స్పీకర్ ను కలవండి.. కన్నడ MLAలకు సుప్రీం ఆదేశం

ఢిల్లీ : కర్ణాటక రాజకీయం ఈ ఉదయం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. రాజీనామా చేసిన కాంగ్రెస్ – JDS ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ సాయంత్రం లోపు వెళ్లి కర్ణాటకలో స్పీకర్ ను కలవాలని సుప్రీంకోర్టు .. ఎమ్మెల్యేలకు సూచించింది. ఇవాళే స్పీకర్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించాలని సుప్రీంకోర్టు సూచించింది. రెబల్ ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరిలో సుప్రీం తలుపు తట్టిన 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం కర్ణాటక స్పీకర్ ను కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు పరిణామాలు ఎలా ఉన్నా… సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఆలస్యం జరిగే అవకాశం లేదు. ఈ సాయంత్రం రాజీనామాల వ్యవహారం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

రాజీనామా చేసిన కాంగ్రెస్-JDS ఎమ్మెల్యేలు వేసిన అత్యవసర పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రెబెల్ ఎమ్మెల్యేల తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. కాంగ్రెస్ తరపున ఆపార్టీ సీనియర్ నేత, సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

Latest Updates