‘నీట్’తోనే మెడికల్​ సీటు

అన్ని కాలేజీలకు ఒకటే ఎగ్జామ్
మినహాయింపు ఇవ్వడం కుదరదు
తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు బెంచ్

న్యూఢిల్లీ: వైద్య విద్యాసంస్థల్లో నేషనల్​ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్) ఆధారంగానే అడ్మిషన్స్ చేపట్టాలని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. దేశంలోని ప్రైవేట్, మైనారిటీ, ఎయిడెడ్, అన్​ ఎయిడెడ్​ వైద్యా విద్యాసంస్థలన్నీ ఈ విధానాన్నే ఫాలో కావాలని తేల్చి చెప్పింది. దీనివల్ల తమ హక్కులకు భంగం కలుగుతుందంటూ మైనారిటీ, ప్రైవేటు​ సంస్థల వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఈమేరకు పలు వైద్య విద్యా సంస్థలు దాఖలు చేసిన 76 పిటిషన్లను జస్టిస్​ అరుణ్​ మిశ్రా, జస్టిస్​ వినీత్​ శరణ్, జస్టిస్​ ఎంఆర్​ షాలతో కూడిన సుప్రీం బెంచ్ విచారించి, ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యను కమర్షియలైజ్​ చేయకుండా నీట్​ అడ్డుకుంటుందని బెంచ్​ అభిప్రాయపడింది.

మెరిట్​ లేకున్నా డబ్బుతో మెడికల్​ సీటును కొనుక్కునే విధానానికి నీట్​తో చెక్​ పెట్టొచ్చని పేర్కొంది. మెడికల్​ ఎడ్యుకేషన్​లోని చెడును తొలగించేందుకు నీట్​మొదటి అడుగని బెంచ్​ తెలిపింది. నీట్ కు ప్రత్యామ్నాయంగా ఎంట్రన్స్ నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలన్న ప్రైవేటు విద్యాసంస్థల అభ్యర్థనను కొట్టేసింది. ఈ విజ్ఞప్తిని ఆమోదించి, పాత విధానానికి మళ్లితే రాబోయే తరాలు తమను క్షమించవని జడ్జిలు పేర్కొన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి, సీట్లను కేటాయించడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదన్నారు. విద్యా సంస్థల నిర్వహణ సాఫీగా సాగేందుకు, ప్రమాణాలను కాపాడేందుకు ఉద్దేశించినవే రెగ్యులేటరీ మెజర్స్ అని బెంచ్​ పేర్కొంది. మేనేజ్​మెంట్ల ప్రత్యేక హక్కుల పేరుతో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా అడ్మిషన్స్ చేపట్టేందుకు కాదని స్పష్టం చేసింది. నీట్​ నుంచి ఏ ఇనిస్టిట్యూట్​కూ మినహాయింపు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

 

Latest Updates