ఆధార్ ‘ఆకలి చావుల’పై రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

ప్రజలు ఆకలితో చనిపోయే స్థితిలోకి ప్రభుత్వాలు నెట్టడం సరైనది కాదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అర్వింద్ బోబ్డే అన్నారు. కారణం ఏదైనా సరే రేషన్ నిలిపేయడంతో.. ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితికి రావడం దారుణమన్నారు. త్రిపురలోని ఏడు శరణార్థి క్యాంపులకు రేషన్ నిలిపేయడంపై విచారిస్తూ సోమవారం సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ క్యాంపులకు రేషన్ సరఫరా చేయకపోవడంపై 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని ఆదేశించారు.

‘ఆధార్ కార్డు లేని నిరుపేదలకు ప్రభుత్వాలు రేషన్ బియ్యం ఇవ్వడం ఆపేశాయి. దీని వల్ల తిండి లేక ఆకలితో అలమటించి.. బడుగు జీవులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఈ ఘటనలపై చర్యలు తీసుకోవాలి’ అంటూ దాఖలైన మరో పిటిషన్‌పైనా సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. ఆధార్ లేదని రేషన్ నిలిపేయడంతో నిరుపేదలు ఆకలితో మరణించినట్లు వస్తున్న ఆరోపణలపై అఫిడవిట్ ఫైల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Latest Updates