సుదిర్మన్‌‌ కప్‌‌ : ఇండియా పరాజయం

sudirman-cup-indias-defeat

సుదిర్మన్‌‌ కప్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ను ఇండియా ఓటమితో ఆరంభించింది. గ్రూప్‌‌–1డిలో భాగంగా మంగళవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌‌లో ఇండియా 2–3తో మలేసియా చేతిలో ఓడి నాకౌట్‌‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.70 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌ పోరులో సాత్విక్‌‌-అశ్విని జంట 16–21, 21–17, 24–22తో మలేసియా జోడీ గో సూన్‌‌ హువట్‌‌–-లై షెవన్‌‌ జెమీపై ఉత్కంఠ విజయం సాధించి టీమ్‌‌కు 1–0 ఆధిక్యం అందించింది. కానీ, పురుషుల సింగిల్స్‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌ను కాదని 13వ ర్యాంకర్‌‌ సమీర్‌‌ వర్మను బరిలోకి దింపడం బెడిసికొట్టింది. చెత్తగా ఆడిన సమీర్‌‌ 13–21, 15–21తో వరుస గేమ్‌‌ల్లో లీ జి జియ చేతిలో ఓడిపోయాడు. కీలకమైన మహిళల సింగిల్స్‌‌లో స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు 21–12, 12–8తొ గొ జిన్‌‌ వెయ్‌‌ను చిత్తుగా ఓడించి ఆశలు సజీవంగా నిలిపింది. కానీ, పురుషుల డబుల్స్‌‌లో సుమీత్‌‌ రెడ్డి-– మను అత్రి జోడీ 20–22, 19–21తో ఆరోన్‌‌ చియా–-టెవొ యె యి జంట చేతిలో పరాజయం పాలవడంతో 2–2తో స్కోరు సమమైంది. నిర్ణాయక మహిళల డబుల్స్‌‌లో సిక్కిరెడ్డితో కలిసి అశ్విని మళ్లీ కోర్టులోకి వచ్చింది. కానీ, 13వ ర్యాంకర్‌‌ చౌ మెయ్‌‌ కువన్‌‌–-లీ మెంగ్‌‌ యెయన్‌‌ జోడీ 21–11, 21–19తో వరుస గేమ్‌‌ల్లో సిక్కి–-అశ్విని జంటను ఓడించి మలేసియాకు విజయం అందించింది. బుధవారం జరిగే తర్వాతి మ్యాచ్‌‌లో ప్రమాదకర చైనాతో ఇండియా పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌‌లో నెగ్గితేనే జట్టు నాకౌట్‌‌ చేరుకోగలదు.

Latest Updates