లోక్‌సభ స్పీ కర్ ఓం బిర్లా
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ క్యాంటీన్లో ఎంపీలు, సిబ్బందికి ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఎత్తేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. దీని వల్ల దాదాపు రూ.7 కోట్ల వరకు ఆదా అవుతుందన్నారు. ఈనెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా వివరాలను మంగళవారం మీడియాకు వివరించారు. కరోనా ఇంకా ముగిసిపోలేదని, ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఎంపీ, వారి సిబ్బంది కచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. 27, 28 తేదీల్లో పార్లమెంట్ ఆవరణలో కూడా టెస్టులు చేస్తారన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో సీటింగ్ కూడా కరోనా నిబంధనల ప్రకారం ఉంటుందని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన పాలసీ ప్రకారమే ఎంపీలు నడుచుకోవాలని అన్నారు.రాజ్యసభ సమావేశాలు ఉదయం తొమ్మిదింటి నుంచి మధ్యాహం రెండింటి వరకు, లోక్‌సభ సమావేశాలు సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటాయని బిర్లా వివరించారు. ఈ సమావేశాల్లో గంటసేపు క్వశ్చన్ అవర్ ఉంటుందని, జీరో అవర్‌ను కూడా తిరిగి ప్రారంభిస్తున్నామని అన్నారు.
అగ్రిచట్టాలపై చర్చకు ప్రతిపాదనలు రాలేదు…
అగ్రి చట్టాలపై చర్చ నిర్వహించాలని ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఓం బిర్లా స్పష్టం చేశారు. సభ బయట చేసిన డిమాండ్లను పార్లమెంట్ అజెండాలో భాగం చేయలేమని చెప్పారు. ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత సభలో చర్చించాల్సిన అంశాలు, బిల్లులపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కరోనా కారణంగా ఫిజికల్ బడ్జెట్ కాపీల ప్లేస్‌లో డిజిటల్ బడ్జెట్ కాపీలు అందిస్తున్నామన్నారు