CAAపై స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (CAA) పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు… నాలుగు వారాల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది, ఈ ధర్మాసనంలో సభ్యులుగా జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలు కూడా ఉన్నారు. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి నాలుగువారాల గడువు ఇచ్చింది. అంతవరకు విచారణను వాయిదా వేసింది. దీని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసింది.

ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సుప్రీం కోర్టు మొత్తం 140 పిటిషన్లను ఒకేసారి విచారణ చేసింది. పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌లతో పాటు మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ఉన్నారు. ఇక జనవరి 10 నుంచి పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంపైన కూడా స్టే కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే దీనిపై స్టే ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది.

Latest Updates