నాకు పెళ్లి ఇష్టం లేదు..సింగిల్ గానే ఉండాలని ఉంది

‘సుడిగాలి’ సుధీర్..ఈ పేరు వినగానే కాకరపువ్వొత్తిలా ప్రేక్షకుల మొహంలో నవ్వులు విరుస్తాయ్. అతని కామెడీ స్కిట్స్ చిచ్చుబుడ్డిలా నవ్వుల పువ్వులు పూయిస్తాయ్. ‘ఏదీ ప్లాన్ చేసుకోలేదు. అందిన అవకాశాల్ని వదలకుండా చేసుకుంటూ పోతున్నా. అదృష్టం కొద్దీ అన్ని అవకాశాలూ ఎండబెట్టిన క్రాకర్స్​లా బాగా పేలుతున్నాయని’ అంటున్నాడు సుధీర్‌. ‘చూస్తే తోక పటాకాలా అల్లరిగా కనిపించినా, భూచక్రంలా నేను చాలా సైలెంట్’ అని చెప్తున్నాడు. ఈ దీపావళి నాడు నవ్వుల భూ చక్రం, కామెడీ లక్ష్మీ బాంబ్, మాటల తౌజండ్ వాలా ‘సుడిగాలి’ సుధీర్ పేల్చిన పంచ్​ల పటాకులు మీ కోసం…

మీ పూర్తి పేరు ఏంటి?

స్క్రీన్ వరకే నేను ‘సుడిగాలి’ సుధీర్​ని. బయటకొస్తే సుధీర్ ఆనంద్. మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను సిద్ధు, సిద్ధార్థ అని ముద్దుగా పిలుస్తారు. నాకు నార్మల్ పర్సన్​గా ఉండటమంటేనే చాలా ఇష్టం. అందుకే సుడిగాలి సుధీర్​గా కంటే సిద్ధూగా ఉండాలనుకుంటాను.

స్కిట్స్, ఈవెంట్స్​లో.. మీమీద పంచ్​లు వేస్తుంటారు? మీకేమీ అనిపించదా?

అదంతా స్కిట్ కోసమో లేక ఈవెంట్‌ను హైలెట్ చేయడం కోసమో ఉంటుంది. అందుకే అంతగా ఫీల్ అవ్వను. అది నా స్కిట్ అయినా, వేరేవాళ్ల స్కిట్​లోనైనా నేను చేస్తున్నానంటే.. కేవలం ఎంటర్ టైన్​మెంట్​ కోసమే. అందుకే అమ్మాయిల విషయంలో నాపై జోక్స్ వేసినా పట్టించుకోను.

నిజంగా అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ ఎక్కువా?

కానే కాదు. నా ఫ్రెండ్స్​లో కూడా అమ్మాయిలు లేరు. హాస్టల్ గోడలు దూకడం, అమ్మాయిలతో కలిసి సినిమాలకు, పబ్‌లకు వెళ్లాననడం.. అంతా స్కిట్​ల కోసమే. నేనలా ఉండను.

రష్మితో కలిసి డాన్స్ చేసేటప్పుడు, ప్రపోజ్ చేస్తున్నట్లు నటించేటప్పుడు మీవి రియల్ ఫీలింగ్స్​ అనిపిస్తాయి…?

జబర్దస్త్ షోస్​లోకి అయితే ముందుగా ప్రిపేర్ అవుతాం. కానీ ‘ఢీ’ లాంటి షోస్ అప్పటికప్పుడే చేయాలి. డాన్స్, డైలాగ్స్​ అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుంటాం. అందుకే నేచురల్​గా ఫీలింగ్స్ బయటకు వస్తుంటాయి. అయినా ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయమంటే సిగ్గు, భయం రెండూ ఉంటాయి కదా!

ఇప్పటివరకు మీరు ఎవరికీ ప్రపోజ్ చేయలేదా?

చేశాను. కానీ ఇప్పుడు కాదు. స్కూల్ టైంలో. ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి నేను ఒకమ్మాయిని ఇష్టపడ్డాను. నైన్త్ క్లాస్​లో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాను. ప్రపోజల్ అంటే ‘లవ్ ఉంద’ని చెప్పడం, ‘పెళ్ళి చేసుకుంటాన’ని చెప్పడం కాదు. నువ్వంటే ఇష్టమని చెప్పా. అంతే.

తను ఒప్పకుందా?

ఒప్పుకుంది. ఇంటర్ వరకు మా లవ్ కంటిన్యూ అయింది కూడా. కానీ ఆ తరువాత వేరే పెళ్లి చేసుకుంది. ఆ టైంలో నేను హైదరాబాద్​లో  ఉన్నాను. తను విజయవాడలో ఉంది. కమ్యూనికేట్ చేసుకోవడానికి మా దగ్గర ఫోన్లు లేవు. ఎలాగోలా కష్టపడి ఒకసారి ఫోన్ చేస్తే.. ‘నేను హ్యాపీగా ఉన్నా డిస్టర్బ్​ చేయొద్దు’ అంది. ఆ తరువాత మాట్లాడాలి అనిపించింది. కానీ పద్ధతి కాదని మానేసా. ఆ తరువాత కొన్నాళ్ళు డిప్రెషన్​లోకి వెళ్లిపోయాను. కానీ పేరెంట్స్ కోసం, లైఫ్​లో ఏదో సాధించాలనే ఆలోచనతో నాకు నేనే సర్ది చెప్పుకున్నా. మెల్లిగా ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా.

మీకెవరైనా ప్రపోజ్ చేశారా?

ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. మెసేజ్‌లు కూడా వస్తుంటాయి. బయటకు వెళ్లినప్పుడు కూడా ‘మీరంటే చాలా ఇష్టం. పెళ్ళి చేసుకుందామా?’ అని అడుగుతుంటారు.

టీవీ షోలు, ఈవెంట్స్, సినిమాలు.. ఇన్ని చేస్తున్నారు కదా అన్నింటికీ టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు?

టీవీ షోలకు పర్వాలేదు. కానీ ఈవెంట్స్ ఉన్నప్పుడే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సినిమాలు కూడా చేస్తున్నా. కానీ ఇప్పుడే కదా ఏదైనా చేయాలన్నా, సాధించాలన్నా. అడ్జస్ట్ చేసుకోవాలి.

ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు?

మూడు సినిమాలు చేస్తున్నాను. కొత్త డైరెక్టర్ అరుణ్ డైరెక్షన్​లో ‘కాలింగ్ సహస్ర’లో హీరోగా, ‘సాఫ్ట్​వేర్ సుధీర్’ సినిమా డైరెక్టర్​తో ఇంకో సినిమా చేస్తున్నాను. అక్కినేని అఖిల్ సినిమా ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్​’లో అఖిల్​కు ఫ్రెండ్​గా నటించాను.

జబర్దస్త్ లో ఛాన్స్ ఎలా వచ్చింది?

నేను పెళ్లిళ్లు, బర్త్ డే ఈవెంట్స్ చేసేవాడ్ని. ఓ రోజు శీను నాతో ‘వేణన్న టీంలో ఓ క్యారెక్టర్ ఉంది..చేస్తావా’ అని అడిగాడు. ఆ టైంలో నేను కూడా ‘నా టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి…’ అన్న ఆలోచనలో ఉన్నాను. ఆ అవకాశం రావడంతో వేణన్నను కలిసాను. కొన్ని డైలాగులు చెబుతూ.. యాక్ట్ చేసి చూపించమన్నాడు. అలానే చేశాను. ఇంప్రెస్​ అయ్యి తన స్కిట్​లో అవకాశం ఇచ్చాడు.

ఫస్ట్ ఏ క్యారెక్టర్ చేశారు. టీం లీడర్ ఎప్పుడు అయ్యారు?

ఫస్ట్ నేను ఆటో డ్రైవర్​ క్యారెక్టర్‌ చేశాను. జబర్దస్త్​లోకి వచ్చిన కొన్ని నెలలకే టీం లీడర్ అయ్యాను. టీం లీడర్ అయ్యాననే కాన్సెప్ట్ తోనే శీను, నేను, రాం ప్రసాద్ కలిసి మొదటి స్కిట్ చేశాం. అది సూపర్​ హిట్టయ్యింది.

జబర్దస్త్ లోకి రాకముందు ఏం చేసేవారు?

బర్త్ డే, వెడ్డింగ్స్, సాఫ్ట్​వేర్ ఈవెంట్స్ చేసేవాడ్ని. అంతకుముందు రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్ చేశాను. అక్కడ నుంచి బయటకొచ్చి ఈవెంట్స్​లో మ్యాజిక్ షోలు చేసేవాడ్ని. ఆ తరువాత ఈవెంట్ మేనేజర్​గా సొంతంగా ఈవెంట్స్ చేశాను.

మ్యాజిక్ ఎలా నేర్చుకున్నారు?

చిన్నప్పుడు మా అన్నయ్య ఒకరు అమెరికా వెళ్లేటప్పుడు మెజీషియన్​తో ఈవెంట్ పెట్టించాడు. అప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నా. ఆ మెజీషియన్ చేసిన వాటికి ఇన్​స్పైర్​ అయ్యి… నాకూ నేర్చుకోవాలి అనిపించింది. ఫస్ట్ మా మామయ్య పరశురాం దగ్గర నేర్చుకున్నా. హైదరాబాద్ వచ్చాక మెజీషియన్ ఆలీగారి దగ్గర నేర్చుకున్నా. ఈవెంట్స్ చేసేటప్పుడే మ్యాజిక్​ కూడా చేసేవాడ్ని. స్టేట్ లెవల్​లో ఆరు సార్లు, నేషనల్ లెవల్​లో రెండు సార్లు ప్రైజులు వచ్చాయి.

ఈ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు?

నో ప్లాన్స్. ఓన్లీ సేఫ్టీ ముఖ్యం. ఇంట్లోనే అందరం కలిసి జరుపుకుంటాం. పర్యావరణానికి హాని చేయొద్దనే ఉద్దేశంతో చాలా ఏళ్ల నుంచి క్రాకర్స్ ఎక్కువగా కాల్చడం లేదు. ఈ సారి కూడా అంతే… స్వీట్లు, దీపాలతోనే దీపావళిని గ్రాండ్​గా చేసుకుంటాం.

దీపావళి అనగానే గుర్తుకొచ్చేది..?

చిన్నప్పుడు దీపావళి వస్తోందంటే  క్రాకర్స్ ముందే కొని తెచ్చుకుని ఇంటి దగ్గర ఎండలో పెట్టేవాళ్ళం. మా అక్క, తమ్ముడు దాచుకున్నవి కొట్టేసేవాడ్ని. బయట ఎండకోసం పెట్టినా.. ఇంట్లో ఎక్కడ దాచుకున్నా కనిపెట్టి మరీ కొట్టేసి నా క్రాకర్స్​లో కలిపేసుకునేవాడ్ని. వాళ్లు నన్ను అడిగితే ‘తెలియద’ని అమాయకంగా చెప్పేవాడ్ని.

ఈ దీపావళికి మీ ఫ్యాన్స్​కు ఏం చెబుతారు?

క్రాకర్స్ ఎక్కువగా కాల్చొద్దనే అంటాను. విపరీతంగా క్రాకర్స్ కాల్చడం వల్ల ఎయిర్, సౌండ్ పొల్యూషన్ పెరిగిపోతుంది. వీలైతే వాటికి దూరంగా ఉండటం బెస్ట్. కరోనా టైం కూడా కాబట్టి కుటుంబ సభ్యులతోనే పండుగ కలిసి చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ బయటకెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నా కరోనా జాగ్రత్తలు తీసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి.

సుధీర్, శీను, రాంప్రసాద్..మీ ముగ్గురిదీ మంచి కాంబినేషన్. అసలు మీ ముగ్గురు ఎలా కలిశారు?

శీను, నేను ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్​. రాంప్రసాద్ జబర్దస్త్​కు వచ్చాకే ఫ్రెండ్ అయ్యాడు. అందరం కలిసి చేసుకోవాలని మేము ప్లాన్​ చేయలేదు. అనుకోకుండా ముగ్గురం కలిసాం. క్లోజ్ అయ్యాం. స్కిట్​లు చేసుకుంటున్నాం.

మీ ముగ్గురిలో ఎవరు టాప్?  స్కిట్ కోసం ఎవరెవరు.. ఏంచేస్తారు?

కచ్చితంగా శీనునే టాప్​. శీను లేకపోతే స్కిట్ లేదు. రాంప్రసాద్ రైటింగ్ స్కిట్​ను పండిస్తుంది. స్కిట్​ల కోసం శీను ఐడియాలు ఇస్తే.. దాన్ని రాం ప్రసాద్ రైటింగ్​లో పెడతాడు. మిగిలింది నేను చూసుకుంటాను. ‘ఇలా చేద్దాం..అలా చేద్దాం’ అని ముగ్గురం అనుకుని.. ఎవరి రోల్ వాళ్లు హైలైట్ చేసుకుంటాం.

రష్మితో లవ్ట్రాక్ ఎంతవరకు నిజం?

అది కూడా ఎంటర్‌‌టైన్​మెంట్ కోసమే. ఎప్పుడో ఒక స్కిట్​లో అలాంటి  కాన్సెప్ట్ చేస్తే బాగా హిట్టయ్యింది. అప్పటి నుంచి అదే అందరూ ఫాలో అవుతున్నారు. రష్మితో ప్రేమ, పెళ్లి వంటి విషయాలన్నీ షోస్ కోసమే. కానీ ఇద్దరి మధ్య ఏమీ లేదు.  తను నాకు మంచి ఫ్రెండ్. ఆ ఫ్రెండ్​షిప్​ కూడా షూటింగ్స్ వరకే. ఆ తరువాత మేం ఎక్కువగా మాట్లాడుకోం. నిజంగా నా సక్సెస్​లో ఆమె ఒక భాగమనే చెప్పొచ్చు. ఆమెతో కలిసి నటించడం హ్యాపీ. నా స్కిట్‌లకు ఎంత పేరుందో ‘సుధీర్– రష్మి’లకి కూడా అంతే పేరుంది. ఒక్కమాటలో చెప్పాలంటే రష్మి  నా కెరీర్​లోకి రావడం వల్లే నాకు ఇంత పేరు వచ్చిందని చెప్పొచ్చు.

నాకయితే పెళ్లి చేసుకోవాలని లేదు.  లైఫ్​లో సింగిల్​గా ఉండాలని ఉంది.కానీ పేరెంట్స్ గొడవ చేస్తున్నారు. టైం దొరికినప్పుడల్లా ‘పెళ్లి చేసుకో..’ అని అడుగుతుంటారు.పెళ్లి చేసుకుంటే మాత్రం అరేంజ్డ్​ మ్యారేజ్​ చేసుకుంటాను. వచ్చే అమ్మాయి మోరల్ సపోర్టు ఇవ్వాలి. పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నేను కూడా తనతో అలానే ఉంటాను.

మీ ఫ్యామిలీ గురించి..?

అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క. మాది విజయవాడ. అక్కకు పెళ్లైంది. కెనడాలో ఉంటుంది. తమ్ముడికి కూడా పెళ్లయింది. అందరం కలిసి ఒక దగ్గరే ఉంటాం.

 

– ఇందిరా రామ్​,     గోపీ కృష్ణ

Latest Updates