ఇదో మంచి స్కూల్ : ప్లాస్టిక్ కవర్లే అక్కడ ఫీజులు

పర్యావరణానికి పెద్ద శత్రువు ప్లాస్టిక్. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వేస్ట్ కనిపిస్తుంది. ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్త కనిపించని ప్లేస్ ఉండనే ఉండదు. అలాంటి ప్లాస్టిక్ వేస్ట్ ను మాత్రమే ఫీజుగా తీసుకుని.. పాఠాలు చెబుతోంది ఓ స్కూల్.

వేలల్లో ఫీజులు గుంజి.. లక్షల్లో డొనేషన్లు కట్టించుకునే స్కూళ్లున్న జమానా ఇది. అలాంటిది… ప్లాస్టిక్ వేస్ట్ ను ఫీజుగా తీసుకుంటున్నారంటే అదేదో సర్కారు బడో… ఇంకేదో అయి ఉంటుందని చులకన భావంతో చూడకండి. ఈ స్కూల్ అస్సాంలో ఉంది. అక్షర్ ఫౌండేషన్ ఈ స్కూల్ ను నడుపుతోంది.

స్కూలు వచ్చే పిల్లలను గమనిస్తే.. చాలా ఆసక్తి కలుగుతుంది. ఓ చేత్తో బ్యాగ్… మరో చేత్తో చెత్త కవర్ తో స్కూల్ కు వస్తుంటారు పిల్లలు. వారి ఇంట్లో గానీ.. పక్క ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ ను వారు కవర్ లో పెట్టుకుని ఇక్కడకు రావాలి. అలా.. పిల్లలు తెచ్చిన ప్లాస్టిక్ వేస్ట్ ను స్కూల్ నిర్వాహకులు ప్రత్యేకంగా రీయూజ్ చేస్తారు. ప్లాస్టిక్ మెటీరియల్ ను కన్ స్ట్రక్షన్ కోసం సిమెంట్ తో కలిపి వాడతారు. అలా స్కూల్ ఆవరణలో ఓ గోడ, గది కట్టేశారు.

చదువు మధ్యలో ఆపేసిన వాళ్లే అక్కడ టీచర్లు

ఈ ఫౌండేషన్ పెట్టి… నిస్వార్థంతో సేవ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక్కడ చదువుకునేవాళ్లంతా వీధి పిల్లలే. వాళ్లకు చదువు చెప్పేది కూడా వీధి పిల్లలే. కాకపోతే పాఠాలు చెప్పేవాళ్లు చదువు మధ్యలో ఆపేసిన కొంచెం పెద్దవాళ్లు. పాఠాలు చెప్పినందుకు వాళ్లకు డబ్బు ఇస్తుంటారు ఫౌండేషన్ నిర్వాహకులు. ప్రాక్టికల్ గా.. పిల్లలకు అర్థమయ్యేలా ఇక్కడ పాఠాలను చెబుతున్నారు.

ప్రభుత్వ స్కూళ్లలో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం తమ లక్ష్యం అని అక్షర్ ఫౌండేషన్ అంటోంది.

 

Latest Updates