ఆ ఫోటోలో ఉన్నది నేనే..అక్కడ కూర్చొని కూరగాయలు అమ్మేందుకు కాదు : ఇన్ఫోసిస్‌ సుధా మూర్తి

వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్థాంగి..ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సుధా మూర్తి కూరగాయాలు అమ్ముతున్నారంటూ కొంతమంది ఔత్సాహికులు మసిపూసి మారేడుగాయలా చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అందులో వాస్తవంలేదని..తాను కూరగాయాల మధ్య కూర్చొన్నట్లు గా ఉన్న ఫోటోపై సుధామూర్తి స్పదించారు.

సుధామూర్తి తనలోని అహం తగ్గించుకునేందుకు సంవత్సరానికి మూడురోజుల పాటు కూరగాయలు అమ్ముతారంటూ కొంతమంది నెటిజన్లు కూరగాయల మధ్య కూర్చొని ఉన్న సుధామూర్తి ఓ ఫోటోను వైరల్ చేశారు.

ఆ ఫోటోపై సుధామూర్తి స్పందించారు. బెంగళూరులోని తన ఇంటి సమీపంలో జయానగర్ 5వ బ్లాక్ రాఘవేంద్రమఠంలో ఉన్న రాఘవేంద్రరాయర సమ్రదానేలో కూరగాయాల మధ్య కూర్చున్నది తానేనని చెప్పారు.

చిన్న వయసు నుంచే తన నాయినమ్మ చెప్పినట్లు ప్రతీ ఏడాదిలో మూడురోజుల పాటు రాఘవేంద్రస్వామి సన్నిధిలో భక్తులకు సేవ చేస్తానని అన్నారు. మూడురోజుల పాటు తానే స్వయంగా కూరగాయల్ని కట్ చేసి భోజనాల్ని, ప్రసాదాల్ని సిద్ధం చేస్తానని అన్నారు. సాయంగా తన అక్క టెంపుల్ కు వస్తారని తెలిపారు.

ఇలా చేయడం వల్ల నాకు ఎంతో మానసిక ప్రశాంతత, మూడురోజుల పాటు భక్తులకు సేవచేయడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. భక్తులకు సేవ చేస్తే దేవుడికే సేవ చేశానని భావిస్తున్నట్లు తెలిపారు.

ప్రతీ ఏడాదిలో మూడురోజుల పాటు ఉదయం 6:30 నుంచి ఉదయం 10గంటలకు వచ్చి పని పూర్తి చేసుకొని 10గంటల నుంచి ఆఫీస్ కి వెళ్తానని, ఆఫీస్ ముగిసిన వెంటనే సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి 10గంటల పాటు రాఘవేంద్రస్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు సేవ చేస్తానని, ఇలా సేవచేయడం కొన్ని ఏళ్లుగా జరుగుతుందన్నారు.

టెంపుల్ వద్దకు వచ్చే భక్తులు తనతో ఫోటోలు దిగాలని అడుగుతారని, కానీ తాను మాత్రం ఫోటోలు దిగేందుకు ఒప్పుకోనని అన్నారు. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు తాను ధ్యానం చేసే పనిలో ఉంటానని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ సుధా మూర్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోపై స్పందించారు.

Latest Updates