ఓయూలో స్టూడెంట్ ఆత్మహత్య!

ఓయూ (హైదరాబాద్), వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవలే పీహెచ్‌డీ పూర్తిచేసిన స్టూడెంట్​కొంపెల్లి నర్సయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్​లో తాను ఉంటున్న గదిలో సోమవారం మధ్యాహ్నం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఉద్యోగం రాలేదన్న ఆవేదనతోనే నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ప్రభుత్వ హత్యే అంటూ యూనివర్సిటీలో స్టూడెంట్లు ఆందోళనకు దిగారు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు హాస్టల్​ వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సయ్య తన గదిలో ఏదో విషాన్ని ఓఆర్ఎస్​ డ్రింక్​లో కలుపుకొని తాగినట్టుగా అనుమానిస్తున్నామని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ ఏమీ చెప్పలేమని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

డోర్​ తీయకపోవడంతో..

కొంపెల్లి నర్సయ్య (45) సొంతూరు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రఫీ సబ్జెక్టుపై పీహెచ్​డీ పూర్తి చేశారు. వర్సిటీలోని న్యూపీజీ హాస్టల్​రూమ్​నంబర్​-3లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి గదిలోకి వెళ్లి పడుకున్న నర్సయ్య సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా బయటికి రాలేదు. ఆయన రూమ్​ ముందు న్యూస్​ పేపర్​ కూడా అలాగే పడి ఉండటంతో పక్క రూముల్లో ఉన్న స్టూడెంట్లు తలుపుకొట్టారు. నర్సయ్య ఫోన్​ కు కాల్​ చేశారు. ఫోన్​ రింగ్​ సౌండ్​ బయటికి వినిపిస్తున్నా ఎవరూ లిఫ్ట్​ చేయలేదు. దాంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి తొంగి చూడగా.. నర్సయ్య అపస్మారకంగా పడి ఉన్నారు. స్టూడెంట్లు పెద్ద వెదురు బొంగు తీసుకొచ్చి.. కిటికీలోంచి తలుపు గొళ్లెం తీశారు. అప్పటికే 108కు ఫోన్​ చేయగా సిబ్బంది వచ్చి, నర్సయ్య చనిపోయాడని చెప్పారు. ఓయూ పోలీసులు, క్లూస్​ టీమ్​ గదిని పరిశీలించి, శాంపిల్స్​ సేకరించారు.

కొద్దిరోజులుగా ఉద్యోగం వేటలో..

నర్సయ్య తన ముగ్గురు అక్కలకు పెళ్లి చేశాడని, తల్లిదండ్రులను పోషించేందుకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడని ఓయూ స్టూడెంట్లు చెప్పారు. ఈ ఆవేదనతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు నర్సయ్య డెడ్​బాడీని గాంధీ మార్చురీకి తరలించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్​ పుట్టినరోజునే ఓ స్టూడెంట్​ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందంటూ నిరసన తెలిపారు. దీంతో అంబులెన్సులో కాకుండా పోలీసుల వెహికిల్​లో నర్సయ్య డెడ్​బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. తర్వాత స్టూడెంట్లు బీ హాస్టల్​ వద్ద వర్సిటీ మెయిన్​ రోడ్డుపై ఆందోళన చేశారు. పీజీ పూర్తి చేసిన నర్సయ్య జాగ్రఫీ డిపార్ట్​మెంట్ లో క్లాసులు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కోరారని, కానీ అధికారులు పట్టించుకోలేదని ఓయూ స్టూడెంట్​లీడర్లు ఆరోపించారు. ఆయన ఆత్మహత్యకు వర్సిటీ అధికారులు బాధ్యత వహించాలన్నారు. మంగళవారం ఓయూ బంద్​కు పిలుపునిచ్చారు.

Latest Updates