బాగుంటుందని అనుకున్నాడు శ్రీకాంత్​. వరి, మొక్కజొన్న, మామిడి మొదలైన పంటలను కోసేందుకు ఇంకా పాత పనిముట్లను వాడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. సైన్స్ టీచర్​ జగదీశ్వర్​రెడ్డి సాయంతో పంటలను కోయడానికి ఒక పనిముట్టును తయారుచేశాడు. అదే సోలార్​ ‘మల్టీ అగ్రి కట్టర్’​.

ఎలా పనిచేస్తుంది?
2950 ఆర్పీఎం డీసీ మోటార్​, 12 వోల్ట్స్​ బ్యాటరీ, 20 వాట్స్​ సోలార్​ ప్యానెల్​, పవర్​ కన్వర్టర్​, సైకిల్​ చక్రం, ఐరన్​ రాడ్​తో ఈ పరికరం తయారు చేశాడు. ఇది సూర్యరశ్మితోనూ పనిచేస్తుంది. మూడు గంటలు ఎండలో ఉంచితే 12 వోల్ట్స్​తో చార్జ్​ అవుతుంది. దీనితో రోజంతా వరి, మొక్కజొన్న, కంది, పత్తి పొరకను కోయొచ్చు. ఈ పరికరానికి ‘ఇన్​స్పైర్​ మనాక్’​ విభాగంలో సైన్స్​ ఫెయిర్​​లో ప్రదర్శించిన పోటీల్లో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది.

సదస్సులకు వెళ్తూ..
శ్రీకాంత్​ మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. రాష్ర్ట, జాతీయ సైన్స్​ సదస్సులకు వెళ్తున్నాడు. తాను తయారుచేసిన పరికరం గురించి, పని విధానం గురించి వివరిస్తున్నాడు. గతనెల త్రివేండ్రంలో ఇస్రో నిర్వహించిన ‘యంగ్​ సైంటిస్ట్’ సదస్సులో పాల్గొన్నాడు. అక్కడ శాస్త్రవేత్తలను కలుసుకున్నాడు. ప్రయోగాలపై పట్టు ఎలా సాధించాలి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నాడు. నెల్లూరు​ జిల్లాలో శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి కూడా వెళ్లాడు. అక్కడ రాకెట్​ తయారీ విధానం, శాటిలైట్​ ప్రయోగం లాంచింగ్​ విధానాలు తెలుసుకున్నాడు. శ్రీకాంత్​ ప్రయోగాన్ని మెచ్చిన ఇస్రో చైర్మన్​ గోల్డ్​మెడల్​తోపాటు ప్రశంసాపత్రం అందించారు.

ఇదే స్ఫూర్తితో ప్రయోగాలు చేస్తా
సైన్స్ అవగాహన సదస్సుల వల్ల ఎన్నో విషయాలు తెలుసుకున్నా. సైంటిస్టులను డైరెక్ట్ గా  కలిసే అవకాశం వచ్చింది. నాకున్న డౌట్స్ను అడిగి తెలుసుకున్న. సైంటిస్టులు అందించిన సలహాలు, సూచనలు నాకు ఉపయోగపడ్డాయి. ఇదే స్ఫూర్తితో సమాజానికి ఉపయోగపడే మరిన్ని ప్రయోగాలు చేస్తా.

Latest Updates