
కరీంనగర్, వెలుగు: తన అనుచరుడిని కరీంనగర్ మేయర్ చేద్దామనుకున్న మంత్రి గంగుల కమలాకర్‌కు చివరి నిమిషంలో చుక్కెదురైంది. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్కుమార్చక్రం తిప్పడంతో యాదగిరి సునీల్‌రావుకు పీఠం దక్కింది. తెర వెనుక పెద్ద కథే నడిచినట్లు తెలుస్తోంది. మరోసారి మేయర్ అవుదామని కలలుగని హైకమాండ్చుట్టూ చక్కర్లు కొట్టిన మాజీ మేయర్రవీందర్సింగ్కూ మొండిచెయ్యే మిగిలింది.
వెలమకే ఇవ్వాలని..
కరీంనగర్ మేయర్ స్థానం ఈ సారి జనరల్అయింది. దీంతో జిల్లాలో బలమైన వెలమ సామాజికవర్గానికే పీఠం దక్కేలా టీఆర్ఎస్ లీడర్లు మొదటి నుంచీ పావులు కదిపారు. సదరు సామాజికవర్గం కోరుకున్నట్లే మంత్రి గంగుల కమలాకర్, తన అనుచరుడు వంగెపల్లి రాజేందర్ రావు పేరును తెరపైకి తెచ్చారు. కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకునే ఆయనను ఒప్పించి, టికెట్ఇప్పించి మరీ గెలిపించుకున్నారు. రాజేందర్రావును మేయర్ అభ్యర్థిగా ప్రకటించకపోయిన్నప్పటికీ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడంతో ఆయనే మేయర్అవుతారని పార్టీ కేడర్ భావించింది. రిజల్ట్స్ వెలువడ్డాక పరిస్థితి మారింది. కరీంనగర్లో కనీసం 40 సీట్లకు పైగా పార్టీ గెలుచుకుంటుందని ఆశించిన హైకమాండ్‌కు చివరకు నిరాశే మిగిలింది. దీనిని గుర్తించిన మంత్రి గంగుల కమలాకర్ ఇండిపెండెంట్లుగా గెలిచిన ఏడుగురిని కూడా కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేర్పించారు. అయినప్పటికీ మేయర్ విషయంలో మంత్రి మాట చెల్లలేదు. ఇటీవల కొత్తపల్లి మున్సిపాలిటీలోనూ సీనియర్ నాయకుడు వాసాల రమేశ్‍ను చైర్మన్ చేయాలని మంత్రి ఆశించినా చివరి నిమిషంలో హైకమాండ్ సూచించిన రుద్రరాజు చైర్మన్ అయ్యారు.
వినోద్ కుమార్ ఎంట్రీతో మారిన సీన్..
రిజల్ట్స్తర్వాత కార్పొరేటర్లంతా క్యాంపుకి వెళ్లారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ మాత్రం హైకమాండ్ ఆశీస్సుల కోసం తిరిగారు. రాజేందర్ రావు మంత్రిని నమ్ముకోగా, సునీల్ రావు ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ , రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌తో టచ్‌లో ఉంటూ వచ్చారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడైన వినోద్ కుమార్ సునీల్ రావుకు మేయర్ పీఠం దక్కేలా తీవ్ర కృషి చేసి, సక్సెస్ అయ్యారు. సునీల్ రావు మేయర్ కావడంతో ఆ పదవిపై ఆశతో పోటీచేసిన రాజేందర్ రావు తీవ్ర నిరాశకు లోనయ్యారు. బుధవారం జరిగిన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనప్పటికీ ఓ మూలన దిగాలుగా కూర్చొని కనిపించారు. మరోవైపు నిన్నటి దాకా మేయర్ సీట్లో కూర్చున్న రవీందర్సింగ్ఇప్పుడు మామూలు కార్పొరేటర్‌గా మిగిలిపోయారు.