ఎన్‌కౌంటర్‌పై డౌట్స్ ఉన్నయ్!: సుప్రీం

  • సుప్రీం కోర్టు మాజీ జడ్జితో ఎంక్వైరీకి ప్రతిపాదన
  • విచారణ రేపటికి వాయిదా వేసిన న్యాయస్థానం

దిశ రేప్, మర్డర్ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటనపై అనుమానాలు ఉన్నాయని, ఎదురుకాల్పులా లేక బూటకపు ఎన్‌కౌంటరా అన్నది తేలాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. రిటైర్డ్ సుప్రీం న్యాయమూర్తితో ఎంక్వైరీకి ప్రతిపాదించింది న్యాయస్థానం.

రెండు నిమిషాల్లోనే వాయిదా

డిసెంబరు 6న దిశ నిందితులపై జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అంటూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారించింది సుప్రీం కోర్టు. కేవలం రెండు మూడు నిమిషాల్లోనే వాదనలను నిలిపేసి.. విచారణను రేపటికి వాయిదా వేశారు సీజేఐ జస్టిస్ అర్వింద్ బోబ్డే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. తెలంగా ప్రభుత్వ వాదనలను పూర్తి స్థాయిలో విన్నాకే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ!

ఇప్పటికే ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తమకు తెలుసని జస్టిస్ బోబ్డే అన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఉన్న నేపథ్యంలో దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాల్సి ఉందని, ఇందుకు రిటైర్డ్ న్యాయమూర్తితో ఎంక్వైరీకి కమిటీ నియమిస్తామని ప్రతిపాదించారాయన. ఆ జడ్జి ఢిల్లీలో ఉండి విచారణ చేస్తారని చెప్పారు. ఇప్పటికే రిటైర్డ్ జస్టిస్ పీవీ రెడ్డిని ఈ కేసు ఎంక్వైరీ చేయాలని కోరగా, ఆయన నిరాకరించారని అన్నారు. అయితే  ఎవరైనా మాజీ న్యాయమూర్తుల పేర్లను తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్లు ప్రతిపాదించొచ్చని  సూచిస్తూ.. విచారణను రేపటికి వాయిదా వేశారు. అయితే తొలి రోజు విచారణ సందర్భంగా పిటిషన్ వేసిన ఇద్దరు లాయర్లకు వాదనలు వినిపించే అవకాశం కూడా రాలేదు.

ఇవాళ వాదనల సందర్భంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఎన్‌కౌంటర్‌పై నివేదిక ఇచ్చారు. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు అక్కడ వాళ్లు తిరగబడి పోలీసులపై దాడి చేసి, పారిపోయే ప్రయత్నం చేశారని తెలిపారు. పోలీసుల దగ్గర తుపాకీలను లాక్కుని కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు.

ఇదిలా ఉండగా, ఇప్పటికే ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ, రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులే దీనిపై దర్యాప్తు చేస్తే నిష్పాక్షికంగా ఉండే అవకాశం లేదని, జుడిషియల్ ఎంక్వైరీ జరగాలని సుప్రీం కోర్టు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Latest Updates