సుందర్ పిచాయ్: గూగుల్ సూపర్‌‌ బాస్

      ఆల్ఫాబెట్ బాధ్యతలు కూడా పిచాయ్‌కే

    ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్‌లు రాజీనామా

    బోర్డు డైరెక్టర్లుగా కొనసాగుతాం.. గూగుల్ కో ఫౌండర్స్

గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ కూడా భారతీయుడి చేతిలోకి వచ్చేసింది. గూగుల్ కో–ఫౌండర్స్ ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్‌‌లు ఆల్ఫాబెట్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతల నుంచి తప్పుకుని, ఆల్ఫాబెట్ సీఈఓగా కూడా సుందర్ పిచాయ్‌‌నే నియమించారు. ఇప్పటికే గూగుల్ సీఈఓగా ఉన్న పిచాయ్, కీలక బాధ్యతలతో ఈ ప్రమోషన్ కొట్టేశారు. గూగుల్ కో–ఫౌండర్స్ ఈ నిర్ణయంతో ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌‌‌‌ఫుల్ కార్పొరేట్ లీడర్లలో ఒకరిగా పిచాయ్ అవతరించారు. ఆల్ఫాబెట్ సీఈవోగా ల్యారీ పేజ్, ప్రెసిడెంట్‌‌గా సెర్జీ బ్రిన్‌‌లు రాజీనామా చేసినట్టు మంగళవారం కంపెనీ ప్రకటించింది.  ల్యారీ, సెర్జీలు ఆల్ఫాబెట్‌‌ నుంచి తప్పుకోవడంపై ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశమైంది.

ఇద్దరు సీఈవోలు అవసరం లేదు…

సెర్చింజిన్‌‌ నుంచి అడ్వర్‌‌‌‌టైజింగ్, మ్యాప్స్, స్మార్ట్‌‌ఫోన్ సాఫ్ట్‌‌వేర్, ఆన్‌‌లైన్ వీడియోలు, డ్రోన్ డెలివరీస్ వరకు అన్ని వ్యాపారాలకు సోల్ ఎగ్జిక్యూటివ్ పిచాయ్‌‌నే అని ఆల్ఫాబెట్ ప్రకటించింది. ఇప్పుడు ఆల్ఫాబెట్‌‌ చాలా బాగా స్థిరపడింది. స్వతంత్ర కంపెనీలుగా గూగుల్, ఇతర కంపెనీలు బాగా పనిచేస్తున్నాయి.  తమ మేనేజ్‌‌మెంట్‌‌ స్ట్రక్చర్‌‌‌‌ను సరళతరం చేయడానికి ఇదే సరియైన సమయమని గూగుల్ కో ఫౌండర్స్‌‌ పబ్లిక్‌‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘ఆల్ఫాబెట్, గూగుల్‌‌కు ఇద్దరు సీఈవోలు, ప్రెసిడెంట్‌‌ అవసరం లేదని మేము భావించాం. గూగుల్‌‌కు, ఆల్ఫాబెట్‌‌కు పిచాయ్‌‌నే సీఈవోగా ఉండనున్నారు. గూగుల్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను, మా పోర్ట్‌‌ఫోలియోలో ఉన్న ఆల్ఫాబెట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్లను ఆయనే నిర్వహిస్తారు’ అని ల్యారీ, సెర్జీలు పేర్కొన్నారు. ఆల్ఫాబెట్ కో ఫౌండర్స్‌‌గా, బోర్డు డైరెక్టర్లుగా, షేర్‌‌‌‌హోల్డర్లుగా తాము కొనసాగనున్నామని చెప్పారు. సుందర్‌‌‌‌తో ప్రతి రోజూ మాట్లాడనున్నామని తెలిపారు.  రెండు దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ కంపెనీ గూగుల్‌‌ను స్థాపించిన ల్యారీ, సెర్జీలు 2015 నుంచి రోజూ వారీ ఆపరేషన్స్‌‌ లో  తమ బాధ్యతలను తగ్గించుకున్నారు. ఆ సమయంలోనే గూగుల్‌‌ పేరెంట్‌‌ కంపెనీగా, పబ్లిక్ హోల్డింగ్‌‌ కంపెనీగా ఆల్ఫాబెట్‌‌ను ఏర్పాటు చేశారు. గూగుల్‌‌కు, ఇతర సబ్సిడరీలకు ఇది పేరెంట్ కంపెనీ. రెవెన్యూ పరంగా ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ ఇది.

పిచాయ్‌‌ను మించిన సమర్థులెవరు లేరు…

ఆల్ఫాబెట్‌‌ను ఏర్పాటు చేయడానికి కంపెనీని రీస్ట్రక్చర్‌‌‌‌ చేసినప్పుడు అంటే 2015లో గూగుల్ సీఈవోగా పిచాయ్ నియమితులయ్యారు. అంతకుముందు కంపెనీలో ఆయన చాలా బాధ్యతలను నిర్వర్తించారు. క్రోమ్, గూగుల్ ప్రొడక్ట్ చీఫ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌‌కు హెడ్‌‌గా పనిచేశారు. 15 ఏళ్లుగా పిచాయ్​తో కలిసి పనిచేశామని, ఆల్ఫాబెట్‌‌ను, గూగుల్‌‌ను నడిపించే సామర్థ్యం ఆయనకు మాత్రమే ఉందని భావించామని ల్యారీ, సెర్జీలు పేర్కొన్నారు.  టెక్నాలజీ ద్వారా పెద్ద పెద్ద సవాళ్లను కూడా ఆయన సమర్థవంతంగా ఎదుర్కొంటారని తెలిపారు. భవిష్యత్‌‌లో గూగుల్, ఆల్ఫాబెట్‌‌ను నడిపించడానికి పిచాయ్‌‌ను మించిన సమర్థులెవరూ లేరని చెప్పారు.  గూగుల్ సీఈవోగా పిచాయ్ చాలా ఎర్నింగ్స్ కాల్స్‌‌లో పాల్గొన్నారు. గూగుల్ ఐ/ఓ డెవలపర్‌‌‌‌ కాన్ఫరెన్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌‌ను అటెండ్ చేశారు. పిచాయ్‌‌ గూగుల్‌‌ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వ్యాపారాలు మరింత విస్తరించాయి. పెద్ద మొత్తంలో రెవెన్యూ అడ్వర్‌‌‌‌టైజింగ్ నుంచి వస్తోంది.

మదురైలో పుట్టిన పిచాయ్…

తమిళనాడులోని మదురైలో పుట్టిన పిచాయ్, ఐఐటీ ఖరగ్‌‌పూర్‌‌‌‌లో బీటెక్ చేశారు. స్టాన్‌‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్, వార్టన్ స్కూల్‌‌లో ఎంబీఏ చదివారు. అంజలి పిచాయ్‌‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఫుట్‌‌బాల్, క్రికెట్ అంటే అమితాసక్తి. కెరీర్ ప్రారంభంలో మెకిన్సే అండ్ కంపెనీలో పనిచేశారు.

టెక్నాలజీ ద్వారా వచ్చే పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆల్ఫాబెట్ సిద్ధంగా ఉంది. గూగుల్ మరింత మందికి సాయం చేసేలా రూపొందిస్తు న్నాం. ల్యారీ, సెర్జీలకు కృతజ్ఞతలు. వారితో కలిసి కంటిన్యూగా పని చేయడం చాలా ఆనంద దాయకం. బోర్డు సభ్యులుగా, కోఫౌండర్లుగా వారు కొనసాగుతారు. రోజూ వారీ ఆల్ఫాబెట్‌లో జరుగుతున్న కార్యకలాపాలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదు.

– సుందర్ పిచాయ్,
గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో

Latest Updates