అగ్రి చట్టాలను మీరు నిలిపేస్తరా.. మేం స్టే ఇవ్వాల్నా?

  • కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  •  రైతులతో చర్చల విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి
  •  ఎఫెక్టివ్​గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదని కామెంట్
  • ఇందులో ప్రెస్టేజ్ ఇష్యూ ఏముందని ప్రశ్న
  •  సహనం గురించి తమకు లెక్చర్లు ఇవ్వొద్దంటూ సీరియస్

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులతో చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఎఫెక్టివ్​గా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదని కామెంట్ చేసింది. ‘‘అసలు ఏం జరుగుతోంది. మీ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు తిరుగుబాటు చేస్తున్నాయి. రైతులతో చర్చల విషయంలో కేంద్రం తీరుపై చాలా అసంతృప్తితో ఉన్నాం’’ అని చెప్పింది. ‘‘వ్యవసాయం, ఎకనామిక్స్​లో మేం ఎక్స్​పర్టులం కాదు. అగ్రి చట్టాలను మీరు తాత్కాలికంగా నిలిపేస్తారా? లేక మమ్మల్ని నిలిపేయమంటారా? చెప్పండి. ఇందులో ప్రెస్టేజ్ ఇష్యూ ఏముంది?” అని ఘాటుగా ప్రశ్నించింది. సహనం విషయంలో తమకు లెక్చర్లు ఇవ్వొద్దంటూ సీరియస్ అయింది. వ్యవసాయ చట్టాలు, ఢిల్లీ బార్డర్లలో రైతులు చేస్తున్న ఆందోళనలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ల బెంచ్ సోమవారం విచారించింది.

రక్తపాతం జరిగితే ఎవరిది బాధ్యత?

40 రోజులకు పైగా ఢిల్లీ బార్డర్లలో రైతులు ఆందోళనలు చేయడాన్ని సుప్రీం ప్రస్తావిస్తూ.. ‘‘ఏదో ఒక రోజు శాంతికి భంగం కలుగుతుందనే  భయం మాకు ఉంది. ఏదైనా తప్పు జరిగితే మనలో ప్రతి ఒక్కరం బాధ్యులం అవుతాం. మా చేతులకు ఎలాంటి గాయా లు లేదా రక్తం అంటొద్దు” అని చెప్పింది. మరింత టైం కావాలని కేంద్రం కోరడంతో సీరియస్ అయిన బెంచ్.. ‘‘మీరు ఈ విషయంలో ఎఫెక్టివ్​గా పనిచేస్తున్నారని అనిపించడంలేదు. మేం ఈ రోజు నిర్ణయం తీసుకుంటున్నాం. రక్తపాతం జరిగితే ఎవరిది బాధ్య త?” అని నిలదీసింది. ఉత్తర్వులు జారీ చేయటానికి అంత తొందర ఎందుకని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రశ్నించగా.. జస్టిస్ బోబ్డే సీరియస్ అయ్యారు. ‘‘సహనం గురించి మాకు లెక్చర్ ఇవ్వొద్దు. మేం ఇప్పటికే చాలా టైం ఇచ్చాం’’ అని చెప్పారు.

కమిటీని ఏర్పాటు చేయండి

రైతులతో చర్చల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీం సూచించింది. చట్టాల అమలును తాత్కాలికంగా ఆపేయాలని చెప్పింది. స్పందించిన వేణుగోపాల్.. ‘‘కమిటీ ఏర్పాటు చేయండి. కానీ చట్టాల అమలుపై స్టే విధించొద్దు” అని కోరారు. ఏవైనా చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే తప్ప వాటి అమలును నిలిపేసే హక్కు కోర్టులకు లేవంటూ గతంలో ఇచ్చిన జడ్జిమెంట్​లను ఆయన ప్రస్తావించారు. కేవలం రెండు, మూడు రాష్ట్రాలకు చెందిన రైతులు మాత్రమే ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. సౌత్, వెస్టర్న్ ఇండియాకు చెందిన వాళ్లు ఇందులో పాల్గొనడం లేదని చెప్పారు.

చట్టాలు మంచివని కమిటీకి చెప్పనివ్వండి

‘‘మీరు (కేంద్రం) సమస్య పరిష్కారంలో భాగమా లేక సమస్యలో భాగమా అనేది మాకు తెలియదు” అని సుప్రీం కామెంట్ చేసింది. ‘‘ఇది చాలా సున్నితమైన పరిస్థితి. ఈ వ్యవసాయ చట్టాలు ప్రయోజనకరంగా ఉన్నాయని చెప్పే ఒక పిటిషన్ కూడా మా ముందు లేదు’’ అని పేర్కొంది. ‘‘అగ్రి చట్టాలపై చాలా రాష్ట్రాలు తిరుగుబాటులో ఉన్నాయి. అవి మంచివని చాలా మంది మీకు చెప్పారు కదా! అయితే వారు అదే విషయాన్ని కమిటీకి చెప్పనివ్వండి” అని కోర్టు చెప్పింది. స్నేహపూర్వక పరిష్కారం తీసుకురావడమే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టు చెప్పింది.

మహిళలు, పిల్లలను ఇండ్లకు పంపండి

చర్చల విషయంలో ఎలాంటి ముందడుగు కనిపించడం లేదని గత విచారణ సందర్భంగా సుప్రీం కామెంట్ చేసింది. తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘గత విచారణ సమయంలోనే మేం అడిగాం.. కానీ జవాబు రాలేదు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో ముసలివాళ్లు, ఆడవాళ్లు ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు?” అని కేంద్రాన్ని ప్రశ్నించింది. సీనియర్ సిటిజన్లు, మహిళలు, పిల్లలను వెనక్కి పంపాలని ఆదేశించింది.

‘స్టే’ పరిష్కారం కాదు: రైతులు

కొత్త అగ్రి చట్టాల అమలును సుప్రీంకోర్టు లేదా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసినా తాము తమ నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. చట్టాల అమలుపై స్టే విధించడం.. సమస్యకు పరిష్కారం కాదన్నారు. చట్టాల రద్దును తప్ప దేన్నీ తాము అంగీకరించబోమని రైతులు తేల్చిచెప్పారు. సుప్రీం కామెంట్లను స్వాగతించారు. అయితే ప్రొటెస్టులు మాత్రం కొనసాగుతాయని రైతులు స్పష్టం చేశారు.

Latest Updates