
కష్టపడి చదివి పైకొచ్చేవాళ్లు చాలామందే ఉంటారు. వాళ్లలో తమలా కష్టపడి పైకి రావాలనుకునేవాళ్లకు చేయిచ్చి సాయపడేవాళ్లు కొంతమందే ఉంటారు. ఈ కోవకే చెందుతారు బెల్లంపల్లికి చెందిన ఈ నలుగురు ఫ్రెండ్స్. పేద పిల్లల చదువుకు సాయం చేస్తూ..ఆదర్శంగా నిలుస్తున్నారు.
బెల్లంపల్లి, వెలుగు: నాగుల కరుణాకర్, జనగామ అభిలాష్, శ్రీలత.. ముగ్గురూ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి బెల్లంపల్లిలోనే కలిసి చదువుకున్నారు. పేరెంట్స్ మోటివేషన్‌తో బాగా చదువుకొని.. కరుణాకర్, శ్రీలత సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, అభిలాష్ కోచింగ్ సెంటర్లో టీచర్‌గా సెటిల్ అయ్యారు. ఈ ముగ్గురి ఆలోచనా ఒక్కటే. పేద పిల్లల చదువు కోసం ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో 2015లో..‘సుప్రజ’ అనే ఎన్జీవో పెట్టారు. ఈ సంవత్సరం మరో ఫ్రెండ్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ నగేశ్ కూడా తోడయ్యాడు.
చదువుకు అండగా..
పల్లెటూర్లలో చదువుకునే పేద స్టూడెంట్స్ ఎంతగా ఇబ్బంది పడతారో.. చిన్నప్పుడు వీళ్లూ అనుభవించారు. అందుకే, తమలా కష్టపడేవాళ్లకు కొంతలో కొంత సాయం చేయాలనుకున్నారు. ప్రైమరీ స్కూల్ నుంచి మొదలు పెట్టి టెన్త్, ఇంటర్ వరకు చదువుతున్న పేద స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం స్టూడెంట్స్‌కు బోర్డు ఎగ్జామ్స్‌కి ముందు వాళ్లలో భయాన్ని పోగొట్టడానికి.. సైకాలజిస్టులతో మోటివేషన్ క్లాస్‌లు ఇప్పిస్తున్నారు. ప్రతి స్టూడెంట్‌కి స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. దీంతోపాటు వరంగల్‌లో మెంటల్ రిహాబిలిటేషన్ సెంటర్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. బెల్లంపల్లిలో ‘అమ్మ’ అనాథ శరణాలయాంలోని పిల్లలకు సైకిళ్లు ఇచ్చారు. హైదరాబాద్‌లోని అనాథ ఆశ్రమం ‘అమ్మబడి’కి బెడ్స్, మ్యూజికల్ డ్రమ్స్ అందించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లోని గాదె ఇన్నయ్య నడుపుతున్న ‘మా ఇల్లు’ ఆశ్రమానికి కంప్యూటర్ ల్యాబ్, స్వెట్టర్లు, బెంచీలు, కుర్చీలు ఇచ్చారు.