అరగంటలో తిరిగొస్తామంటూ వెళ్లి.. మాయమైపోయిన ఇద్దరు ఫ్రెండ్స్

ఇద్దరూ రెండు చెట్లకు చీరతో ఉరేసుకుని మృతి

మేడ్చల్: అరగంటలో తిరిగొస్తామంటూ తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లిపోయిన ఇద్దరు స్నేహితులు కాసేపటికే మాయమైపోయారు. ఒకరు ఇదిగో వచ్చేస్తున్నామని జవాబిచ్చి పత్తాలేకుండా పోతే.. మరొకరి ఫోన్ స్విచాఫ్ వచ్చింది. రాత్రంతా ఇద్దరూ తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి వెతకడం ప్రారంభించగా.. ఊరిబయట నిర్జన ప్రదేశంలో ఇద్దరూ రెండు చెట్లకు చీరతో ఉరేసుకుని మృతి చెందారు. జీడిమెట్ల పరిధి లాల్ సాబ్ గూడ లోని అటవీ ప్రాంతంలో బయటపడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గాజులరామరాం కు చెందిన సాయి కుమార్ (22) ఈనెల 10వ తేదీన డ్యూటీకి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చాడు. కాసేపటి తర్వాత తన స్నేహితుడైన నరేష్ (22) వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన సాయి కుమార్ రాత్రి వరకు ఇంటికి రాలేదు. అతని కోసం ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఇదే సమయంలో నరేష్ ఇంట్లో నుండి అతని కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా అరగంట లో ఇంటికి వస్తున్నానని తెలిపిన నరేష్ ఎంతకూ ఇంటికి రాలేదు. దీంతో 11వ తేదీన సాయి కుమార్ తండ్రి జీడిమెట్ల పోలీసులకు పిర్యాదు చేశారు. ఓ వైపు పోలీసులు.. కుటుంబ సభ్యులు గాలించడం ప్రారంభించారు. మంగళవారం నాడు  లాల్ సాబ్ గూడ లోని అటవీ ప్రాంతంలో రెండు చెట్లకు ఇద్దరు యువకులు ఉరేసుకుని ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి సాయికుమార్, నరేష్ లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరి మృతికి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి..

రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నానంటే..

వైరల్ వీడియో: నన్నే టికెట్ అడుగుతారా..? అంటూ వీరంగం

రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశాక

Latest Updates