అయోధ్య తీర్పుపై 18 రివ్యూ పిటిషన్లు.. అన్నీ కొట్టేసిన సుప్రీం కోర్టు

అయోధ్య రామ జన్మభూమి – బాబ్రీ మసీదు వివాదంపై నవంబరు 9న ఇచ్చిన తీర్పుపై సమీక్ష చేపట్టేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని నాడు ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయంటూ 18 రివ్యూ పిటిషన్లు ఫైల్ అయ్యాయి. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అర్వింద్ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం గురువారం వాటిని విచారించేందుకు నిరాకరించింది.

నాటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం నవంబరు 9న ఏకగ్రీవంగా అయోధ్య వివాదంపై రామ్ లల్లాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం ట్రస్టు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట వ్యతిరేకమని, మసీదు నిర్మాణం కోసం వక్ఫ్ బోర్డుకు ఐదు ఎకరాల భూమిని అయోధ్య పరిధిలో కేటాయించాలని తీర్పులో పేర్కొంది సుప్రీం.

హిందూ సంస్థలూ రివ్యూలు.. ఏవీ తీసుకోబోమన్న సుప్రీం

ఈ తీర్పులో లోపాలు ఉన్నాయంటూ జమైతే ఉలేమా ఎ హింద్, ఆలిండియా ముస్లిం లా పర్సనల్ బోర్డు సహా మరికొన్ని సంస్థలు, వ్యక్తులు కలిసి 18 పిటిషన్లను సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. పలు ముస్లిం సంస్థలు తిరిగి అక్కడ బాబ్రీ మసీదు నిర్మాణం చేపట్టాలని రివ్యూలో కోరాయి. మరోవైపు అఖిల భారత హిందూ మహాసభ, నిరోమా అఖాడా వంటి హిందూ సంస్థలు కూడా వేసిన పిటిషన్లు కూడా ఉన్నాయి. ఈ సంస్థ మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల భూమిని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రివ్యూలు కోరాయి. అయితే ఏ పిటిషన్‌నూ రివ్యూకు తీసుకోబోమని సుప్రీం ధర్మాసనం చెప్పింది.

Latest Updates