బాల్కనీల్లో పక్షులకు గింజలు వేయొద్దు

అపార్టుమెంట్లలో ఉంటున్నవారికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఫ్లాట్లలోని బాల్కనీల్లో పక్షులకు ఆహారం పెట్టి, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని సూచించింది.  పక్షుల రెట్టల కారణంగా మిగిలిన వారికి సమస్యలు కలుగుతున్నందున ఇలాంటి పనులకు దూరంగా ఉండాలని సూచించింది. అపార్టుమెంట్లలో ఉంటున్నప్పుడు అక్కడి నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించాలని జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ విషయంపై బాంబే సిటీ సివిల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.

వర్లిలోని ఓ 20 అంతస్తుల అపార్టుమెంటులోని 14వ అంతస్తులో జిగీషా ఠాకోర్‌, 10వ అంతస్తులో దిలీప్‌ సుమన్‌లాల్‌ షా, మీనా షా ఉంటున్నారు. తన ఫ్లాటులోని బాల్కనీలో పక్షులకు గింజలు వేసి, నీరు పెట్టడం జిగీషాకు అలవాటుగా మారింది. ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం వరకు ఇలా చేస్తున్నందువల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని చుట్టుపక్కల వారు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి సేవ చేయాలని, ఎవరు కూడా బాల్కనీల్లో పక్షులకు ఆహారం పెట్టకూడదంటూ అపార్టుమెంట్‌ సంఘం తీర్మానించింది. దీన్ని వారు పాటించకపోవడంతో 2011లో సుమన్‌లాల్‌, మీనాలు కోర్టును ఆశ్రయించారు. బాల్కనీల్లో గింజలు వేయకూడదంటూ ముంబాయిలోని సిటీ సివిల్‌ కోర్టు 2013లో తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తొలుత హైకోర్టులో సవాలు చేయగా అక్కడ తిరస్కరణకు గురయింది. సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు ఆదేశాలనే బలపరుస్తూ త్వరగా తీర్పు ఇవ్వాలని సూచించింది.

Latest Updates