లాక్ డౌన్ తో ఇరుక్కుపోయిన 100 మంది నవోదయ స్టూడెంట్స్

కరీంనగర్, వెలుగు:కరోనా కారణంగా 35 రోజులుగా దేశమంతా లాక్ డౌన్​లో ఉంది.  స్కూళ్లు మూతపడి స్టూడెంట్స్ అంతా ఇండ్లలో హాలీడేస్​ ఎంజాయ్​ చేస్తున్నారు. అమ్మ చేసే వంటకాలు ఆరగిస్తూ, నాన్న చెప్పే కబుర్లు వింటూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్​మాత్రం స్కూళ్లలోనే చిక్కుకుపోయారు. నార్త్​ ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 275 మంది పిల్లలు మన రాష్ట్రంలో ఉండిపోతే,  తెలంగాణకు చెందిన సుమారు 100 మంది స్టూడెంట్స్​ వివిధ రాష్ట్రాల్లోని నవోదయ స్కూళ్లలో లాక్​డౌన్​ అయ్యారు. నెలల తరబడి ఇండ్ల మొహం చూడకపోవడంతో చిన్నారులు తల్లిదండ్రులపై బెంగపెట్టుకున్నారనీ, వారిని స్వస్థలాలకు పంపే విషయంలో తమకెలాంటి ఆదేశాలు రాలేదని ప్రినిపాల్స్​ చెబుతున్నారు.

మైగ్రేషన్ స్టడీ​ పేరిట ఇతర రాష్ట్రాలకు..

జవహర్​ నవోదయ విద్యాలయాలకు జాతీయ స్థాయిలో మంచి పేరు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని మెరిట్​ స్టూడెంట్స్​కు రెసిడెన్షియల్​ విధానంలో క్వాలిటీ ఎడ్యూకేషన్ ను ఈ విద్యాలయాలు​అందిస్తున్నాయి. స్టూడెంట్స్ ఆల్ రౌండ్​ డెవలప్​మెంట్​కు కృషిచేయడంతో పాటు వారిలో జాతీయభావాన్ని పెంపొందించడంతో వీటికివే సాటి. ఇండియాకు సంబంధించి  భిన్నత్వంలో ఏకత్వాన్ని విద్యార్థి దశలోనే స్టూడెంట్స్​కు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో నవోదయ విద్యాలయాల్లో ఓ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్స్​ను దక్షిణాది నవోదయ లకు,  దక్షిణాదికి చెందిన స్టూడెంట్స్​ను ఉత్తరాది నవోదయ విద్యాలయాలకు పంపి కనీసం ఒక అకడమిక్​ ఇయర్ చదివిస్తారు. ఇందుకోసం ప్రతి పాఠశాల నుంచి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో సగం మందిని డ్రా ద్వారా ఎంపిచేసి, ఇతర  రాష్ట్రాలకు పంపిస్తారు. తద్వారా అక్కడి భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలపై స్టూడెంట్స్​​ పట్టుసాధిస్తున్నారు.

చిక్కుకున్నరు..

మన రాష్ట్రంలోని అన్ని పాత జిల్లాకేంద్రాల్లో నవోదయ విద్యాలయాలున్నాయి. స్టడీ కోసం నార్త్​ నుంచి వచ్చిన సుమారు 175 మంది స్టూడెంట్స్​ అదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్ నవోదయల్లోనే ఉండిపోయారు. ఇక్కడి రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాలకు చెందిన  సుమారు100 మంది రాజస్థాన్, చత్తీస్​గఢ్​,  హర్యానా తదితర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. నవోదయ విద్యాలయాల్లో సాధారణంగా మార్చి 26 కల్లా ఎగ్జామ్స్​పూర్తవుతాయి. మరుసటి రోజు27న స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంది. ఈమేరకు చాలామంది ట్రైన్​ టికెట్లు కూడా రిజర్వేషన్ చేసుకున్నారు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎగ్జామ్స్​ మార్చి 18, 19 లోపే పూర్తి చేశారు.  తర్వాతి  రోజు నుంచే స్థానికంగా ఉన్న పిల్లలకు  సెలవులు ఇచ్చేశారు.  కానీ ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్​ మాత్రమే లాక్ డౌన్ కారణంగా ఎక్కడివారక్కడే చిక్కుకున్నారు. ఏప్రిల్ 14న లాక్ డౌన్ ఎత్తివేస్తారనే సమాచారంతో తిరిగి ట్రైన్​ టికెట్స్​ బుక్​ చేసుకున్నారు. తీరా మరోసారి లాక్​డౌన్​పొడిగించడంతో ఆందోళన చెందుతున్నారు.  సమ్మర్​ హాలీడేస్​లో కూడా కేవలం వీరి కోసం స్టాఫ్​ విధులకు వస్తున్నారు. యోగా, ఆటలు, సంగీతం నేర్పుతున్నారు. నాన్​టీచింగ్​ స్టాఫ్​కు వంటావార్పు చేసి పెడుతున్నారు. కానీ పిల్లలు మాత్రం స్ట్రెస్​ ఫీలవుతున్నారనీ, ఇండ్లపై బెంగపెట్టుకుంటున్నారని ప్రిన్సిపాల్స్​ అంటున్నారు. వారిని రోడ్డు మార్గంలోనైనా స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు.

చొరవ తీసుకోవాలి

పిల్లలు చాలా బెంగ పెట్టుకుంటున్నారు. మొదట  బాగానే ఉన్నారు. కానీ లాక్ డౌన్ పొడిగించినప్పటి నుంచి ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈ సమస్యను కేంద్ర హోం శాఖ, మానవ వనరుల శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లాం. కానీ స్టూడెంట్స్​ను పంపించే దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పిల్లలు ఇంటి మీద బెంగతో సరిగా తినడం లేదు. ఇలాగే ఇంకొద్ది రోజులు ఉంటే వారిలో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముంది.

–కె.మంజుల, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా నవోదయ స్టాఫ్ అసోషియేషన్

పిల్లలు బెంగ పెట్టుకుంటున్నరు

మా కూతురు వాలుక ఆకృతి చొప్పదండి జవహర్ నవోదయలో నైన్త్​ చదువుతోంది. మైగ్రేషన్​ స్టడీ కోసం వాళ్ల క్లాస్​ స్టూడెంట్స్​ జార్ఖండ్ రాష్ట్రంలోని సాహెబ్ గంజ్ నవోదయకు వెళ్లారు. గత దీపావళికి ఇంటికి వచ్చి పోయారంటే ఇప్పటికీ రాలేదు. ఎగ్జామ్స్​ పూర్తికావడంతో ఇక్కడికి రావడానికి మార్చి 21 సాయంత్రం 10 గంటలకు ట్రైన్ టికెట్ కూడా రిజర్వేషన్ చేసుకున్నారు. కరోనా కారణంగా మార్చి 22న జనతా కర్ఫ్యూ, అనంతరం లాక్ డౌన్  ప్రకటించడంతో  పిల్లలు అక్కడే ఉండి పోయారు.  రెండు, మూడు రోజులకు ఒకసారి  మాతో ఫోన్లో మాట్లాడుతున్నారు. మా మీద చాలా బెంగపెట్టుకున్నారు. ఆఫీసర్లు ప్రత్యేక చొరవ తీసుకుని  వారిని ఇక్కడికి పంపించే ఏర్పాట్లు చేయాలి.

–వాలుక హనుమంతు, మైగ్రేషన్ స్టూడెంట్ పేరెంట్, పెద్దపల్లి

Latest Updates