అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదైతే వెంటనే అరెస్టు

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ  యాక్ట్ కింద కేసు నమోదు కాగానే  నిందితులను అరెస్టు చేయొచ్చని సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా అరెస్టు చేయొద్దని 2018 మార్చిలో ఇచ్చిన తీర్పును మంగళవారం వెనక్కి తీసుకుంది. సమానత్వం కోసం ఎస్సీ, ఎస్టీల పోరాటం ఇప్పటికీ ముగియలేదని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీఆర్ గవాయ్ లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.ఆర్టికల్ 15 కింద ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం రక్షణ కల్పించినా ఇప్పటికీ వివక్షకు గురవుతున్నారని అభిప్రాయపడింది. తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తున్నారన్న  అంశంపై స్పందించిన సుప్రీంకోర్టు, దీనికి మానవ తప్పిదాలే కారణమని తెలిపింది. 2018 మార్చి 20న ఇద్దరు  జడ్జిల బెంచ్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పింది. మాన్యువల్ స్కావెంజరింగ్  లో పని చేసే ఎస్సీ, ఎస్టీలు చనిపోతున్నారన్న అంశాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ప్రపంచంలో ఎక్కడా ప్రజలు చనిపోవాలని గ్యాస్ ఛాంబర్ కు పంపరని ఘాటు కామెంట్స్ చేసింది. చట్టం దుర్వినియోగం అవుతుందని రాజ్యాంగ విరుద్ధంగా తీర్పు చెప్పడం సరికాదని, కులం ఆధారంగా ఎవర్నైనా అనుమానిస్తారా అని ప్రశ్నించింది. జనరల్ కేటగిరీ వ్యక్తి కూడా తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అంటరానితనం, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీలను కాపాడేందుకు ప్రభుత్వానికి సాధ్యం కావట్లేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు బెంచ్ తెలిపింది.

ఇంతకు ముందు తీర్పు ఏం చెప్పిందంటే..

ఎస్సీ, ఎస్టీ యాక్ట్ దుర్వినియోగం అవుతోందని, అధికారి లేదా వ్యక్తిని వెంటనే అరెస్టు చేయరాదని, డీఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ తో విచారణ తర్వాతే ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది మార్చి 20న ఇద్దరు జడ్జిల బెంచ్ ఆదేశించింది. దీనిపై దేశవ్యాప్తంగా దళితులు ఆందోళనలు చేశారు. ఈ తీర్పును రివ్యూ చేయాలని కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. 2018 తీర్పు రాజ్యాంగానికి అనుగుణంగా లేదని అటార్నీ జనరల్ వేణుగోపాల్ సుప్రీం బెంచ్‌కు తెలిపారు. గత నెల 13న ఈ రివ్యూ పిటిషన్‌ను సుప్రీం ముగ్గురు జడ్జిల బెంచ్ కు బదిలీ చేసింది.

 

Latest Updates