ఎన్‌కౌంటర్‌పై జుడిషియల్ ఎంక్వైరీకి సుప్రీం ఆదేశం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పులు జరిపారా? లేక కావాలని బూటకపు ఎన్‌కౌంటర్ చేశారా? అన్నది తెలియాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అర్వింద్ బోబ్డే అన్నారు. ఇందుకోసం జ్యుడిషియల్ ఎంక్వైరీకి కమిషన్ నియమిస్తూ ఆదేశాలిచ్చారాయన. ఈ కమిషన్‌కు సుప్రీం మాజీ న్యాయమూర్తి సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తారని చెప్పారు.

దిశ నిందితులను కావాలనే పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని ఇద్దరు లాయర్లు వేసిన పిటిషన్‌పై రెండో రోజు వరుసగా విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు వాళ్లు తప్పించుకునేందుకు పోలీసులపై దాడి చేశారని చెప్పారాయన. రాళ్లు, కర్రలతో కొట్టి పోలీసుల దగ్గర తుపాకీలు లాక్కెళ్లారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

నిజానిజాలు తేలాలి

ఎన్‌కౌంటర్ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా విచారణ చేస్తోందని, ప్రత్యేకంగా మళ్లీ వేరే ఎంక్వైరీ అవసరం లేదని రోహత్గీ వాదన వినిపించారు. అయితే దీనిపై సుప్రీం కోర్టు స్పందిస్తూ వారిపై క్రిమినల్ కోర్టులో ప్రొసీడింగ్స్ మొదలుపెట్టి ఉంటే తాము దీనిపై ఎటువంటి ఎంక్వైరీలకు ఆదేశించాల్సిన అవసరం లేదని తెలిపింది. పోలీసులు తప్పు చేశారని తాము నిందించడం లేదని, అయితే అక్కడ ఏం జరిగిందన్నదానిపై నిజానిజాలు నిష్పాక్షికంగా విచారణ అవసరం అని అన్నారు సీజేఐ.

ఆరు నెలల్లో నివేదిక

ఎన్‌కౌంటర్ ఘటనపై ముగ్గురు సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు ఆదేశించారు సీజేఐ జస్టిస్ బోబ్డే. ఈ కమిషన్‌లో సుప్రీం మాజీ న్యాయమూర్తి వీఎస్ సిర్పూర్కర్, బాంబే హైకోర్టు మాజీ జడ్డి రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ నియమిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు.  ఆరు నెలల లోపు ఎంక్వైరీకి పూర్తి చేయాలని సూచించారు. వారికి సీఆర్పీఎఫ్ జవాన్లతో రక్షణ ఇవ్వాలని చెప్పారు.

Latest Updates