చంద్రబాబు పథకాలపై సుప్రీం నోటీసులు

ఢిల్లీ: ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన నగదు బదిలీ పథకంపై దాఖలైన పిటీషన్ పై విచారణకు సుప్రీం కోర్టు అనుమతించింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వ పథకాల పేరుతో నగదు పంపిణీ చేశారని ఆరోపిస్తూ జనసేన పార్టీ నేత పెంటపాటి పుల్లారావు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు చంద్రబాబు ప్రభుత్వం పసుపు కుంకుమ,  అన్నదాత సుఖీభవ పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేశారని, అదే విధంగా నగదు బదిలీ పథకం పై నిషేధం కూడా విధించాలని పిటిషనర్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పథకాలను చట్టవిరుద్ధమైనవిగా,  రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సిద్ధమైన సుప్రీంకోర్టు  కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Latest Updates