రామ జన్మభూమే… సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు..

మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలం

శతాబ్దానికి పైగా నలుగుతున్న కేసుకు పరిష్కారం

స్వాగతించిన ప్రధాని మోడీ, హిందూ, ముస్లిం సంఘాలు

తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్

మందిరం నిర్మాణానికి 3నెలల్లో ట్రస్ట్​ ఏర్పాటుకు ఆదేశం

 

అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. సుమారు 134 ఏండ్ల నుంచి సాగుతున్న ఈ వివాదానికి చీఫ్​ జస్టిస్​ రంజన్​ గొగోయ్​ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం శనివారం తెరదించింది.  2.77 ఎకరాల భూమి రామ్​లల్లా (రాముడి)కే చెందుతుందని తీర్పు చెప్పింది. మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్​ బోర్డుకు కేటాయించాలని  ఆర్డర్​ ఇచ్చింది. అయోధ్యలోనే కేంద్రం సేకరించిన స్థలంలో గానీ, ఇంకెక్కడైనా కానీ సున్నీ వక్ఫ్​ బోర్డుకు ఇవ్వాలని సూచించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్​ ప్రకటించారు. సోషల్ మీడియాలో పోస్టింగ్​లపై కఠిన నిబంధనలు విధించారు. ఉదయం 10.30 గంటలకు జస్టిస్​ గొగోయ్​ తీర్పును చదవడం ప్రారంభించి 11 గంటలకు ముగించారు. దశాబ్దాలుగా దేశరాజకీయాలను కుదిపేస్తున్నఈ భూవివాదానికి సుప్రీం పరిష్కారం చూపడంతో అన్నివర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్​ మాజీ చీఫ్​ రాహుల్​గాంధీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు స్వాగతించారు. ముస్లిం పర్సనల్​ లా బోర్డు లాంటి కొన్ని సంస్థలు మాత్రం తీర్పును గౌరవిస్తామని, అయితే తాము ఆశించినట్లుగా అది లేదని తెలిపాయి. రివ్యూ పిటిషన్​ వేయాలో వద్దో ఆలోచించి నిర్ణయిస్తామని ప్రకటించాయి.

1885లో మొదలై..

రామ జన్మస్థలానికి తానే మహంత్‌‌నని చెబుతూ మసీదు ఆవరణలోని- రామ్‌‌ చబుత్రా వద్ద రామాలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ రఘువర్‌‌ దాస్‌‌ అనే వ్యక్తి 1885లో ఫైజాబాద్​ కోర్టును ఆశ్రయించడంతో కేసు  తెరమీదికి వచ్చింది. అంతకు ముందు కూడా కొన్ని కేసులు ఉన్నప్పటికీ ఇదే కీలక కేసుగా పరిగణనలోకి వచ్చింది. కొన్నాళ్లకే రఘువర్​దాస్​ కేసును కోర్టు కొట్టివేసినప్పటికీ.. ముస్లిం సంఘాలు, హిందూ సంఘాలు కేసులు వేయడం, రాజకీయాలు రంగప్రవేశం చేయడం వంటి పరిణామాలతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2010లో అలహాబాద్​ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ పిటిషన్లు దాఖలు కావడంతో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో విచారణ కోసం చీఫ్​ జస్టిస్​ రంజన్​ గొగోయ్​, జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే, జస్టిస్​ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్​తో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి రోజువారీగా 40 రోజుల పాటు విచారించిన బెంచ్​.. గత నెల 16న తీర్పును రిజర్వ్​ చేసింది. ఎప్పుడైనా తీర్పు వచ్చే అవకాశం ఉండటంతో ఉత్తరప్రదేశ్​లోని అయోధ్యతోపాటు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఏకగీవ్ర తీర్పు

సెలవు దినమైనప్పటికీ శనివారమే తీర్పును వెలువరిస్తామని చీఫ్​ జస్టిస్​ రంజన్​ గొగోయ్​ శుక్రవారం పొద్దుపోయాక ప్రకటించారు. ఈ నెల 17న  జస్టిస్​ గొగోయ్​ రిటైర్డ్​ కానున్నారు. ఈలోగానే తీర్పు చెప్పాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధర్మాసనంలోని ఐదుగురు జడ్జిలు జడ్జిమెంట్​ను ఏకగీవ్రంగా ఆమోదించారు. మొత్తం 1,045 పేజీల జడ్జిమెంట్​ కాపీలో 929 పేజీల్లో తీర్పు ఉండగా.. వివాదాస్పద స్థలం రామజన్మభూమేనన్న హిందువుల విశ్వాసానికి కారణాలను ‘యాడెండా’ పేరుతో మరో116 పేజీల్లో వివరించారు. వివాదాస్పద భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ షియా వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా వేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. ఈ భూమిని 2010లో అలహాబాద్ హైకోర్టు మూడుగా విభజించి రామ్‌‌లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డుకు పంచడాన్ని సుప్రీం తప్పుబట్టింది. అలా విభజించడం ఆమోదయోగ్యం కాదని, అది రామ్​లల్లా (రాముడి)కే చెందుతుందని స్పష్టం చేసింది. ఆర్కియలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (ఏఎస్​ఐ) రిపోర్టులను పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తున్నామని పేర్కొంది. రెండు మతాల విశ్వాసాలను, ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తున్నామని తెలిపింది. వివాదాస్పద స్థలం రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వానికి చెందినట్లే ఉందని గుర్తుచేసింది.

రామ మందిరం కోసం ట్రస్ట్​

వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమి రామ్​లల్లా (రాముడి)దేనని సుప్రీం తీర్పుచెప్పింది. రాముడి తరఫున కేసును ‘రామజన్మభూమి న్యాస్’ సంస్థ వాదిస్తోంది. భూ నిర్వహణ బాధ్యతల కోసం, అక్కడ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రస్టు ఏర్పడే వరకు భూ నిర్వహణ బాధ్యతలు కేంద్రం ఆధీనంలో ఉంటాయని తెలిపింది. అయోధ్య యాక్ట్ –1993లోని సెక్షన్​ 6 ప్రకారం  ట్రస్ట్​ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ ట్రస్ట్​లో నిర్మోహి అఖాడా సంస్థకు కూడాకేంద్రం తగిన ప్రాతినిధ్యం కల్పించవచ్చని కోర్టు సూచించింది.

మసీదు కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు

మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని, దీన్ని సున్నీ వక్ఫ్​ బోర్డుకు అప్పగించాలని సుప్రీం తేల్చిచెప్పింది.  భూమి ఇచ్చే విషయమై రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది.  ‘‘1993 అయోధ్య చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం సేకరించిన భూమిలోంచి ఇవ్వొచ్చు.. లేదా ఉత్తరప్రదేశ్​ రాష్ట్ర ప్రభుత్వం తగిన, ప్రముఖ ప్రదేశంలో భూమిని ఇవ్వొచ్చు.. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకోవాలి’’ అని స్పష్టం చేసింది.

మసీదు కింద కట్టడాల ఆనవాళ్లు

వివాదాస్పద స్థలం అంతర్భాగం ఇస్లామిక్ శైలిలో లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే.. అక్కడి బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించింది కాదని పేర్కొంది. మసీదు కింద 12వ శతాబ్దం నాటి పురాతన కట్టడాల ఆనవాళ్లు ఉన్నట్లు తాము విశ్వసిస్తున్నామని తెలిపింది. దీనిపై ఆర్కియలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా (ఏఎస్ఐ) రిపోర్టును తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. అయితే అది రామాలయమా అనడానికి ఏఎస్ఐ స్పష్టత ఇవ్వలేదని తెలిపింది. మసీదు నిర్మాణం కంటే ముందు అక్కడున్న నిర్మాణాలను కూల్చారా? లేదా అన్నదానిపై కూడా ఏఎస్ఐ వద్ద స్పష్టమైన సమాచారం లేదని సుప్రీం పేర్కొంది. ఈ స్థలంలో 1528 నుంచి 1856 మధ్య ముస్లింల ప్రార్థనలు జరిగినట్లు కూడా ఆధారాలు లేవని తెలిపింది. వివాదాస్పద స్థలంపై మొఘుల్​ కాలం నుంచే హక్కు ఉన్నట్టు వక్ఫ్‌‌ బోర్డు నిరూపించలేకపోయిందని, అది మాట మారుస్తూ వచ్చిందని సుప్రీం ఆక్షేపించింది. ఆ స్థలం బయట హిందువులు, లోపల ముస్లింలు ప్రార్థనలు జరిపేవారని పేర్కొంది.

Latest Updates