సీజన్ దాటినా చేన్లకే పరిమితమైన చెరుకు పంట

చెరుకు రైతుల అరిగోస

కరోనా ఎఫెక్ట్ తో మూతపడిన ఫ్యా క్టరీలు

సీజన్ దాటినా చేన్లకే పరిమితమైన పంట
పెండింగ్ లో ఉన్న రూ.12.69 కోట్ల పాత బకాయిలు
ఫ్యాక్టరీ ఎదుట సంగారెడ్డి రైతుల ఆమరణ దీక్ష

సంగారెడ్డి, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడటంతో చెరుకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. సంగారెడ్డి జిల్లాలోని ట్రైడెంట్, గణపతి షుగర్ ఫ్యాక్టరీలు కరోనా కారణంగా టెంపరరీగా మూతపడటంతో పంట కొనుగోళ్లు నిలిచిపోయాయి. పండించిన పంట ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు పంట తరలించి అమ్ముకునే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు పాత బకాయిలు రాక లేక చెరుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంట తాలూకు బకాయిలు జహీరాబాద్ కొత్తూరు (బి)  ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి రూ.12.69 కోట్లు ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. పైసల కోసం వారం కిందటి నుంచి రైతులు దీక్ష చేస్తున్నా.. బకాయిలపై ఎలాంటి హామీ రాలేదు. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రెండేండ్లుగా బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తుండడంతో రైతులు ధర్నాలు చేస్తే తప్ప డబ్బులు వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. ట్రైడెంట్, గణపతి షుగర్ ఫ్యాక్టరీలు ఇప్పట్లో తెరిచే పరిస్థితులు కనిపిస్త లేవు.

ట్రైడెంట్ తోనే సమస్య

జహీరాబాద్ దగ్గరలోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మేనేజ్​మెంట్ తో ఏ యేటికాయేడు సమస్య పెరుగుతోంఏ తప్ప తీరటం లేదని చెరుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. కిందటేడాది 2019–-20లో క్రషింగ్ ఆలస్యంగా డిసెంబర్ లో ప్రారంభించారు. మొత్తం క్రషింగ్ సీజన్ లో 1.11 లక్షల మెట్రిక్ టన్నుల చేరకును గానుగాడించారు. దాదాపు 8 వేల మంది రైతులు చెరుకును ఫ్యాక్టరీకి తరలించారు. ఇదే సీజన్ కు సంబంధించి ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు 34.31 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. మంత్రి హరీశ్ రావు, స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ ల ఒత్తిడితో ఆ మధ్య రూ. 21.61 కోట్లు మేనేజ్​మెంట్ రైతులకు చెల్లించింది. ఇది జరిగి ఆర్నెళ్లు గడిచినా.. ఇంకా రూ. 12.69 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. బిల్లులు సకాలంలో చేతికి అందకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. బకాయి బిల్లులు చెల్లించాలని ఫ్యాక్టరీ అధికారుల వద్ద మొర పెట్టుకున్నా లాభం లేకపోవడంతో ఈ మధ్యే రైతులు ఫ్యాక్టరీ ఎదుట ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఏమీ లాభం లేకపోయింది. దీంతో వారం కిందట సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కు సమస్యలు చెప్పుకున్నా.. తమకు రావాల్సిన డబ్బులు మాత్రం అందటేదని చెరుకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

32 వేల ఎకరాల్లో చెరుకు

2020-– 21సీజన్ కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా దాదాపు 32 వేల ఎకరాల్లో చెరుకు పంట వేశారు. జహీరాబాద్ దగ్గరలోని ట్రైడెంట్ ఫ్యాక్టరీ జోన్ పరిధిలో 20 వేల ఎకరాలు, సంగారెడ్డి ఫసల్వాడి దగ్గరలోని గణపతి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో దాదాపు 12 వేల ఎకరాలలో చెరుకు పంటను రైతులు పండిస్తున్నారు. ఈసారి వానలు భారీగా పడటంతో పంట దిగుబడి పెరిగే అవకాశం ఉన్నట్టు జిల్లా వ్యవసాయ అధికారులు వెల్లడించారు. దాదాపు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే చాన్స్ ఉన్నప్పటికీ రెండు ఫ్యాక్టరీలు మూతపడి క్రషింగ్ మొదలు కాకపోవడంతో రైతుఈలు ఆందోళన చెందుతున్నారు.

బకాయి ఇంకెప్పుడిస్తరు?
ఏడెకరాల్లో చెరుకు పంట వేశా. దిగుబడి కోసం ఎకరాకు రూ.50 వేలు ఖర్చు పెట్టిన. పోయినేడు పంటను ఫ్యాక్టరీకి తరలిస్తే బిల్లులో  కొంత చేతికొచ్చింది. ఇంకా రూ.2లక్షలు రావాలె. అప్పులకు మిత్తీలు పెరుగుతున్నయ్. పాత బాకీ ఇంకా రాకపాయె.. ఎప్పుడిస్తరో! కొత్త పంట చేతికొచ్చింది.  ఫ్యాక్టరీ మాత్రం ఇంకా తెరుచుకోలే. –అంజయ్య, మొగుడంపల్లి, జహీరాబాద్

For More News..

వచ్చే నెల 30 వరకు ఇంటర్నేషనల్‌‌‌‌ ఫ్లైట్స్‌‌‌‌ బంద్‌‌

లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై, కానిస్టేబుల్

వనభోజనాల్లో విషాదం.. ఈతకు పోయి ఆరుగురు మృతి

 

Latest Updates