ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాల్సిందే: సుప్రీంకోర్టు

దేశంలో ఫైనల్ ఇయర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పరీక్షలు నిర్వహించాలన్న యూజీసీ నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది. యూజీసీ నిర్ణయం ప్రకారం.. సెప్టెంబర్ 30లోపు పరీక్షలు నిర్వహించాలని సుప్రీం సూచించింది. కరోనావైరస్ కారణంగా సెప్టెంబర్ 30లోపు పరీక్షలు నిర్వహించడం వీలుకాకపోతే.. గడువున పొడిగించాలని రాష్ట్రాలు యూజీసీని కోరాలని సుప్రీం తెలిపింది. అయితే రాష్ట్రాలు ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయడాన్ని సుప్రీం ప్రోత్సహించదని న్యాయస్థానం తెలిపింది. విద్యార్థులందరూ ఫైనల్ పరీక్షలు రాయాలని సుప్రీం కోరింది. రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేయగలవు కానీ, రద్దు చేయలేవని కోర్టు తెలిపింది.

కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేయాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వైరస్ సంక్షోభం కారణంగా విద్యాసంస్థలు మూసివేయడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. విద్యార్థు‌లు ఇప్పటికే అయిదు సెమిస్ట‌ర్ల‌ను పూర్తి చేశారు కాబట్టి ఫైనల్ సెమిస్టర్ ఫలితాలను క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావ‌రేజ్‌(సీజీపీఏ) ప్ర‌కారం వెల్ల‌డించాల‌ని పిటిష‌న్‌లో కోరారు. అయితే గత పరీక్షల ఆధారంగా ఫైనల్ ఫలితాలు ఇవ్వడం కుదరదని సుప్రీం చెప్పింది.

ఫైనల్ ఇయర్ కాలేజీ పరీక్షలు సెప్టెంబర్ 30 లోగా జరగాలని జాతీయ విద్యా సంస్థ యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి పరీక్షలు తప్పనిసరి అని యూజీసీ పేర్కొంది. పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇవ్వలేమని తెలిపింది. ‘పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇవ్వడానికి రాష్ట్రాలకు అధికారం లేదు. కావాలంటే పరీక్షల గడువును పొడిగించడానికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంది’ అని యూజీసీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దాంతో పరీక్షల గడువు పెంపుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సెప్టెంబర్ 30 లోగా పరీక్షలు నిర్వహించలేమని రాష్ట్రాలు భావిస్తే.. గడువు పొడిగింపు కోసం యూజీసీని సంప్రదించవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఆర్. సుభాష్ రెడ్డి, ఎంఆర్ షా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ తీర్పు ఇచ్చారు.

For More News..

జర్నలిస్టులకు రూ. 50 లక్షల ఇన్సురెన్స్ కల్పించిన అస్సాం

‘రియల్’ టెన్షన్ పుట్టిస్తున్న రియల్ ఎస్టేట్ 

దేశంలో ఫస్ట్ టైం హయ్యస్ట్ రికార్డు కరోనా కేసులు

Latest Updates